కొత్త పార్టీ పెడుతున్నా.. అన్నామలై సంచలన నిర్ణయం
తమిళ రాజకీయాల్లో మరో కొత్త పార్టీ పురుడు పోసుకోనుంది. మాజీ ఐపీఎస్ అధికారి అన్నామలై త్వరలో కొత్త పార్టీ పెడుతున్నట్లు ప్రకటించారు.
తమిళ రాజకీయాల్లో మరో కొత్త పార్టీ పురుడు పోసుకోనుంది. మాజీ ఐపీఎస్ అధికారి అన్నామలై త్వరలో కొత్త పార్టీ పెడుతున్నట్లు ప్రకటించారు. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా పనిచేసిన అన్నామలై రెండు రోజుల క్రితమే ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను ఆమోదిస్తున్నట్లు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితీన్ నబీన్ ప్రకటించిన కొద్ది సేపటికే కొత్త పార్టీ పెడుతున్నట్లు అన్నామలై ప్రకటించారు. ప్రస్తుతం తమిళ రాజకీయాల్లో అన్నామలై నిర్ణయం తీవ్ర చర్చనీయాంశంగామారింది. తమిళనాడు బీజేపీలో సరికొత్త ఊపు తెచ్చిన మాజీ ఐపీఎస్ అధికారి కె. అన్నామలై కొత్త పార్టీ పెడితే రాష్ట్రం రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారే పరిస్థితి ఉందని విశ్లేషిస్తున్నారు.
ఐపీఎస్ ఉద్యోగానికి రాజీనామా చేసిన అన్నామలై రాజకీయాలపై ఆసక్తితో బీజేపీలో చేరారు. తమిళనాడులో ఆ పార్టీ బలోపేతానికి తీవ్రంగా కృషి చేశారు. ఎన్‌మణ్ ఎన్‌మక్కల్' (నా భూమి, నా ప్రజలు) పాదయాత్రతో ఊరూరా తిరిగి యువతలో గట్టి ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. పార్టీ బలోపేతానికి తీవ్రంగా కృషి చేసినప్పటికీ, ఎన్నికల ముందు పార్టీలో ఆయన ప్రాధాన్యం తగ్గిపోయింది. దీంతో 18 నెలలుగా పార్టీతో విభేదిస్తూ వచ్చారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ప్రకటించారు. ఈ పరిస్థితుల్లో పార్టీకి రాజీనామా చేయాలని గత డిసెంబరులోనే అనుకున్నా, కొన్ని కారణాల వల్ల వెనక్కి తగ్గారని అంటున్నారు.
ఇక గత నెలలో ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు ఓపికగా ఎదురుచూసిన అన్నామలై.. బీజేపీ కూటమి పరాజయంతో ఇక ఆ పార్టీలో ఎంత మాత్రం కొనసాగకూడదని నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. దీంతో రెండు రోజుల క్రితం ఢిల్లీ వెళ్లి హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితీన్ నబీన్ ను కలిసి రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించారు. ఆయన రాజీనామాను వెనక్కి తీసుకునేలా హోంమంత్రి అమిత్ షా ఒత్తిడి చేసినా మెత్తబడలేదని అంటున్నారు. కొత్త పార్టీ ఆలోచనతోనే అన్నామలై రాజీనామా నిర్ణయాన్ని ఉపసంహరించుకోలేదని వ్యాఖ్యానిస్తున్నారు.
తమిళనాడు ప్రయోజనాల విషయంలో బీజేపీ అధిష్టానం ఆలోచనలకు, తన భావాలకు ఎక్కడా పొంతన కుదరడం లేదని భావించిన అన్నామలై ఎట్టకేలకు సొంత పార్టీ పెడుతున్నట్లు ప్రకటించారు. కాగా, తమిళనాడులో బలపడాలంటే ఒంటరిగానే పోరాడాలన్న అన్నామలై నిర్ణయాన్ని కాదని, ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధిష్టానం మళ్లీ ఏఐఏడీఎంకేతో పొత్తు పెట్టుకోవడం ఆయనకు తీవ్ర అసంతృప్తిని కలిగించిందని వ్యాఖ్యానిస్తున్నారు. దీంతోనే పార్టీకి గుడ్ బై చెప్పారని వ్యాఖ్యానిస్తున్నారు. ఇక కొత్త పార్టీ పెడతానని ప్రకటించిన అన్నామలై, వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తామని స్పష్టం చేశారు.
అన్నామలై కొత్త పార్టీ ప్రకటనతో తమిళనాడు రాజకీయం ఇప్పుడు మరింత రసవత్తరంగా మారిందని అంటున్నారు. అన్నామలై పెట్టబోయే కొత్త పార్టీని ‘ద్రవిడియన్ 2.0’ అని పిలుస్తున్నారు. డీఎంకే, ఏఐఏడీఎంకే సాంప్రదాయ ద్రావిడ రాజకీయాలకు భిన్నంగా.. అవినీతి రహిత, యువత కేంద్రంగా సాగే తమిళ జాతీయవాదాన్ని ఆయన తెరపైకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే కోలీవుడ్ స్టార్ దళపతి విజయ్ తన 'తమిళగ వెట్రి కజగం' పార్టీతో దూసుకొచ్చి అసెంబ్లీ ఎన్నికల్లో భారీ ఓట్లు కొల్లగొట్టి ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన సక్సెస్ ఫార్ములా చూశాక, తమిళనాట ప్రాంతీయ సెంటిమెంట్‌కు మాత్రమే ఓట్లు పడతాయని, జాతీయ పార్టీ ముద్ర ఉంటే ద్రావిడ గడ్డపై నెగ్గుకు రావడం కష్టమని అన్నామలై గ్రహించినట్లు భావిస్తున్నారు. తాను సొంత పార్టీ పెడితేనే రాజకీయ ఆకాంక్షలు నెరవేర్చుకునే అవకాశం ఉండటంతో ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించారని అంటున్నారు.