చంద్రబాబు డబ్బులు వేస్తే.. బ్యాంకు వాళ్లు లాగేసుకున్నారు... కాస్త చూడరూ?
అవును... ఏపీలో కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించిన "తల్లికి వందనం" పథకాన్ని ఇటీవల ప్రారంభించిన సంగతి తెలిసిందే.;
ఏపీలో కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సూపర్ సిక్స్ పథకాల్లో ఒకటైన "తల్లికి వందనం" పథకాన్ని తాజాగా అమలు చేసిన సంగతి తెలిసిందే. కూటమి పాలన్న ఏడాది పూర్తైన సందర్భంగా ఈ తల్లికి వందనం పథకాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తూ అమలు చేసింది. ఈ సమయంలో డబ్బులు డ్రా చేసుకునేందుకు వెళ్లిన మహిళలకు బ్యాంకులు మెలిక పెడుతున్నాయనే విషయం తాజాగా తెరపైకి వచ్చింది.
అవును... ఏపీలో కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించిన "తల్లికి వందనం" పథకాన్ని ఇటీవల ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఈ పథకానికి అవసరమైన నిధులను కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా... విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.13,000.. స్కూలు మెయింటినెన్స్ మొదలైన పనుల నిమిత్తం రూ.2,000 కేటాయించినట్లు ప్రకటించింది.
ఈ సమయంలో ఆ డబ్బులు వెంటనే తల్లుల ఖాతాల్లో జమయ్యాయి. మరోవైపు ఇప్పటికే స్కూల్స్ ప్రారంభమవ్వడంతో.. ఆ డబ్బులు తీసుకుందామని బ్యాంకుల వద్దకు వెళ్లిన మహిళలకు.. బ్యాంకు అధికారులు మెలిక పెడుతున్నారు. వారి పొదుపు రుణ బాకీని కారణంగా చూపిస్తూ పిల్లల చదువుల కోసం ప్రభుత్వం ఇచ్చిన రూ.13 వేల మొత్తాన్ని ఆపేస్తున్నారు! ఈ విషయం తాజాగా తెరపైకి వచ్చింది.
వివరాళ్లోకి వెళ్తే... తిరుపతి జిల్లా వాకాడు ఎస్సీ కాలనీకి చెందిన ఓ విద్యార్థి తల్లి.. ప్రభుత్వం జమ చేసిన "తల్లికి వందనం" డబ్బులు రూ.13,000 డ్రా చేసుకునేందుకు స్థానిక బ్యాంక్ కు వెళ్లింది. ఈ సమయంలో బ్యాంక్ అధికారులు ఓ మెలిక పెట్టారు! ఇందులో భాగంగా.. అప్పటికే ఆమె పొదుపు రుణం బాకీ ఉందని చెబుతూ.. రూ.13వేలను దానికి జమ చేశామని అధికారులు (చావు కబురు చల్లగా) చెప్పారు.
స్కూల్స్ ప్రారంభమయ్యాయి, తమ కుమారుడి చదువుకు ఖర్చులు ఉన్నాయి అని ఆమె ప్రాధేయపడినా అధికారులు ససేమిరా అన్నారు. దీంతో.. చేసేదేమీ లేక ఆమె బ్యాంక్ నుంచి వెనుదిరిగింది. ఇలా ఆమె ఒక్కరే కాదు.. రాష్ట్రంలో చాలా మంది తల్లులకు శుక్రవారం బ్యాంకుల వద్ద ఇలాంటి అనుభవమే ఎదురైందని అంటున్నారు. దీనిపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి!
ప్రభుత్వం పిల్లల చదువులకు కోసం వేసిన డబ్బును.. తల్లుల అప్పుల పేరుతో జమ చేయడం ఏమిటంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై స్పందించిన గూడూరు ఉప విద్యాధికారి.. 'తల్లికి వందనం' తీసుకోవద్దని బ్యాంకు అధికారులతో మాట్లాడతామన్నారు. అయితే.. ఇది కేవలం గూడూరుకు మాత్రమే పరిమితమైన సమస్య కాదని.. ఈ విషయంలో నేరుగా లోకేష్ కల్పించుకోంటే సమస్య పరిష్కారమవుతుందని తల్లులు కోరుతున్నారు!
కాగా... రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పేదింటి పిల్లల చదువుకు సాయంగా తల్లికి వందనం పేరుతో ఇంట్లో ఎంత మంది పిల్లలుంటే అంతమందికీ ఒక్కొక్కరికీ రూ.13 వేలు చొప్పున నిధులను చంద్రబాబు గురువారం విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీంతో.. శుక్రవారం బ్యాంకుల్లోని తల్లుల ఖాతాలకు ఆ నగదు జమ అయ్యింది. దీంతో... శుక్రవారం రాష్ట్రంలోని బ్యాంకుల వద్ద సందడి నెలకొంది.