అంబానీకి ఊహించని షాక్: ఎస్‌బీఐ 'ఫ్రాడ్' ముద్రతో కలకలం

ఎస్‌బీఐ 'ఫ్రాడ్' ప్రకటన ఇది కొత్త పరిణామం కాదు. 2021 జనవరి 5న ఎస్‌బీఐ మొదటిసారిగా సీబీఐకి ఫిర్యాదు చేయగా, ఢిల్లీ హైకోర్టు ఆ సమయంలో స్టే ఇచ్చింది.;

Update: 2025-07-22 14:02 GMT

భారత పారిశ్రామిక రంగంలో ఒకప్పుడు వెలుగు వెలిగిన పేరు అనిల్ అంబానీ. ధీరుభాయ్ అంబానీ వారసుడిగా రిలయన్స్ గ్రూప్‌ను ముందుకు నడిపించిన ఆయన, కొన్నేళ్లుగా ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. అప్పుల్లో కూరుకుపోయిన అనిల్ అంబానీకి తాజాగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) నుంచి మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఎస్‌బీఐ రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కాం) సంస్థను, అలాగే అనిల్ అంబానీని 'ఫ్రాడ్' (మోసగాడు) గా ప్రకటించింది.

ఈ విషయాన్ని 2025 జూన్ 13న కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లోక్‌సభలో వెల్లడించడంతో రాజకీయ, వ్యాపార వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

రుణ వ్యవహారంలో మోసం ఆరోపణలు

రిలయన్స్ కమ్యూనికేషన్స్ సంస్థ ఎస్‌బీఐ నుంచి రూ. 2227.64 కోట్ల రుణాన్ని పొందింది. అయితే, ఈ రుణాన్ని తిరిగి చెల్లించకపోగా, సంస్థ దివాలా నియమావళి ప్రకారం కార్పొరేట్ ఇన్సాల్వెన్సీ రిజల్యూషన్ ప్రాసెస్ (CIRP) కు వెళ్లింది. అంతేకాకుండా, బ్యాంక్ గ్యారంటీల రూపంలో రూ. 786.52 కోట్లను కూడా ఎస్‌బీఐ చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఈ నేపథ్యంలోనే ఎస్‌బీఐ అనిల్ అంబానీ, ఆయన సంస్థను 'ఫ్రాడ్' వర్గంలోకి చేర్చి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ)కి జూన్ 24న నివేదించింది. స్టాక్ ఎక్స్ఛేంజ్‌కి కూడా జూలై 1న ఈ సమాచారాన్ని అందించింది.

గతంలోనూ ప్రయత్నాలు.. కోర్టుల బ్రేక్

ఎస్‌బీఐ 'ఫ్రాడ్' ప్రకటన ఇది కొత్త పరిణామం కాదు. 2021 జనవరి 5న ఎస్‌బీఐ మొదటిసారిగా సీబీఐకి ఫిర్యాదు చేయగా, ఢిల్లీ హైకోర్టు ఆ సమయంలో స్టే ఇచ్చింది. 2023 మార్చి 27న సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఎస్‌బీఐ తన 'ఫ్రాడ్' వర్గీకరణను తాత్కాలికంగా వెనక్కి తీసుకుంది. అయితే, 2024 జూలై 15న జారీ అయిన ఆర్‌బీఐ తాజా మార్గదర్శకాల ప్రకారం అన్ని విధానాలను పాటించి, ఎస్‌బీఐ తిరిగి అనిల్ అంబానీ, ఆర్‌కాంలను 'ఫ్రాడ్'గా వర్గీకరించింది.

రూ.31,000 కోట్ల రుణాల దుర్వినియోగం ఆరోపణ

బ్యాంకు వర్గాల సమాచారం ప్రకారం, ఆర్‌కాం అనుబంధ సంస్థలు రూ.31,000 కోట్లకు పైగా రుణాలను వివిధ బ్యాంకుల నుంచి తీసుకుని, వాటిని గ్రూప్‌కు చెందిన ఇతర సంస్థలకు మళ్లించాయని ఆరోపణలు ఉన్నాయి. ఇదంతా ఆర్‌బీఐ ఫ్రాడ్ మేనేజ్‌మెంట్ గైడ్‌లైన్స్‌కు విరుద్ధంగా జరిగిందని ఎస్‌బీఐ తన నిర్ణయం తీసుకుంది.

సీబీఐకి ఫిర్యాదుకు సిద్ధం

ఈ పరిణామాల నేపథ్యంలో ఎస్‌బీఐ ఇప్పుడు సీబీఐకు అధికారికంగా ఫిర్యాదు చేయడానికి సిద్ధమవుతోంది. ఒకానొక కాలంలో ఆసియా అత్యంత ధనికుల్లో ఒకరిగా వెలుగొందిన అనిల్ అంబానీకి ఇది మరొక పెద్ద ఎదురుదెబ్బగా కనిపిస్తోంది.

పారిశ్రామిక రంగంలో కీర్తిప్రతిష్టలను సంపాదించిన అనిల్ అంబానీకి ఈ తాజా పరిణామం తీవ్రమైన దెబ్బే అని చెప్పొచ్చు. ఆర్థిక వ్యవహారాల్లో పారదర్శకత, నిబంధనల పాటింపు ఎంత కీలకమో ఈ సంఘటన మరోసారి రుజువు చేస్తోంది.

Tags:    

Similar News