ప్రజల సంతృప్తి.. ఈ సారి మరో లెవిల్.. !
ప్రజల సంతృప్తిని ఎప్పటికప్పుడు కొలుచుకుంటున్న సీఎం చంద్రబాబు ఈ దఫా మరింత దూకుడుగా నిర్ణయం తీసుకుంటున్నారు.;
ప్రజల సంతృప్తిని ఎప్పటికప్పుడు కొలుచుకుంటున్న సీఎం చంద్రబాబు ఈ దఫా మరింత దూకుడుగా నిర్ణయం తీసుకుంటున్నారు. ప్రధానంగా ఇప్పటి వరకు నాయకులు, ఎమ్మెల్యేల వ్యవహార శైలిపై ఆయ న సమీక్షలు చేస్తున్నారు. ప్రజల సంతృప్తి పెరిగేలా చర్యలు తీసుకుంటున్నారు. దీని వల్ల కొంత మార్పు అయితే కనిపించింది. ప్రజల సంతృప్తి స్థాయిలో మార్పులు కనిపించాయి. తొలినాళ్లలో 65-70 మధ్య ఉన్న సంతృప్త స్థాయిలు 80 శాతానికి పెరిగాయి.
ఇక, ఇప్పుడు మరో లెవిల్‌లో ప్రజల సంతృప్త స్థాయిలు పెంచాలన్నది ప్రభుత్వ ఆలోచన. ఈక్రమంలోనే సీఎం చంద్రబాబు ఇటీవల ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. ప్రతి శాఖలోనూ.. సంతృప్త స్థాయిలు ఉండాలని.. అవి పెరగాలని వారికి సూచించారు. అంతేకాదు.. వచ్చే నెల నాటికి సంతృప్త స్థాయిలో మార్పులు రావాలని సూచించారు. ప్రధానంగా రెవెన్యూ, దేవదాయ, హోం శాఖల విషయంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. వీటిలో సంతృప్త స్థాయిలు పెరగాలన్నది చంద్రబాబు చేసిన సూచన.
ప్రస్తుతం ఈ మూడు శాఖల్లోనూ ప్రజల సంతృప్త స్థాయిలో భిన్నంగా ఉంటున్నాయి. రెవెన్యూ శాఖ పరిధి లో 40-50 శాతం లోపే సంతృప్తిగా ఉన్నారన్నది ప్రధాన చర్చ. నిజానికి నిరంతరం ప్రజలతో మమేకమ వుతున్న శాఖ కూడా ఇదే. భూముల రిజిస్ట్రేషన్ నుంచి ఆస్తుల వరకు.. అన్నివిషయాలతోనూ ప్రజలతో నేరుగా సంబంధం ఉన్న శాఖ ఇది. అయితే.. ఈ విషయంలో ప్రజలు అసంతృప్తిగా ఉన్నారన్నది ప్రభుత్వానికి అందుతున్న సమాచారం.
ఇక, హోం శాఖ విషయంలోనూ మరింత ఎక్కువగా ప్రజల్లో అసంతృప్తి కనిపిస్తందన్నది ప్రభుత్వానికి అందుతున్న సమాచారం. దీంతో ఈ శాఖను కూడా ప్రక్షాళన చేయడంతోపాటు.. ప్రజలకు చేరువ చేయాలని భావిస్తోంది. హోం శాఖ పరంగా కూడా ప్రజల్లో సంతృప్త స్థాయిని పెంచాలని భావిస్తోంది. అదేసమయంలో ఎక్కువ మంది ప్రజలకు సెంటిమెంటుగా ఉన్న దేవదాయ శాఖ పనితీరును కూడా తాజాగా సీఎం చంద్రబాబు సమీక్షించారు. ప్రజల సంతృప్త స్థాయిలో ఈ శాఖ మరింత వెనుకబడి ఉందని చెప్పారు.దీనిని పుంజుకునేలా చేయాలన్నది సీఎం చంద్రబాబు ఆలోచన. మొత్తంగా సంతృప్త స్థాయిలు పెంచేదిశగా అడుగులు వేస్తున్నారు.