లోకేష్ సీఎం...ఈ ప్రచారం నిజమేనా ?

ఏపీలో ఒక ప్రచారం అయితే పెద్ద ఎత్తున సాగుతోంది. అది రాజకీయ ప్రచారం పైగా అధికార కూటమికి సంబంధించిన ప్రచారం.;

Update: 2026-03-03 03:45 GMT

ఏపీలో ఒక ప్రచారం అయితే పెద్ద ఎత్తున సాగుతోంది. అది రాజకీయ ప్రచారం పైగా అధికార కూటమికి సంబంధించిన ప్రచారం. అతి ముఖ్యమైన కీలకమైన సున్నితమైన అంశానికి సంబంధించి సాగుతున్న ప్రచారం. మరి ఈ ప్రచారాన్ని కూటమిలో ఎవరు ఎంత వరకు సీరియస్ గా తీసుకుంటున్నారు అన్నది అయితే తెలియదు కానీ సోషల్ మీడియాలో అయితే పెద్ద ఎత్తున సాగుతోంది. కొన్ని చానల్స్ కూడా దీని మీద ఇప్పటికే స్టోరీలను వండి వారుస్తున్నాయి. డేట్ టైం ఫిక్స్ చేసేసాయి. అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్లుగా రకరకాలైన పోస్టులతో సోషల్ మీడియాలో ఈ అంశం మీదనే డిబేట్స్ పెడుతున్న వారూ ఉన్నారు.

అసలేమి జరుగుతోంది :

ఇదిలా ఉంటే ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి అచ్చంగా ఇరవై నెలలు మాత్రమే అయ్యాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు వంటి అనుభవశాలి నాయకత్వంలో ప్రభుత్వం సజావుగా సాగుతోంది. ఏపీలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. విభజన తరువాత వారసత్వంగా వచ్చిన సమస్యలు అధికంగా ఉన్నాయి. అలాగే ఆర్ధికంగా పెను సవాళ్ళు ఉన్నాయి. రాజధాని నిర్మాణం అతి పెద్ద టాస్క్. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడం మరో టార్గెట్. ఇలా అనేక రకాలుగా ఏపీ ముందుకు సాగాల్సి ఉంది. ఈ సమయంలో కూటమిలో నాయకత్వం మార్పిడి ఉంటుందా అది జరిగే పనేనా అన్నది ఒక సీరియస్ క్వశ్చన్ గా ముందుకు వస్తోంది.

మంచి ముహూర్తంగా :

అయితే ప్రచారం మాత్రం ఎక్కడా ఆగడం లేదు, ఉగాది వేళ ఏపీలో నాయకత్వం మార్పు ఉంటుందని లోకేష్ కి సీఎం గా బాధ్యతలు అప్పగిస్తారు అని చంద్రబాబు పార్టీ రాజకీయాలు చూసుకుంటారు అని ప్రచారం చేస్తున్నారు అవసరం అయితే ఆయన కేంద్ర రాజకీయాలకు వెళ్తారు అని కూడా చెబుతున్నారు. ఇక ఏపీలో మిత్ర పక్షాలు జనసేన బీజేపీ కూడా ఈ నాయకత్వం మార్పిడికి అంగీకరిస్తారా అంటే దాని మీద ఎవరికి తోచిన తీరులో కధనాలు వండుతున్నారు. జనసేన కూటమికి దూరం అవుతుందని అలాగే బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుందని కూడా కధనాలు ముందుకు వస్తున్నాయి. మరి ఏమిటి ఇదంతా అసలు ఏపీలో ఇలాంటి వాతావరణం ఉందా కూటమిలో ఆ మాదిరిగా సంకేతాలు అయినా కనిపిస్తున్నాయా అంటే మ్యాటర్ అయితే కేవలం సోషల్ మీడియాలోనే నలుగుతోంది తప్ప ఎక్కడా చడీ చప్పుడు కూడా లేదనే అంటున్నారు.

ప్రత్యర్ధుల ఎత్తుగడగా :

దీని మీద సోషల్ మీడియాలో కూటమి ప్రభుత్వం తరఫున సమర్ధించే వారు అభిమానులు టీడీపీని బలపరచే రాజకీయ విశ్లేషకులు చెబుతున్నది ఏమిటి అంటే ఇదంతా ప్రత్యర్ధులు చేస్తున్న ప్రచారం మాత్రమే అని. కూటమిలో ఎలాగైనా చీలిక తీసుకుని రావడానికి చూస్తున్నారు అని అంటున్నారు. ఏపీలో చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం బాగా ముందుకు సాగుతోందని దానిని దెబ్బ తీసేందుకే ఈ తరహా ప్రచారాన్ని కొందరు నమ్ముకున్నారని అంటున్నారు. మరి అది నిజమా లేక నిజంగానే కూటమిలో అలాంటి అభిప్రాయం ఉందా అంటే తెలియదనే అంటున్నారు. లోకేష్ మాత్రం మంత్రిగా తనదైన శైలిలో పనిచేసుకుంటూ పోతున్నారు. టీడీపీకి ఆయనే ఏకైక వారసుడు. మరి వారసుడికి ముఖ్యమంత్రి పదవిని తొందరగా అందించే విషయంలో ఆ పార్టీకి ఇప్పటికిప్పుడు అంత ఆసక్తి ఉందా అన్నదే మరో చర్చ. ఏది ఏమైనా ఇది ఒక రాజకీయ మసాలాగా చూడాలా లేక ఏమైనా ఉందా అంటే కాలమే జవాబు చెప్పాలని అంటున్నారు.

Tags:    

Similar News