జనసేన ఆశలపై నీళ్లు జల్లిన సుప్రీం.. టీడీపీకి షాకేనా?
వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రంలో అసెంబ్లీ సీట్లు పెరుగుతాయని గంపెడాశలు పెట్టుకున్న నేతలకు సుప్రీంకోర్టు తీర్పు షాక్ ఇచ్చినట్లైంది.;
వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రంలో అసెంబ్లీ సీట్లు పెరుగుతాయని గంపెడాశలు పెట్టుకున్న నేతలకు సుప్రీంకోర్టు తీర్పు షాక్ ఇచ్చినట్లైంది. రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న విధంగా అసెంబ్లీ సీట్లు పెంచాల్సిఉండగా, జనాభా లెక్కలు తేలనందున నియోజకవర్గాల పునర్విభజనకు చట్టం అనుమతించందని సుప్రీంకోర్టు తీర్పుతో వెల్లడైందని అంటున్నారు. మరోవైపు వచ్చే ఏడాదిలో జనాభా లెక్కలు సేకరించాలని కేంద్రం ఇప్పటికే నిర్ణయించినందున నియోజకవర్గాల పునర్విభజనకు 2034 వరకు ఆగాల్సిందేనన్న విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి.
కీలక పరిణామాలు
సుప్రీం తీర్పుతో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కీలక రాజకీయ పరిణామాలు చోటుచేసుకునే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ప్రధానంగా ఏపీలో రాజకీయ అనిశ్చితికి దారితీయొచ్చన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ఏపీలో ప్రస్తుతం కూటమి ప్రభుత్వం కొనసాగుతోంది. మూడు పార్టీల మధ్య పొత్తుతో గత ఎన్నికల్లో పోటీ చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వైసీపీ గెలవ కూడదన్న ఏకైక లక్ష్యంతో కూటమి కట్టిన పార్టీలు సీట్లను త్యాగం చేయాల్సివచ్చింది. రాష్ట్రంలో మొత్తం 175 నియోజకవర్గాలు ఉండగా, జనసేన, బీజేపీలకు 29 సీట్లను టీడీపీ వదులు కోవాల్సివచ్చింది. అయితే ఈ కూటమి ఏర్పడటానికి ప్రధాన కారణమైన డిప్యూటీ సీఎం పవన్ తన పార్టీని బాగా తగ్గించి 21 సీట్లకే ఒప్పుకోవడం అప్పట్లో చర్చనీయాంశమైంది. అయితే ఏదో ఒకవిధంగా అంతా ఏకతాటిపైకి వచ్చి పోటీ చేసి గెలిచారు. అయితే అప్పట్లో ఈ సీట్ల సర్దుబాటు 2024 ఎన్నికలకే పరిమితమని, 2029 ఎన్నికల నాటికి మరో 50 అసెంబ్లీ సీట్లు పెరుగుతాయనే అంచనాతో పొత్తు శాశ్వతంగా కొనసాగించాలని నిన్న మొన్నటివరకు మూడు పార్టీలు భావించాయి. సీట్లు పెరిగితే ఆ మేరకు జనసేన కోటా కూడా పెరిగే అవకాశం ఉన్నందున తన పార్టీకి మేలు జరుగుతుందని డిప్యూటీ సీఎం పవన్ భావించారు. అయితే సుప్రీం తీర్పుతో పరిస్థితి రివర్స్ కావడంతో రాష్ట్ర రాజకీయాలు కూడా చర్చనీయాంశంగా మారాయని అంటున్నారు. ఈ పరిణామాలు భవిష్యత్తులో కూటమి రాజకీయాలపై ఒత్తిడి తీసుకువచ్చే పరిస్థితి కనిపిస్తోందని అంటున్నారు.
టీడీపీకి షాకే..
నియోజకవర్గాలు పెరగకుంటే ప్రస్తుతం అధికార కూటమిలో కీలకంగా ఉన్న తెలుగుదేశం పార్టీకి ఇబ్బందే అన్న విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి. 2029 ఎన్నికల నాటికి 50 అసెంబ్లీ నియోజకవర్గాలు పెరిగితే గత ఎన్నికల్లో సీట్లు త్యాగం చేసిన వారికి కూడా న్యాయం చేయొచ్చని, నేతలు అందరికీ ఎక్కడో ఒక చోట సర్దుబాటు చేయొచ్చని ఇన్నాళ్లు టీడీపీ లెక్కలేసుకుంటూ వచ్చిందని అంటున్నారు. అదే సమయంలో వైసీపీ నుంచి టీడీపీలోకి తీసుకున్న కొందరు నేతలకు కొత్తగా ఏర్పడబోయే స్థానాల్లో సీట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చినట్లు చెబుతున్నారు. రాజ్యసభ స్థానానికి రాజీనామా చేసి టీడీపీలో చేరిన సీనియర్ నేత మోపిదేవి వెంకటరమణకు రేపల్లె బదులుగా కొత్తగా ఆవిర్భవించే మరో స్థానం ఇస్తామని ఆశపెట్టినట్లు చెబుతున్నారు. అలాగే వచ్చే ఎన్నికల నాటికి ఏలూరు రూరల్ నియోజకవర్గం ఏర్పడుతుందన్న అంచనాతో వైసీపీలో పనిచేసిన ఆళ్ల నానిని తీసుకున్నారు. ఇలా చాలాచోట్ల ముందస్తు వ్యూహంతో నేతలను చేర్చుకోగా, ఇప్పుడు మరో ఐదేళ్లు ఆలస్యం అయ్యే సూచనలతో టీడీపీలో కొత్త చిక్కులు ఏర్పడే అవకాశాలు ఉన్నాయంటున్నారు.
2034 వరకు ఆగాల్సిందేనా..?
2029 ఎన్నికల నాటికి నియోజకవర్గాలు పెరుగుతాయని ఇప్పటి వరకు అంతా ఆశించారు. కానీ, సుప్రీం తీర్పు నేపథ్యంలో వెయిటింగ్ పీరియడ్ 2034కు మారిందని అంటున్నారు. దేశంలో జనాభా లెక్కలు పూర్తి చేసి పార్లమెంటు, అసెంబ్లీ స్థానాలను పెంచాలని కేంద్ర ప్రభుత్వం కూడా నిర్ణయించింది. ఇందుకోసం వచ్చే ఏడాది అక్టోబరు నుంచి జనగణనతోపాటు కుల గణన చేయాలని ఇప్పటికే నిర్ణయించింది. ఈ మేరకు నోటిఫికేషన్ కూడా విడుదలైంది. తొలిదశలో జమ్మూకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో జనాభా లెక్కలు సేకరిస్తారు. రెండో విడతలో అంటే 2027 మార్చి నుంచి దేశమంతా చేపడతారు. అయితే ఇందుకోసం మూడేళ్లు పడుతుందని అంచనా వేస్తున్నారు. మరోవైపు ఆధునిక సాంకేతికత వినియోగిస్తుండటం వల్ల రెండేళ్లు సరిపోతుందని నిపుణులు చెబుతున్నారు. ఏదిఏమైనా 2029 ఎన్నికల నాటికి జనాభా వివరాలపై స్పష్టత వచ్చే అవకాశం లేదని అంటున్నారు. ఈ వివరాలు వచ్చాకే నియోజకవర్గాల పునర్విభజనకు నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నందున 2034 వరకు ఆగాల్సిందేనని అంటున్నారు.