జీఎస్టీ 2.0 సంస్కరణల ప్రభావాన్ని అధిగమించిన ఏపీ
జీఎస్టీలో రెండవ తరం సంస్కరణలు అమలు చేయడం వల్ల దేశవ్యాప్తంగా అనేక వస్తువుల మీద స్లాబ్స్ తగ్గిపోయాయి.;
జీఎస్టీలో రెండవ తరం సంస్కరణలు అమలు చేయడం వల్ల దేశవ్యాప్తంగా అనేక వస్తువుల మీద స్లాబ్స్ తగ్గిపోయాయి. కొన్ని అయితే లేకుండా పోయాయి. దీంతో ఏపీకి ఏకంగా ఎనిమిది వేల కోట్ల రూపాయల దాకా తగ్గుదల కనిపిస్తుందని అంచనా వేశారు. అయితే ఈ సంస్కరణల తర్వాత చూసినా ఏపీలో జీఎస్టీ వసూళ్ళు బాగానే ఉన్నాయి. దాంతో దేశంలో ఏపీ మంచి ప్లేస్ ని సొంతం చేసుకుంది అని చెబుతున్నారు.
వృద్ధి బాగానే :
నిజానికి చూస్తే ఏపీకి ఈ సంస్కరణల వల్ల ఇబ్బందికరమైన పరిస్థితి ఎదురవుతుందని అంతా అనుకున్నారు. జీఎస్టీ 2.0 సంస్కరణల ప్రభావాన్ని ఏపీ సమర్థవంతంగా ఎదుర్కొంది. 2025 నవంబర్ వరకు నికర జీఎస్తీ వసూళ్లలో చూస్తే కనుక 5.80 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఈ పురోగతి 2025 లో రాష్ట్రంలో పెరిగిన ఆర్థిక కార్యకలాపాలతో పాటు, పన్ను చెల్లింపుదారులలో కట్టుదిట్టంగా అనుసరించిన విధానం, కఠినమైన చర్యల అమలు వల్లనే సాధ్యపడింది అని చెబుతున్నారు.
నవంబర్ లో మాత్రం :
ఇక ఒకసారి విశ్లేషిస్తే కనుక ఏపీ 2025 నవంబర్‌లో మాత్రం ఒక మోస్తరు జీఎస్టీ వసూళ్లను నమోదు చేసింది. దీనికి కారణం ఈ ఏడాది సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వచ్చిన జీఎస్టీ 2.0 రేటు తగ్గింపుల వల్లనే అంటున్నారు. ప్రధానంగా దీని ప్రభావం ఆటోమొబైల్, సిమెంట్, ఎఫ్ ఎం జీసీ, వినియోగదారుల ఎలక్ట్రానిక్స్, పాడి ఉత్పత్తులు ఇతర అంశాలపైన ఉంది. వీటి మీదనే రేట్లు తగ్గించారు. దాంతో 2025 నవంబర్ వసూళ్లు ప్రధానంగా 2025 అక్టోబర్ నెల వ్యాపార లావాదేవీలకు సంబంధించినవి కావడంతో కొంత మందకొడిగా ఉన్నాయని చెబుతున్నారు.
లక్ష్యం చేరుకోవడం :
ఇక వివిధ విభాగాల వారీగా చూస్తే ఆదాయం తగ్గినా కట్టుదిట్టమైన అనుసరణ చర్యలతో బాగానే పెర్ఫార్మ్ చేసినట్లుగా ఆర్ధిక నిపుణులు చెబుతున్నారు. ఇక రేట్ల తగ్గింపు కారణంగా పెరిగిన లావాదేవీలతో కూడా జీఎస్టీ వసూళ్ళు కొత్త నంబర్ చూశాయని అంటున్నారు. ఆ వాల్యూమ్ మొత్తం ఆదాయం లక్ష్యం లోని 74 శాతం చేరుకునేందుకు దోహదం చేశాయని వివరిస్తున్నారు.
జీఎస్టీ ఆదాయం ఇలా :
ఇక ఒక్కసారి గమనిస్తే 2025 నవంబర్‌లో నికర జీఎస్టీ వసూళ్లు 2,697 కోట్ల రూపాయలుగా ఉంది. ఇది సంవత్సరానికి పైగా చూస్తే కనుక 4.60 శాతం తగ్గుదలగా కనిపిస్తుంది. ఇక మొత్తం కమర్షియల్ టాక్స్ రెవెన్యూ 4,124 కోట్ల రూపాయలుగా ఉంది. ఇది సంవత్సరానికి పైగా చూస్తే 3.17 శాతం తగ్గుదలగా నమోదు అయింది. అయితే సంస్కరణల మార్పుల సమయంలో అమలు చేసిన చర్యలు రెవెన్యూ స్థిరత్వాన్ని బాగానే చూపిస్తున్నాయని అంటున్నారు.
విభాగాల వారీగా చూస్తే :
ఇవన్నీ పక్కన పెడితే రాష్ట్ర జీఎస్టీ ఆదాయం 1,109.17 కోట్లుగా నమోదు అయింది. ఇది 2024 నవంబర్‌లోని 1,197.14 కోట్లతో పోలిస్తే 7.35 శాతం తగ్గుదలగా ఉంది. ఇది జీఎస్టీ 2.0 రేటు తగ్గింపుల కారణంగా సంభవించింది అని అధికారులు చెబుతున్నారు. ఆటోమొబైల్, సిమెంట్, ఎలక్ట్రానిక్స్, పాల ఉత్పత్తులపై తక్కువ రేట్ల ప్రభావం వల్లనే మొత్తం ఆదాయం తగ్గిందని అంటున్నారు అదే సమయంలో నిలకడగా ఆదాయం ఉంచుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలు ఈ డెబ్బై రోజులలలో ఎంతో ప్రభావం చూపించాయని అంటున్నారు. రానున్న కాలంలో తక్కువ రేట్ల మీద కూడా కొనుగోళ్ళు మరింతగా పెరిగి ఆదాయం ఇంకా పెద్ద ఎత్తున పెరిగేందుకు దోహదపడవచ్చు అని అంటున్నారు.