కేంద్ర బడ్జెట్ లో ఏపీకి ప్రాధాన్యం...బాబు భేటీ ఫలితం !
ఇదిలా ఉండగా ఏపీ సీఎం చంద్రబాబు కరెక్ట్ టైం లో ఢిల్లీకి వెళ్ళారు. ఏపీలో పోలవరం ప్రాజెక్ట్ పనులను సమీక్షించిన అనంతరం ఆయన రాజమండ్రి నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరి వెళ్ళారు.;
కేంద్ర బడ్జెట్ ప్రిపరేషన్స్ ప్రస్తుతం ఢిల్లీలో చురుకుగా జరుగుతున్నాయి. గత మూడు నాలుగు నెలలుగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వివిధ వర్గాలతో బడ్జెట్ గురించి చర్చిస్తూ వచ్చారు. అనేక మందితో విశ్లేషిస్తూ వచ్చారు. ఇక వివిధ రాష్ట్రాల నుంచి కేంద్ర బడ్జెట్ లో తమకు తగిన ప్రాధాన్యత కల్పించాలని వినతులు వెళ్ళాయి. అయితే అందరూ ఒక ఎత్తూ ఏపీ మరో ఎత్తు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఈ రోజున అధికారంలో ఉంది అంటే దానికి ఏపీలోని టీడీపీ ఎంపీల మద్దతు చాలా కీలకమైనది. దాంతో పాటు ఏపీ కూటమి ప్రభుత్వంలో బీజేపీ కూడా ఉంది. దాంతో కేంద్ర బడ్జెట్ లో ఏపీకి అత్యంత ప్రాధాన్యత దక్కుతుందని అంతా భావిస్తున్నారు.
కరెక్ట్ టైంలో బాబు :
ఇదిలా ఉండగా ఏపీ సీఎం చంద్రబాబు కరెక్ట్ టైం లో ఢిల్లీకి వెళ్ళారు. ఏపీలో పోలవరం ప్రాజెక్ట్ పనులను సమీక్షించిన అనంతరం ఆయన రాజమండ్రి నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరి వెళ్ళారు. ఈ మేరకు కేంద్ర పెద్దల అపాయింట్మెంట్ ని ఆయన తీసుకున్నారు. ఇక ఢిల్లీలో బాబు కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ అయి అనేక విషయాలను చర్చించారు అని అంటున్నారు. బడ్జెట్ లో ఏపీకి అగ్ర తాంబూలం ఇవ్వాలని బాబు కోరినట్లుగా చెబుతున్నారు. అంతే కాదు ఏపీ ఆర్థిక పరిస్థితిని వివిధ పధకాల గురించి కూడా అమిత్ షాకు చంద్రబాబు వివరించినట్లుగా తెలుస్తోంది. దీనికి కేంద్రం నుంచి సానుకూలత వ్యక్తం అయింది అని అంటున్నారు.
కీలక ప్రాజెక్టుల కోసం :
ఏపీ విభజన తరువాత అనేక ఇబ్బందులు పడుతోంది. రాజధాని అన్నది లేకుండా సతమతమవుతోంది ఈ నేపధ్యంలో అమరావతి రాజధాని నిర్మాణానికి కేంద్రం గత బడ్జెట్ లో నిధులను కేటాయించింది. అలాగే వివిధ ఏజెన్సీల ద్వారా నిధులు అందుబాటులోకి తెచ్చింది. మరి ఈసారి కేంద్ర బడ్జెట్ లో ఏపీకి సంబంధించి ఏ ఏ మెరుపులు ఉంటాయో అన్న చర్చ అయితే ఉంది. అంతే కాదు పోలవరం ప్రాజెక్ట్ పనులు తుది దశకు వచ్చాయి. ఆర్ ఆర్ ప్యాకేజీకి సంబంధించిన నిధులు విడుదల చేస్తే కనుక మరింత దూకుడుగా ప్రాజెక్ట్ ముందుకు సాగుతుందని అంటున్నారు. అలాగే ఏపీకి ప్రత్యేక నిధులు అవసరం అవుతున్నాయి. అదే విధంగా గతంతో పోలిస్తే జీఎస్టీ రెండవ తరం సంస్కరణల ఫలితంగా ఎనిమిది వేల కోట్ల రూపాయల నిధులు తగ్గిపోయాయి. దాంతో కేంద్రం ఏపీని ఆదుకోవాలన్న విన్నపాలు ఉన్నాయి. వీటి మీద చంద్రబాబు కేంద్ర మంత్రి అమిత్ షాకు వివరించారు అని అంటున్నారు.
పలువురు మంత్రులతో :
ఇదిలా ఉండగా చంద్రబాబు గురువారం కూడా ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులను కలుస్తారు అని అంటున్నారు. అనంతరం ఆయన తిరిగి అమరావతికి చేరుకుంటారని అదే రోజు మధ్యాహ్నం కేబినెట్ మీటింగ్ ఉందని చెబుతున్నారు. మొత్తానికి ఈసారి బడ్జెట్ మీద అయితే ఎన్నో ఆశలను ఏపీ పెట్టుకుంది. మరి కేంద్ర బడ్జెట్ లో ఏ కేటాయింపులు ఉంటాయో చూడాల్సి ఉంది. ఇక ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ ని నిర్మలా సీతారామన్ ప్రవేశపెడుతున్నారు.