ఏపీలో జనగణన సర్వే....తొలిసారి డిజిటల్ యాప్
దేశంలో జన గణన సర్వే అన్నది చేపట్టి ఇప్పటికి కచ్చితంగా 15 ఏళ్ళు జరిగిపోయాయి.;
దేశంలో జన గణన సర్వే అన్నది చేపట్టి ఇప్పటికి కచ్చితంగా 15 ఏళ్ళు జరిగిపోయాయి. జనాభాకు సంబంధించి కచ్చితమైన డేటా అయితే ఎవరి దగ్గరా లేదు, 2011 ని చూసి మాత్రమే అంతా అనుసరించాల్సి వస్తోంది. కొలమానంగా దాన్నే తీసుకుంటున్నారు. ఆర్ధిక సామాజిక అవసరాలకు జనాభా గణన చాలా ముఖ్యం. అయితే 2021 లో జరగాల్సిన జనాభా గణన కరోనా కారణంగా ఆగిపోయింది అన్నది తెలిసిందే. ప్రతీ పదేళ్ళకు పెరిగిన జనాభాను ఒక కచ్చితమైన డేటాగా తీసుకుని పాలకులు ప్రభుత్వాలు తాము చేసే అభివృద్ధితో పాటు పధకాల రూపకల్పనలో కీలకంగా ఉపయోగించుకుంటారు. ఇక ఎట్టకేలకు దేశంలో జనాభా గణనకు రంగం సిద్ధం అయింది.
ఏపీలో కసరత్తు :
ఈ నేపధ్యంలో తొందరలోనే ఏపీలో కూడా జనాభా గణన మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. దానికి సంబంధించిన పూర్వ రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ నేపధ్యంలో రాష్ట్రంలోని మొత్తం 28 జిల్లాల కలెక్టర్లను సమాయత్తం చేస్తున్నారు. రాష్ట్రంలో జనగణన సర్వేకు ప్రతి ఒక్కరు సహకరించాలని ఇంచార్జ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్ ఎస్ రావత్ ఈ సందర్భంగా కోరారు. రాష్ట్రవ్యాప్తంగా జనగణన కార్యక్రమాల అమలుపై అన్ని జిల్లాల కలెక్టర్లతో ఆయన తాజాగా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ ఎస్ రావత్ మాట్లాడుతూ, ఆరు నెలల నుంచి ఏడాది పాటు జరిగే ఈ ఈ సర్వేని కాగిత రహితంగా డిజిటల్ యాప్ ద్వారా చేపట్టాలని కలెక్టర్లను సూచించారు. పకడ్బందీగా నిర్వహించడానికి చర్యలు చేపట్టాలని సూచించారు. అలాగే జనగణన ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించడానికి ప్రత్యేక ప్రణాళికలు అమలు చేయాలని కోరారు.
కుల గణన కూడా :
ఇక జన గణనతో పాటుగా కుల గణన కూడా చేపడతారు అని అంటున్నారు. అందులోనే ప్రత్యేకంగా కాలం ఉంచి కులానికి సంబంధించిన వివరాలు నమోదు చేస్తారు అని చెబుతున్నారు. కేవలం ఇంట్లో ఎంత మంది ఉన్నారు అని సభ్యుల వివరాలు మాత్రమే నమోదు చేసుకోకుండా వారి ఆర్ధిక పరిస్థితి ఇతరత్రా వివరాలు కూడా నమోదు చేస్తారు అని అంటున్నారు. దాని వల్ల ప్రభుత్వాల వద్ద కచ్చితమైన డేటా ఉంటుంది అని చెబుతున్నారు. దీనిని ఉపయోగించి రానున్న కాలంలో పధకాలు ఇతర కార్యక్రమాల కోసం ఈ డేటాను వినియోగించుకుంటారు అని అంటున్నారు. కుల గణన వివరాలు తేలితే దాని ప్రకారం రాజకీయాల్లో కానీ ఇతరత్రా కానీ రిజర్వేషన్ల కోసం కూడా సరైన కేటాయింపులు చేసేందుకు వీలు ఉంటుంది అని అంటున్నారు. కాగిత రహితంగా డిజిటల్ మోడ్ లో ఈ జనాభా గణన ఉంటుంది కాబట్టి వేగంగానే ఈ ప్రక్రియ సాగుతుందని భావిస్తున్నారు.