ఆగస్టు 15 గిఫ్ట్ - ఏపీలో కొత్త పధకం !
మరో మూడు నెలలలో ఏపీ ప్రభుత్వం అయిదు కోట్ల ప్రజలకు ఒక గిఫ్ట్ ఇవ్వబోతోంది. ఒక మంచి పధకాన్ని ప్రకటించబోతోంది. ఆ పధకం ఆగస్ట్15 దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన శుభ వేళ ప్రకటించాలని కూటమి నిర్ణయించింది.
ఆరోగ్యమే సంపద :
చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం యాదమరి మండలం కండ్రిగలో జరిగిన సంజీవని కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు ఈ సందర్భంగా ఏపీ ప్రజల ఆరోగ్యం విషయంలో కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. అసలైన సంపద ఆరోగ్యమే అని ఆయన అన్నారు. సంపద కంటే ఆరోగ్యం ఉన్న వాళ్లే అదృష్టవంతులు అని ఆయన చెప్పారు. అందుకే ఆరోగ్యమే మహాభాగ్యం పెద్దలన్నారని గుర్తు చేశారు. సమాజం బాగుండాలంటే ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని ముఖ్యమంత్రి పేర్కొంటూ అందుకే ప్రిడిక్టివ్, ప్రివెంటివ్, క్యూరేటివ్ అనే విధానంలో సంజీవని ప్రాజెక్ట్ కి ప్రారంభించామని అన్నారు.
పైలెట్ ప్రాజెక్ట్ గా :
గత ఏడాది జూలైలో కుప్పంలో సంజీవని ప్రాజెక్టును పైలట్ గా ప్రారంభించామని, అలాగే ఈ ఏడాది మార్చి 15 నుంచి చిత్తూరు జిల్లాలో చేపట్టామని బాబు వివరించారు.ఇక చిత్తూరు జిల్లాలోని 19.75 లక్షల మంది ఆరోగ్యాన్ని కాపాడేలా కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని బాబు అన్నారు. దీంతో ఈ ఏడాది ఆగస్టు 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా సంజీవని ప్రాజెక్టును ప్రారంభించాలని నిర్ణయించామని బాబు ప్రకటించారు. ఈ పధకం ద్వారా మొత్తం 42 వైద్య పరీక్షలను ఇంటి వద్దే నిర్వహించి రిపోర్టులు ఇచ్చేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని బాబు చెప్పారు. అత్యుత్తమ వైద్య సేవలను ప్రజలకు అందుబాటులో తీసుకువచ్చేలా సంజీవని కార్యక్రమం రూపకల్పన చేశామని చంద్రబాబు తెలిపారు.
డిజిటల్ హెల్త్ రికార్డులతో :
సంజీవిని పేరు పెట్టడానికి కూడా ప్రధాన కారణాలను బాబు వివరించారు. రామ రావణ యుద్ధ సమయంలో లక్ష్మణుడి ఆరోగ్యాన్ని కాపాడేందుకు హనుమంతుడు తెచ్చిన ఔషధి సంజీవని అని ఆయన పురాణ గాధ గుర్తు చేశారు. అందుకే సంజీవని పేరిట డిజిటల్ హెల్త్ రికార్డులతో ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఆలోచన చేశామని అన్నారు. ఎవరికైనా తీవ్రమైన వ్యాధులు రాకముందే హెచ్చరించి దానికి అనుగుణంగా చికిత్సలు అందేలా చేయటమే నిజమైన అభివృద్ధి అని బాబు అన్నారు. అలా ప్రజా ఆరోగ్యానికి అవసరమైన ప్రతీ అంశాన్ని సంజీవని ప్రాజెక్టు ద్వారా పర్యవేక్షిస్తామని ఆయన తెలిపారు. డాక్టర్ అప్పాయింట్ మెంట్ తో పాటు వర్చువల్ కనెక్ట్ ద్వారా వైద్య సలహాలు సంజీవని కార్డు ద్వారా డిజిటల్ హెల్త్ రికార్డుల పర్యవేక్షణ చేస్తున్నామని ముఖ్యమంత్రి చెప్పారు.
త్వరలోనే ఏఐ డాక్టర్ :
ఇక ఏపీకి త్వరలోనే ఏఐ డాక్టర్ కూడా రాబోతున్నారు అని బాబు తెలిపారు. ఏఐ డాక్టర్ ద్వారా వైద్య సేవలు ప్రజలు అంతా పొందేలా చర్యలు చేపడుతున్నామని ఆయన చెప్పారు. అలాగే ప్రజల వ్యక్తిగత ఆరోగ్య రికార్డులన్నీ డిజిటల్ గా మారుస్తామని అన్నారు. ఇక సంజీవని అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన సిటిజన్ వెల్ నెస్ మిషన్ గా బాబు అభివర్ణించారు. ఇల్ నెస్ నుంచి వెల్ నెస్ కేర్ కోసం సంజీవని ప్రాజెక్టు ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. సంజీవని అనేది ఓ సాఫ్ట్ వేర్ మాత్రమే కాదని అత్యుత్తమ డిజిటల్ పబ్లిక్ హెల్త్ ఆపరేటివ్ సిస్టమ్ అని బాబు స్పష్టం చేశారు. అత్యుత్తమ వైద్య సేవలతో పాటు ఆధునిక వైద్యం ఇంటి వద్దే వర్చువల్ గా అందించేలా సంజీవని ప్రాజెక్టును తీసుకువచ్చామని బాబు చెప్పడం విశేషం.