డేటా సెంటర్...ఏపీ దేశానికి పాఠం చెప్పబోతోందా ?
డేటా సెంటర్ అనగానే దాని చుట్టూ అందమైన ఒక ప్రపంచం ఉంటుందని అంటారు.
డేటా సెంటర్ అనగానే దాని చుట్టూ అందమైన ఒక ప్రపంచం ఉంటుందని అంటారు. అలాగే ఉద్యోగ అవకాశాలు పెద్ద ఎత్తున వస్తాయని కూడా ఊహించుకుంటారు. ఇక టెక్నికల్ గా ప్రపంచంలో నంబర్ వన్ అయినట్లుగా ఒక పిక్చర్ అయితే కనిపిస్తుంది. నిజానికి డేటా సెంటర్ అన్నది ఒక పెద్ద సవాల్. దానిని ఏర్పాటు చేయడం నిర్వహించడం పర్యావరణ సమస్యలను సవాళ్ళను ఎదుర్కోవడం అతి పెద్ద పాఠం. అంతే కాదు మంచి నీరు విద్యుత్ వంటి మౌలిక సదుపాయాల విషయంలో డేటా సెంటర్లు సృష్టించే పెద్ద సమస్యలను కూడా పరిశీలించి పరిష్కరించడం కూడా పెను సవాల్. ఇవన్నీ ఎందుకు అంటే ఇపుడు ఏపీలో విశాఖలో డేటా సెంటర్లు రాబోతున్నాయి.
కీలక చర్చగానే :
రాష్ట్రంలో డేటా సెంటర్ల నిర్వహణ విషయంలో ఒక కీలకమైన చర్చ జరుగుతోంది. ఒక డేటా సెంటర్ ఏర్పాటు చేసినప్పుడు అక్కడ పర్యావరణ సమస్యలు, అలాగే విద్యుత్ నీటి సమస్యలు వంటివి వస్తాయని పర్యావరణ వేత్తలు ఈ సరికే హెచ్చరిస్తున్న సంగతి విధితమే. ఈ నేపథ్యంలో డేటా సెంటర్లు వల్ల వచ్చే లాభాలు ఏంటి, ఒనగూడే అనర్ధాలు ఏమిటి అన్నది కూడా చర్చ జోరుగానే సాగుతోంది. ఈ క్రమంలో విశాఖ సమీపంలో గూగుల్ అదానీ కనెక్స్ నెక్స్‌ట్రా సంస్థలు నిర్మిస్తున్న 1-గిగావాట్ ఏఐ డేటా సెంటర్‌తో పాటు, రిలయన్స్ గ్రూప్ చేపట్టనున్న 1.5-గిగావాట్ల ప్రాజెక్టును కూడా రాష్ట్ర ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోంది. ఈ రెండు ప్రాజెక్టులు 2028 నాటికి కార్యకలాపాలు ప్రారంభించాలని చూస్తున్నాయి. వీటికి భారీ ఎత్తున మంచినీరు అవసరం పడుతుంది, అదే విధంగా పెద్ద ఎత్తున విద్యుత్ కూడా అవసరం పడుతుంది. ఈ రెండు కూడా భారతదేశంలో లభ్యం కావడం పెద్ద సవాల్ లాంటిదే.
ఏపీలో ఒక చాలెంజ్ :
ఎందుకంటే ప్రపంచంలోనే మంచినీటి వనరులలో భారత్ కేవలం నాలుగు శాతం వాటా మాత్రమే కలుగి ఉంది. అందువల్ల భారతదేశం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో చూస్తే ఈ డేటా సెంటర్లకు సరిపడా మంచినీరు అందించగలరా అన్నది ఒక చర్చ. ఇక ఏపీలో 2026 27 బడ్జెట్ లో చూస్తే రాష్ట్రంలో నదుల ద్వారా ఒక వెయ్యి 565 టీఎంసీలు నీరు మాత్రమే అందుబాటులో ఉండగా రాష్ట్రానికి మాత్రం 14 లక్షల 90 వేల క్యూబిక్ అడుగుల నీటి అవసరం ఉంది అని తెలుస్తోంది. మరి నీటి వనరుల విషయంలో ఇంత భారీ తేడాతో ఉన్న ఒక రాష్ట్రంలో డేటా సెంటర్లకు అవసరమైన మంచినీరు అందించగలరా అన్నది ఒక పెద్ద ప్రశ్న. ఈ నేపథ్యంలో విశాఖపట్నంలో జీవీఎంసీ రోజుకి 10 కోట్ల లీటర్ల నీటిని శుద్ధి చేసేందుకు డీశాలినేషన్ ప్లాంటు నిర్మించాలని చూస్తోందని చెబుతున్నారు. అలాగే పోలవరం ఎడమ కాలు ద్వారా కూడా ఈ డేటా సెంటర్లకు ప్రత్యేకమైన నీటి కేటాయింపులు చేయాలని ఆలోచిస్తున్నామని గూగుల్ డేటా సెంటర్ శంకుస్థాపన సందర్భంగా ప్రభుత్వ పెద్దలు ఇదే విషయం