ఫిర్యాదుల పరిష్కారానికి ‘సింగపూర్’ మోడల్!

ఏపీలో ప్రజా సమస్యల పరిష్కారానికి సింగపూర్ మోడల్ అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు.;

Update: 2026-05-08 13:30 GMT

ఏపీలో ప్రజా సమస్యల పరిష్కారానికి సింగపూర్ మోడల్ అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. ప్రస్తుతం జిల్లా కేంద్రాల్లో ప్రతి సోమవారం నిర్వహిస్తున్న గ్రీవెన్స్ డే కార్యక్రమాన్ని సమూలంగా మార్చివేయడమే కాకుండా, నియోజకవర్గ మండల, గ్రామ స్థాయిలో ఫిర్యాదుల పరిష్కారంపై ఫోకస్ చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ అమలు చేయనున్నట్లు వెల్లడించారు. రెండో రోజు కలెక్టర్ల సదస్సుల్లో గ్రీవెన్స్ డే నిర్వహణపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షించారు. ప్రజల సమస్యలపై చిత్తశుద్ధితో పనిచేయాలని అధికారులకు సూచిస్తూ కీలక ఆదేశాలు జారీ చేశారు.

గ్రీవియన్స్ డేపై సీఎం కీలక ఆదేశాలు

ప్రతి సోమవారం జిల్లా కేంద్రాల్లో నిర్వహిస్తున్న గ్రీవెన్స్ డే మొక్కుబడి తంతుగా మారిపోయిందని ఆరోపణలు వినిపిస్తున్నాయని అంటున్నారు. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు స్పష్టమైన సూచనలు చేశారు. ఇప్పటివరకు గ్రీవెన్స్ డే కార్యక్రమానికి కేవలం జిల్లా కలెక్టర్ తోపాటు ఇతర జిల్లా స్థాయి అధికారులే హాజరయ్యేవారు. అయితే ఇప్పుడు సింగపూర్ మోడల్ అమలు చేయాలని భావిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు స్థానిక ప్రజాప్రతినిధులు అయిన ఎమ్మెల్యే, ఎంపీలను గ్రీవెన్స్ డేలో భాగస్వామ్యం చేయాలని కలెక్టర్లకు సూచించారు.

అదేవిధంగా ప్రజా ప్రతినిధులు-అధికారులు కలిసి గ్రీవెన్స్ డే నిర్వహించేందుకు ప్రజాదర్భార్ లాంటి ఓ వేదికను ఏర్పాటు చేయనున్నట్లు సీఎం వెల్లడించారు. ఫిర్యాదులు స్వీకరించే సమయంలోనే ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి పరిష్కరించే ప్రయత్నం చేయాలని సూచించారు. సింగపూర్ లో ఇదే రకంగా ఫిర్యాదుల పరిష్కారం జరుగుతోందని సీఎం వెల్లడించారు. మండల స్థాయిలోనూ పీజీఆర్ఎస్ లో వచ్చిన ఫిర్యాదులను పరిష్కరించటం ద్వారా ప్రజలకు మేలు జరుగుతుందని సీఎం భావిస్తున్నారు.

ప్రతి సోమవారం కలెక్టరేట్లో గ్రీవెన్స్ స్వీకరిస్తున్నట్టే ఇకపై ప్రతి శుక్రవారం నియోజకవర్గాల్లో గ్రీవెన్స్ స్వీకరించాలని సీఎం స్పష్టం చేశారు. ప్రతి శుక్రవారం ఫీల్డ్ గ్రీవెన్స్ డేగా పరిగణించాలని సూచించారు. ప్రస్తుతం ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గ కేంద్రాల్లో గ్రీవెన్స్ నిర్వహిస్తుండగా, ఇక నుంచి ఆ కార్యక్రమంలో అధికారులను భాగస్వామ్యం చేయడంతో ప్రజా సమస్యల పరిష్కారం వేగవంతం అవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అభిప్రాయపడుతున్నారని అంటున్నారు. సమస్యలు పరిష్కరిస్తే ప్రభుత్వానికి మంచి పేరు రావటంతోపాటు ప్రజల్లో విశ్వాసం పెరుగుతుందని సీఎం భావిస్తున్నారు.

ఇక గ్రీవెన్స్ నిర్వహించే అధికారులు, ప్రజాప్రతినిధులు ఆయా పత్రాలను కార్లో వదిలిపెట్టొద్దని, సమస్యకు పరిష్కారం చూపాల్సిన బాధ్యత తీసుకోవాలని హితవు పలికారు. అదేవిధంగా ప్రతి నెలా ఒక నియోజకవర్గాన్ని నాలుగు సార్లు సందర్శించాలని ఆదేశించారు. సమస్యల పరిష్కారానికి గుడ్ విల్ మిషన్ గా కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పనిచేయాలని చెప్పారు. ఇదే సమయంలో వీడియో కాన్ఫరెన్సులను నెలలో ఒక రోజుకు మాత్రమే పరిమితం చేయాలనే తన ఆలోచనను బయటపెట్టారు.

Tags:    

Similar News