ఏపీకి రోల్స్ రాయిస్.. బాబు ప్లాన్ అదిరింది..
లండన్‌లో రోల్స్ రాయిస్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ నిక్కీ గ్రేడీ స్మిత్‌ను చంద్రబాబు కలిసి ఆంధ్రప్రదేశ్ వనరుల గురించి స్పష్టంగా వివరించారు.;
ప్రపంచ వ్యాపార వేదికపై మరోసారి ఆంధ్రప్రదేశ్ పేరు వినిపించింది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు యూకే పర్యటనలో రోల్స్ రాయిస్ వంటి గ్లోబల్ దిగ్గజాలతో సమావేశమవడం కేవలం పెట్టుబడి కోసమే కాదు అది రాష్ట్ర భవిష్యత్తు దిశను సూచించే ప్రణాళిక. టెక్నాలజీ, పరిశ్రమ, మానవ వనరులు ఈ మూడింటి మేళవింపుతో ఆంధ్రప్రదేశ్‌ను అంతర్జాతీయ తయారీ కేంద్రంగా నిలబెట్టాలన్న చంద్రబాబు లక్ష్యం ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది.
రోల్స్ రాయిస్ తో నూతన అవకాశాలు
లండన్‌లో రోల్స్ రాయిస్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ నిక్కీ గ్రేడీ స్మిత్‌ను చంద్రబాబు కలిసి ఆంధ్రప్రదేశ్ వనరుల గురించి స్పష్టంగా వివరించారు. ఏరోస్పేస్, అడ్వాన్స్‌డ్ మానుఫ్యాక్చరింగ్, డిఫెన్స్ రంగాల్లో రాష్ట్రం వేగంగా ఎదగగల సామర్థ్యం ఉందని ఆయన స్మిత్ కు వివరించారు. ప్రత్యేకించి, ఓర్వకల్ మిలిటరీ ఎయిర్‌స్ట్రిప్, ఎంఆర్ఓ యూనిట్, భోగాపురం విమానాశ్రయం అభివృద్ధి ప్రణాళికలు ఆయన చర్చలో ప్రధానాంశాలుగా నిలిచాయి. ‘రోల్స్ రాయిస్ వంటి కంపెనీలు ఆంధ్రప్రదేశ్ కు వస్తే దేశం మొత్తం ఏరోస్పేస్ రంగంలో స్వయం సమృద్ధి దిశగా అడుగేస్తుంది.’ ఇది కేవలం ఒక ప్రాజెక్టు కాదు.. మేక్ ఇన్ ఇండియా భావనకు కొత్త ఆంధ్ర వెర్షన్.
ప్రపంచ స్థాయి పరిశ్రమలతో కొత్త బంధాలు..
రోల్స్ రాయిస్‌తోపాటు చంద్రబాబు ఎస్ఆర్ఏఎం, అండ్ ఎంఆర్ఏఎం గ్రూప్ చైర్మన్ శైలేష్ హీరనందాని, షాంకో హోల్డింగ్స్ లిమిటెడ్ చైర్మన్ సంపత్ కుమార్ మల్లైను కూడా బాబు కలిశారు. ఈ సమావేశాలు సెమీకండక్టర్, అడ్వాన్స్‌డ్ ప్యాకేజింగ్, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ వంటి హైటెక్ రంగాల్లో పెట్టుబడులపై దృష్టి సారించాయి. విశాఖపట్నం, తిరుపతి వంటి ప్రాంతాలను గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్స్ (GCCs) స్థాపనకు వ్యూహాత్మక కేంద్రాలుగా సూచించడం, రాష్ట్రాన్ని టెక్ మ్యాప్‌లో నిలబెట్టే వ్యూహాత్మక అడుగు. చంద్రబాబు ప్రతి విదేశీ పర్యటన వెనుక ఒక స్థిరత్వం, స్పష్టత ఉన్నట్లు తెలుస్తోంది. ప్రతీ సమావేశం వెనుక ఒక వ్యూహం ఉంది. ప్రతీ చర్చ వెనుక ఒక దిశ ఉంది. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ టెక్నాలజీతో అనుసంధానం కావాలనే సంకల్పం ఆయన ప్రతి మాటలో కనిపిస్తోంది.
పెట్టుబడులకు కేంద్రబిందువుగా ఏపీ..
ప్రపంచ పరిశ్రమల దృష్టి ఇప్పుడు భారతదేశంపై ఉంది. కానీ భారతదేశంలో ఏఏ రాష్ట్రాలు ముందు నిలుస్తాయన్న ప్రశ్నకు సమాధానం ఆంధ్రప్రదేశ్ అనే వినిపిస్తుంది. రోల్స్ రాయిస్ వంటి కంపెనీలను ఆకర్షించడం ద్వారా కేవలం పెట్టుబడులు తెచ్చుకోవడం కాదు.. ఒక నూతన పరిశ్రమ సంస్కృతిని రాష్ట్రానికి తీసుకురావాలి అని. ‘ఆర్థిక వృద్ధి అంటే కేవలం ఫ్యాక్టరీలు కాదు.. అది విజన్, ఇన్నోవేషన్, గ్లోబల్ కనెక్టివిటీ.’ ఈ పర్యటన అదే దిశగా సాగుతోంది.
రోల్స్ రాయిస్ నుంచి మొదలైన ఈ ప్రయాణం, ఆంధ్రప్రదేశ్‌ను భవిష్యత్‌లో భారత ఏరోస్పేస్ హబ్‌గా మార్చే దిశగా ఒక దృఢమైన అడుగుగా నిలుస్తుందని చంద్రబాబు మళ్లీ ఒకసారి చూపించారు. అభివృద్ధి అనే కల ఆయనకు కేవలం నినాదం కాదు.. అది ఆయన రాజకీయ తత్వం.