పైన కాదు కిందకు చూడు...ఏపీ పాలిటిక్స్ లో బిగ్ చేంజ్ !
అలాంటి ఉదంతాలు ఉదాహరళు ఏపీలోనూ దేశంలోనూ చాలా చోట్ల జరిగాయి. ఆ బాధిత రాజకీయాన్ని చూసి అంతా ఇపుడు సర్దుకుంటున్నారు.
రాజకీయం అంటే టాప్ లెవెల్ లో సాగేది. అంతా అంతపురం రహస్యాల మాదిరిగా ఉండేది. కోటలూ కోటరీలు అగ్ర నాయకుల మంతనాలు అక్కడే నిర్ణయాలు వాటిని అమలు చేయమని పై నుంచి దిగువ దాకా ఆదేశాలు. దాంతో రాజకీయం రక్తి కట్టేది. అంతా బాగానే సాగిపోయేది. రాజకీయ అధినాయకత్వాలు సైతం తమ చుట్టూ నలుగురుని ఉంచుకుని వారితోనే పార్టీ అంతా అనుకుంటూ పోతే అది ఇంకా బాగుండేది. కానీ కాలం మారుతోంది. అభిప్రాయాలు కూడా మారుతున్నాయి. రాజకీయం అంటే పైన కాదు కిందకు చూడు అంటోంది లేకపోతే పునాదులు సైతం కూలి మొత్తం రాజకీయమే కుప్ప కూలుతుందని కూడా హెచ్చరిస్తున్నారు. అలాంటి ఉదంతాలు ఉదాహరళు ఏపీలోనూ దేశంలోనూ చాలా చోట్ల జరిగాయి. ఆ బాధిత రాజకీయాన్ని చూసి అంతా ఇపుడు సర్దుకుంటున్నారు.
కార్యకర్తే జీవగర్ర :
ఏ రాజకీయ పార్టీకి అయినా కార్యకర్తలే ముఖ్యం. వారే జీవ గర్ర. ఒక విధంగా చెప్పాలీ అంటే రాజకీయ పార్టీ అనే భవనానికి పునాదులు పైన ఎక్కడో లేవు. అవి భూతలం మీదనే ఉన్నాయి. గ్రొండ్ లెవెల్ లోనే ఉన్నాయి. అక్కడ కనుక పటిష్టంగా లేకపోతే ఎంతటి భవనం అయినా కుప్ప కూలుతుంది. ఇది అవగతం అయిన రాజకీయ పార్టీలు ఇపుడు అంతా కిందకే చూస్తున్నాయి. క్షేత్ర స్థాయికే ప్రాధాన్యత ఇస్తున్నాయి. కార్యకర్తే మాకు కావాలి అని నినాదాలు ఇస్తున్నాయి. ఏపీలో తెలుగుదేశం వైసీపీ జనసేన పార్టీలలో ఇపుడు కార్యకర్తలకే అధిక ప్రాధాన్యత దక్కుతోంది.
సగటు నేతకు పొలిట్ బ్యూరో :
తెలుగుదేశం పార్టీలో సగటు కార్యకర్తలకు పొలిట్ బ్యూరో వంటి అత్యున్నత విధాయక మండలిలో చోటు కల్పించి తెలుగుదేశం తానేంటో నిరూపించుకుంది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకే పెద్ద పీట అని మాటలకే చెప్పడం కాదు చేతలలోనూ నిరూపించుకుంది. పార్టీలో కీలక పదవులు వారికే దక్కుతున్నాయి. నామినేటెడ్ పదవులు వారికే ఇస్తున్నారు. అంతే కాదు మంత్రుల దాకా కొత్త వారికి చాన్స్ ఇస్తూ టీడీపీలో ఒక కొత్త విప్లవానికి నాంది పలికింది. రానున్న కాలంలో కొత్త నాయకత్వం రావాలన్న పార్టీకి విజయాలు దక్కాలన్నా కూడా క్యాడర్ నుంచే అన్నది టీడీపీ అర్ధం చేసుకున్నంతగా ఎవరూ అర్థం చేసుకోలేదు అని చెప్పాల్సిందే.
వైసీపీ మేలుకుంటోంది :
ఇక వైసీపీ విషయం తీసుకుంటే ఆ పార్టీ కూడా మేలుకుంటోంది. 2024 ఎన్నికల్లో కార్యకర్తలు పార్టీని పట్టించుకోక్పోవడం వల్ల ఎంతటి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందో వైసీపీ కంటే ఎవరికీ ఎక్కువగా తెలియదు అని చెప్పాలి. అందుకే వైసీపీ ఎన్నికల అనంతరం కార్యకర్తల జపం చేస్తోంది. వైసీపీ 2.0లో కార్యకర్తలకే పెద్ద పీట అని అధినాయకత్వం పదే పదే చెప్పడం వెనక కూడా ఈ మూల సూత్రమే దాగి ఉంది. అధినాయకుడికి ఎంతటి ఇమేజ్ ఉన్నా గ్రౌండ్ లో పనిచేసేది క్యాడర్ మాత్రమే అని వారికి అసంతృప్తి కలిగి అలిగి దూరం వెళ్తే పార్టీ పుట్టె మునుగుతుందని అనుభవం పూర్వకంగా తెలుసుకున్న వైసీపీ దిద్దుబాటు చర్యలకు దిగుతోంది. అందులో భాగమే బూత్ లెవెల్ దాకా కమిటీలు వేయడంతో పాటు పనిమంతులకు పార్టీలో కీలక స్థానాలు కల్పిస్తమని చెబుతోంది. అలా వైసీపీ బూత్ లెవెల్ కార్యకర్తలే మార్గదర్శకులు అంటోంది.
సాధకులతో సేన :
ఇక ఏపీలో మరో కీలక పార్టీ జనసేన సాధకులతో పార్టీని కొత్త పుంతలు తొక్కిస్తోంది. ఉద్యమి సాధక్ అంటూ జనసేన కొత్త అంగాలను నిర్మించింది. వీరంతా కూడా గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చిన వారే కారణం. అధినేత పవన్ సైతం సాధకులే పార్టీకి వెన్నెముక అని స్పష్టంగా చెప్పారు. వారి సేవలను పార్టీ వినియోగించుకుంటుంది అని కూడా భరోసా ఇచ్చారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసే సాధకులకు గుర్తింపు కచ్చితంగా ఉండేలా జనసేనలో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. మొత్తం మీద చూస్తే రాజకీయం మారుతోంది. పక్క ఉన్న అగ్ర నేతలను చూసి ధీమా పడే రోజులు పోయాయి. వారే పార్టీ అనుకుని నిర్ణయాలు ఏకపక్షంగా తీసుకుంటే బొక్క బోర్లా పడతామన్నది కూడా పార్టీలకు అర్ధం అయింది. దాంతో కష్టించి పనిచేసే కార్యకర్తలకు ఇపుడు మంచి రోజులు వస్తున్నాయని అంటున్నారు. అంతే కాదు వీరి నుంచి రాబోయే కాలానికి కాబోయే నాయకులు పుట్టుకుని వస్తారని కూడా చెబుతున్నారు.