వైసీపీలో కమ్మదనం మిస్ అవుతోందా ?

ఇదిలా ఉంటే వైసీపీ విపక్షంలోకి వచ్చాక ఇపుడు అనేక రకాలైన ఇబ్బందులు పడుతోంది. దానికి తోడు అన్నట్లుగా సామాజిక పరమైన ఇబ్బందులు కూడా ఆ పార్టీని చుట్టుముడుతున్నాయి.;

Update: 2025-05-20 04:05 GMT

రాజకీయాలు అలాగే చేయాలి. రాజకీయం అంటే ప్రజా జీవితంలో భాగం. ఇంకా చెప్పాలీ అంటే ప్రజలతో కూడిన ప్రజలతో కలిసి ప్రజల కోసం ప్రజల గురించి చేసేదే రాజకీయం. కానీ వర్తమానంలో అలాంటివి ఏవీ అసలు కనిపించడం లేదు.

రాజకీయాల్లో కులం పాత్ర చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే ఒకే కులం తో ఎపుడూ ఎవరూ గెలిచింది లేదు అందువల్ల అన్ని కులాలను కలుపుకుంటేనే రాజకీయం పండుతుంది. ప్రతీ రాజకీయ పార్టీ ఆ విధంగానే ఆలోచిస్తుంది. అయితే తమ ఆలోచనలు ఎలా ప్రతిబింబిస్తున్నాయి అన్న దాని మీదనే ఫలితాలు ఉంటాయి.

ఏపీలో చూస్తే రాజకీయ పార్టీల పేర్లు చెప్పగానే వాటి వెనక ఉన్న సమర్ధించే కులం ఒకటి ఠక్కున గుర్తుకు వస్తుంది అంటే ఆయా కులంలో మెజారిటీ ఆ పార్టీని ఓన్ చేసుకుంటున్నారు అన్న మాట అని అనుకోవాలి. అయితే ఏ కులం ఎంతలా ఆ పార్టీని సొంతం చేసుకున్నా మిగిలిన పార్టీల సహకారం కూడా కావాల్సిందే.

ఇదిలా ఉంటే వైసీపీ విపక్షంలోకి వచ్చాక ఇపుడు అనేక రకాలైన ఇబ్బందులు పడుతోంది. దానికి తోడు అన్నట్లుగా సామాజిక పరమైన ఇబ్బందులు కూడా ఆ పార్టీని చుట్టుముడుతున్నాయి. వైసీపీ పవర్ లో ఉన్నపుడు తమ పట్ల కొంచెం హార్ష్ గా వ్యవహరించింది అని అనుకున్న కులాలు ఉన్నాయి అందులో కమ్మ వారు ఉన్నారు.

వారి పేరుని జత చేస్తూ ఆంధ్రుల రాజధాని అమరావతిని కమ్మరావతిగా వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు ప్రచారం చేయడం పట్ల అప్పట్లోనే అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. ఇక మూడు రాజధానుల కాన్సెప్ట్ వెనక కూడా తమను దెబ్బ తీయాలన్న ఆలోచన ఉందని భావించిన వారూ అందులో ఉన్నారు.

ఇవన్నీ పక్కన పెడితే 2019 ఎన్నికల్లో వైసీపీని గెలిపించడంలో కమ్మ వారి పాత్ర కూడా చాలానే ఉంది. ఇక వైసీపీ కూడా కీలకమైన చోట్ల వారికి టికెట్లు ఇచ్చింది అలా చాలా మంది ఆ సామాజిక వర్గం నుంచి గెలిచిన వారు వైసీపీలో ఉన్నారు

అయితే అందులో గుడివాడ నుంచి గెలిచిన కొడాలి నానికి వైసీపీ తొలి టెర్మ్ లో మంత్రి పదవి ఇచ్చినా తరువాత దశలో మంత్రి పదవి ఆయన నుంచి తీసుకుంది. కానీ ఎవరికీ ఆ పదవిని ఇవ్వకపోవడంతో వారు అవమానకరంగా ఫీల్ అయ్యారు. స్వాతంత్ర్యం వచ్చాక తమకు మంత్రి పదవి లేని కాలం వైసీపీలోనే 2022 నుంచి 2024 మధ్యలో జరిగింది అని వాపోయారు.

ఇక అప్పటి నుంచి వైసీపీలో ఉన్న కమ్మ ఎమ్మెల్యేలలో సైతం అసంతృప్తి ఎక్కువైంది అని చెబుతారు. వైసీపీ 2024 ఎన్నికల్లో ఓటమి చెందాక కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు చాలా మంది సైలెంట్ అయ్యారు. ఎన్నికలకు ముందే మైలవరం ఎమ్మెల్యే వసంత క్రిష్ణ ప్రసాద్ టీడీపీలో చేరిపోగా, ఎన్నికల తరువాత కొడాలి నాని గప్ చుప్ అయ్యారు. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అయితే అరెస్ట్ అయ్యేంతవరకూ ఎక్కడ ఉన్నారో తెలియదు. ఇపుడు జైలులో ఉన్నారు. బయటకు వచ్చినా యాక్టివ్ అవుతారన్న నమ్మకం లేదని అంటున్నారు.

అలాగే దెందులూరు మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి కూడా మౌనమే నా భాష అంటున్నారు. ఆయన సైతం టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మీద గతంలో విరుచుకుపడినట్లు ఇప్పుడు అయితే ఆ ఫైర్ చూపించడం లేదు అని అంటున్నారు.

అలాగే ఉమ్మడి గుంటూరు జిల్లాలో వినుకొండ మాజీ ఎమ్మెల్యే బోళ్ళ బ్రహ్మనాయుడు నుంచి సౌండ్ అయితే పెద్దగా లేదని అంటున్నారు. ఇదే తీరులో ఇతర కమ్మ మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారని అంటున్నారు. ఏపీలో టీడీపీ అధికారంలో ఉండడం కేసులు ఒక ఎత్తు అయితే సొంత సామాజిక వర్గం నుంచి వీరికి సరైన ఆదరణ లభించకపోవడంతో పాటు రాజకీయంగా ఎదురవుతున్న సమస్యలతో ఇపుడు పెదవి విప్పడం కంటే మౌనంగా ఉండడమే మేలు అన్న విధానంతోనే వీరు సైలెంట్ అవుతున్నారని అంటున్నారు.

Tags:    

Similar News