కూటమిలో 'వెయ్యి కోట్ల' పంచాయితీ.. హాట్ టాపిక్!
ఏపీలోని కూటమి ప్రభుత్వంలో వెయ్యి కోట్ల రూపాయలకు సంబంధించిన పంచాయితీ జరుగుతోందా?.;
ఏపీలోని కూటమి ప్రభుత్వంలో వెయ్యి కోట్ల రూపాయలకు సంబంధించిన పంచాయితీ జరుగుతోందా?. ఈ వ్యవహారంపై జనసేన పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అంతర్మథనం చెందుతున్నా రా? .. అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. గత మూడు మాసాల కిందటి వరకు ప్రభుత్వం తరఫున పవన్‌కల్యాణ్.. బలమైన వాయిస్ వినిపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబును ఆకాశానికి ఎత్తేశారు. అయితే.. ఇటీవల కాలంలో ఆయన బయటకు రావడం లేదు. వచ్చినా.. పెద్దగా ప్రసంగించడం లేదు.
అయితే.. చంద్రబాబుపై ప్రశంసలు గుప్పిస్తున్నా.. గతంలో మాదిరిగా మాత్రం పవన్ వ్యవహరించడం లేదన్నది స్పష్టంగా తెలుస్తోంది. ఇటీవల కేంద్ర మంత్రి గడ్కరీ అమరావతికి వచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో నిర్మించిన, నిర్మించాల్సిన జాతీయ రహదారుల ప్రాజెక్టులకు ఆయన శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమానికి పవన్ కూడా వచ్చారు. అయితే.. సహజంగా ప్రొటోకాల్ ప్రకారం నడుచుకునే పవన్ కల్యాణ్.. ఈ కార్యక్రమంలో మాత్రం.. తానే ముందుగా వేదిక ఎక్కి కూర్చున్నారు. ఆ తర్వాత.. ముక్త సరిగా నాలుగు మాటలు మాట్లాడి వెళ్లిపోయారు.
రెండు రోజుల కిందట జరిగిన మంత్రి వర్గ సమావేశానికి కూడా ఆయన అన్యమనస్కంగానే హాజరయ్యారు. కీలకమైన ప్రతిపాదనలతో వచ్చే పవన్ కల్యాణ్.. ఈ దఫా ఏమీ లేకుండా... మౌనంగా వచ్చి మౌనంగా వెళ్లి పోయారు. ఈ పరిణామాలు.. రాజకీయంగా చర్చకు దారితీస్తున్నాయి. దీనివెనుక ఏం జరుగుతోందన్నది ప్రతిపక్ష వైసీపీతోపాటు.. కూటమిలోనూ చర్చ సాగుతోంది. అయితే.. ఈ వ్యవహారానికి సంబంధించి తాజాగా ఓ కీలక విషయం వెలుగు చూసింది. వెయ్యి కోట్ల రూపాయలకు పైగా నిధుల విషయంలోనే పవన్ అన్యమనస్కంగా ఉంటున్నారని సమాచారం.
ఏంటా సొమ్ము?
ప్రస్తుతం డిప్యూటీ సీఎంగానే కాకుండా.. పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా కూడా పవన్ కల్యాణ్ ఉన్నారు. తన హయాంలో గ్రామీణ ప్రాంతాలను డెవలప్ చేస్తానని హామీ ఇచ్చారు. ఈ క్రమంలో కేంద్రం నుంచి వ చ్చే నిధులను నేరుగా గ్రామాలకు ఇస్తానని చెప్పిన ఆయన.. తొలి విడత(ఇప్పటికి రెండు సార్లు వచ్చా యి) వచ్చిన 1200 కోట్ల రూపాయలను నేరుగా గ్రామాలకు ఇచ్చేశారు. ఈ నిధులతోనే గ్రామాల్లో పనులు చేస్తున్నారు. ఈ విషయాన్ని కొన్నాళ్ల కిందట పవన్ కూడా చెప్పారు. రోడ్లు, పశువైద్య శాలలు, పాఠశాలలను కూడా నిర్మిస్తున్నారు.
ఇక, ఏప్రిల్ చివరి వారంలో కేంద్రం నుంచి 1,121 కోట్ల రూపాయల నిధులు వచ్చాయి. వీటిని కూడా నేరు గా గ్రామాలకు ఇవ్వాలని పవన్ కల్యాణ్ ప్రతిపాదించారు. అయితే.. ఈ సొమ్మును ప్రభుత్వం విడుదల చేయలేదు. సెప్టెంబరులో ఇస్తామని కబురు పంపినట్టు తెలిసింది. దీంతో గ్రామీణ ప్రాంతాలలో చేపట్టిన పనులు ఆగిపోయాయి. ఈ వ్యవహారంపైనే పవన్ కొంత నిరుత్సాహానికి గురైనట్టు తెలుస్తోంది. గత ప్రభుత్వం ఇలానేగ్రామాలకు చెందిన సొమ్మును వాడుకుందని.. ఎన్నికలకు ముందు పవన్ ప్రచారం చేశారు. కానీ, ఇప్పుడు కూడా అదే జరిగిందని.. అందుకే ఆయన మౌనంగా ఉన్నారన్నది కూటమి పార్టీల్లోనే జరుగుతున్న చర్చ.