చెప్పారు. ఈ నేపథ్యంలో మంచి నీటి వనరుల సమస్య ఉన్న పరిస్థితుల్లో ఈ డేటా సెంటర్ల అవసరాలు ఏ మేరకు తీరుతాయన్నది పెద్ద సవాల్ గానే చూడాలి. ఇంకా అదే సమయంలో విద్యుత్ సంబందించిన అవసరాలు చూసుకున్నా సరే డేటా సెంటర్ కి సరిపడా విద్యుత్ ని ప్రభుత్వాలు నుంచి ఇవ్వడం చాలా కష్టం. అందువల్ల ఈ రెండు మెగా ప్రాజెక్టులు డేటా సెంటర్ సంబంధించి సొంతంగా సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని చూస్తున్నాయని చెబుతున్నారు. ఆ రకంగా విద్యుత్ అవసరాలు సొంతంగానే నిర్వహించుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఒక ప్రత్యేక డీండ్ డిస్ట్రిబ్యూషన్ లైసెన్స్ మంజూరు చేస్తోంది. అయితే ఇది ఆచరణలో ఏ మేరకు ఎంతవరకు సాధ్యపడుతుంది అన్నది చూడాల్సి ఉంది. ఇవన్నీ పక్కన పెడితే నీటి నిల్వల సామర్థ్యం కూడా ఒక పెద్ద సవాల్ అని చెబుతున్నారు.
ఏపీ ఒక టెస్ట్ సెంటర్ :
రానున్న కాలంలో భారత దేశంలో డేటా సెంటర్లు ఏర్పాటు అన్నది కూడా ఏపీలో జరిగే పరిణామాలను బట్టి ఆధారపడి ఉంది. ఒక విధంగా ఏపీ లిట్మస్ టెస్ట్ లాంటిది అన్న మాట. అలాగే డేటా సెంటర్ల ఏర్పాటు నిర్వహణ వాటి సవాళ్ళకు పరిష్కారాలు అన్న దాని విషయంలో ఆంధ్రప్రదేశ్ ఒక ఉదాహరణగా రాబోయే రోజుల్లో కనిపించనుంది. నిజానికి పాశ్చాత్య దేశాల్లో చూస్తే డేటా సెంటర్ వల్ల కలిగే ఇబ్బందులు కానీ పర్యావరణ సమస్యలుగా నీటి ఇబ్బందులు విద్యుత్తు సమస్యలు ఇవన్నీ కూడా వాళ్ళు సవాల్ గా తీసుకుంటున్నారు. దానికి తగిన పరిష్కారాలతో వాళ్లు ముందుకు సాగుతున్నారు అయితే అక్కడ కూడా ప్రజలకు సంబంధించిన తాగునీరు విద్యుత్ వంటి వాటిని డేటా సెంటర్లకు మళ్లించడం వల్ల పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తోంది, అలాగే నిరసన ఉద్యమాలు కూడా చెలరేగుతున్నాయి. ఈ నేపథ్యంలో భారతదేశం డేటా సెంటర్లల వల్లనే ఉపాధి అన్న ఆలోచనల నుంచి పక్కకు రావాల్సిన అవసరం ఉందని కూడా అంటున్నారు.
ఇతర రంగాల మీద ఫోకస్ :
వ్యవసాయం ఇతర అనుబంధ సంస్థలు అలాగే ఇతర పరిశ్రమలు మీద కూడా దృష్టి సారించాల్సిన అవసరం ఉందని మేధావులు నుంచి సూచనలు వస్తున్నాయి డేటా సెంటర్లు వద్దని ఎవరూ అనరు, అదే సమయంలో భారతదేశానికి పునాదిగా ఉన్న వ్యవసాయ రంగాన్ని అలాగే ఇతర పరిశ్రమలను విస్మరించరాదని చెబుతున్నారు. ఎందుకంటే పర్యావరణ సమస్యలు కానీ నీటి విద్యుత్ వంటి ఇతర సమస్యలు కానీ ఈ డేటా సెంటర్ల వల్ల భారతదేశానికి ఏర్పడితే ఏ మేరకు తట్టుకోగలదు అన్నదే చూడాల్సి ఉంది. అదే సమయంలో డేటా సెంటర్ల వల్ల ఉత్పత్తి చేసే వేడి అతి పెద్ద సమస్య, వీటి విషయంలో కూడా పరిష్కారాలు ఆలోచించాలి. శీతలీకరణ సాంకేతికతను అభివృద్ధి చేసేందుకు కూడా చూడాలి. ఏది ఏమైనా రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ డేటా సెంటర్ల ఏర్పాటు అక్కడ కలిగే పరిస్థితులు పర్యవసానాలు ఫలితాలు పరిష్కారాలు ఇవి రేపటి భారతదేశానికి ఒక మంచి పాఠాన్ని అందించబోతున్నాయని చెప్పక తప్పదు.