బాబు ఐడియా: కొన్ని మైన‌స్‌లకు 'ఇది' ప్ల‌స్‌!

ఏ రాష్ట్రంలో అయినా.. ఏ ప్ర‌భుత్వంలో అయినా.. ఎన్ని సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లు చేసినా.. ఇవి అందిన వారు హ్యాపీనే.;

Update: 2025-08-06 10:30 GMT

ఏ రాష్ట్రంలో అయినా.. ఏ ప్ర‌భుత్వంలో అయినా.. ఎన్ని సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లు చేసినా.. ఇవి అందిన వారు హ్యాపీనే. కానీ.. అంద‌రికీ అందాల‌ని లేదుక‌దా?. కార‌ణాలు ఏవైనా.. కొంద‌రు మాత్రం నిరుత్సాహంతో నే ఉంటారు. ముఖ్యంగా మ‌హిళ‌ల విష‌యంలో అయితే.. ఈ త‌ర‌హా నిరుత్సాహం మ‌రింత కామ‌న్‌. కానీ.. అర్హ‌త‌లు, ప్రామాణికాల‌ను దృష్టిలో పెట్టుకుంటే.. ప్ర‌భుత్వం అమ‌లు చేసే సంక్షేమ కార్య‌క్ర‌మాలు అంద‌రికీ చేరువ కావ‌డం క‌ష్ట‌సాధ్యం.

ఇలానే.. ఏపీలోనూ ప్ర‌స్తుతం కూట‌మి ప్ర‌భుత్వం అందిస్తున్న 'సూప‌ర్ 6' స‌హా.. ఇత‌ర ప‌థ‌కాల వ్య‌వ‌హారంలో 35 శాతం మంది ప్ర‌జ‌లు తీవ్ర అసంతృప్తితో ఉన్నార‌ని ప్ర‌భుత్వానికి స్ప‌ష్టత వ‌చ్చింది. ఒక‌వైపు సామాజిక భ‌ద్ర‌తా పింఛ‌న్ల‌ను పెంచి ఇస్తున్నా.. మ‌రోవైపు.. త‌ల్లికి వంద‌నం కింద ఇంట్లో ఎంత మంది పిల్ల‌లు ఉంటే అంత‌మందికీ రూ.15 వేల చొప్పున ఇచ్చినా.. రైతు భ‌రోసా ఇచ్చినా.. ఈ నిరాస‌.. అసంతృప్తి మాత్రం కొన‌సాగుతోంది. ఈ విష‌యంపై సీఎం చంద్ర‌బాబు నివేదిక‌లు తెప్పించుకున్నారు.

ఈ క్ర‌మంలోనే 35 శాతం మంది తీవ్ర స్తాయిలో, 21 శాతం మంది.. మ‌ధ్య స్థాయిలో అసంతృప్తితో ఉన్నార ని గుర్తించారు. మ‌రీ ముఖ్యంగా మ‌హిళ‌ల్లో ఈ అసంతృప్తి పాళ్లు ఎక్కువ‌గానే ఉన్నాయ‌న్న‌ది ప్ర‌భుత్వానికి అందిన నివేదిక‌లు స్ప‌ష్టం చేస్తున్నాయి. ఇక‌, 42 శాతం మంది మాత్ర‌మే సంక్షేమ ప‌థ‌కాల కార‌ణంగా సంతృప్తితో ఉన్నార‌న్న‌ది ప్ర‌భుత్వానికి చేరిన స‌మాచారం. మ‌రో 2 శాతం మంది త‌ట‌స్థంగా ఉన్నారు. దీంతో ఇప్పుడు అన్ని బారికేడ్లు తొల‌గించి.. అంద‌రినీ సంతృప్తి ప‌ర‌చాల‌న్న‌ది సీఎం చంద్ర‌బాబు వ్యూహం.

ఈ క్ర‌మంలోనే నిన్న మొన్న‌టి వ‌ర‌కు కూడా ఏడాదికి రూ.350 కోట్ల మేర‌కు ఖ‌ర్చ‌వుతుంద‌న్న ఉచిత ఆర్టీసీ బ‌స్సు ప్ర‌యాణంపై త‌ట‌ప‌టాయించిన సీఎం.. ఇప్పుడు సుమారు 2000 కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చ‌వుతుందని తేలినా... పచ్చ‌జెండా ఊపేశారు. నిన్నటి వ‌ర‌కు .. కేవ‌లం జిల్లాల‌కు మాత్ర‌మే ప‌రిమిత‌మ‌ని.. ప‌ల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ స‌ర్వీసుల‌కు మాత్ర‌మే లిమిట్ అని చెప్పిన ఈ ప‌థ‌కాన్ని ఇప్పుడు.. డీల‌క్స్‌, ల‌గ్జ‌రీ వ‌ర‌కు పొడిగించారు.

రాష్ట్ర వ్యాప్తంగా అంద‌రు మ‌హిళ‌ల‌కు దీనిని అందుబాటులోకి తెస్తున్నారు. అంటే.. ఇక‌, పేద‌, మ‌ధ్య‌త‌రగ‌తి, ఉన్న‌త స్థాయి అనే తేడా లేకుండా.. అన్ని వ‌ర్గాల మ‌హిళ‌ల‌ను మెప్పించ‌వ‌చ్చ‌న్న‌ది బాబు ఐడియా. సో.. ఈ క్ర‌మంలోనే 2000 కోట్లయినా ఫ‌ర్వాలేద‌ని ప‌చ్చ‌జెండా ఊపేశారు. అంటే.. కొన్ని మైన‌స్‌ల‌ను చెరిపేసేందుకు ఒక్క ప్ల‌స్‌ను ఎంచుకున్నార‌న్న మాట‌.

Tags:    

Similar News