పోలీసు స్టేషన్ లో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్.. ఏం జరిగింది?

మాజీ మంత్రి వైసీపీ నేత అనిల్ కుమార్ యాదవ్‌ సోమవారం పోలీసు విచారణకు హాజరయ్యారు.;

Update: 2025-08-04 11:01 GMT

మాజీ మంత్రి వైసీపీ నేత అనిల్ కుమార్ యాదవ్‌ సోమవారం పోలీసు విచారణకు హాజరయ్యారు. నెల్లూరు డీఎస్పీ కార్యాలయంలో ఆయనతోపాటు మరో ముగ్గురిని పోలీసులు ప్రశ్నించారు. వారి వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్నారు. కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డిపై అనుచిత వ్యాఖ్యల కేసులో అనిల్ కుమార్ యాదవ్‌ను పోలీసులు నిందితుడిగా చేర్చారు. ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి ఏ1గా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ప్రశాంతిరెడ్డి ఫిర్యాదుతో ప్రసన్నకుమార్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్ పై పోలీసులు కేసులు నమోదు చేశారు. అయితే తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ అనిల్ కుమార్ యాదవ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ విచారణలో ఉండగానే పోలీసులు రెండుసార్లు ఆయనకు నోటీసులుజారీ చేశారు.

ఇప్పటికే ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి ఫిర్యాదుపై ఏ1 ప్రసన్నకుమార్ రెడ్డిని పోలీసులు ప్రశ్నించగా, ఏ2 అనిల్ కుమార్ యాదవ్‌ తోపాటు మరికొందరు నిందితులను సోమవారం విచారించారు. వందల మంది కార్యకర్తలను వెంట బెట్టుకుని డీఎస్పీ కార్యాలయానికి వచ్చిన అనిల్ కుమార్ యాదవ్ నుంచి పోలీసులు లిఖిత పూర్వక వాంగ్మూలం తీసుకున్నట్లు చెబుతున్నారు. వాస్తవానికి అనిల్ కుమార్ విచారణ కోసం గత నెల 2న ఒక సారి నోటీసులిచ్చారు. 26న జరగాల్సిన విచారణకు ఆయన రాకపోవడంతో గత నెల 29న మరోసారి నోటీసులు జారీ చేశారు. దీంతో ఈ రోజు అనిల్ కుమార్ యాదవ్ పోలీసుస్టేషనుకు వచ్చారు. అయితే విచారణకు ఆయన వస్తారా? రారా? అన్న విషయమై ఉదయం వరకు పెద్ద చర్చ నడిచింది.

అయితే సందేహాలను పటాపంచలు చేస్తూ అనిల్ కుమార్ యాదవ్ డీఎస్పీ కార్యాలయంలో జరిగే విచారణకు హాజరయ్యారు. ఆయనకు మద్దతుగా వందల మంది కార్యకర్తలు తరలిరావడంతో డీఎస్పీ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఇక అనిల్ కుమార్ విచారణ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తారు. అయితే అనిల్ ను అరెస్టు చేస్తారా? మళ్లీ విచారణకు రమ్మంటూ నోటీసులు ఇస్తారా? అన్నది స్పష్టం కావాల్సివుంది.

Tags:    

Similar News