జగన్ సపోర్టు : వారికి చేదు...బీజేపీకి మోజు !
జాగ్రత్తగా గమనిస్తే ఏపీ పాలిటిక్స్ ని కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయేకు నాయకత్వం వహిస్తున్న బీజేపీ నడిపిస్తోందా అన్నది అనుమానం కలుగుతుంది అంటారు.;
జాగ్రత్తగా గమనిస్తే ఏపీ పాలిటిక్స్ ని కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయేకు నాయకత్వం వహిస్తున్న బీజేపీ నడిపిస్తోందా అన్నది అనుమానం కలుగుతుంది అంటారు. బీజేపీకి ఏపీ లో పెద్దగా రాజకీయ బలం లేదు. కానీ లోక్ సభలో రాజ్యసభలో ఏపీ నుంచి ఎంపీల మద్దతు అంతా కీలక సమయాల్లో ఆ పార్టీకే దక్కుతోంది. ఇక్కడ చూస్తే కేంద్ర స్థాయి బీజేపీ నేతలకు ఏపీలో ప్రాంతీయ పార్టీల విషయంలో రాగద్వేషాలు పెద్దగా లేవని ఉన్నవి రాజకీయ అవసరాలే అని బోధపడుతుంది.
నాడు అలా నేడు ఇలా :
ఇక వైసీపీ అధికారంలో ఉన్నపుడు 2022లో రాష్ట్రపతి ఎన్నికలు వచ్చాయి. ఆ సమయంలో వైసీపీ ఎటూ ఎన్డీయేకు తమ మద్దతు అని చెప్పేసింది. ఆనాడు ఎన్డీయే కూటమిలో లేని తెలుగుదేశం కూడా ప్రత్యేకంగా ఒక సమావేశం ఏర్పాటు చేసి మరీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో వచ్చిన రాష్ట్రపతి అభ్యర్ధి ద్రౌపది ముర్ముకు తమ సపోర్టు అని గొప్పగా చెప్పింది. అలా మొత్తం ఓట్లు బీజేపీకే వెళ్ళాయి. అపుడు వైసీపీ టీడీపీ మీద కొంత రుసరుసలాడింది. అయినా కూడా ఇద్దరూ కలసి జై బీజేపీ అనేశారు కట్ చేస్తూ నేడు విపక్షంలో ఉన్న వైసీపీ కూడా ఎన్డీయేకు సై అంటోంది. ఈ పరిణామం అధికార టీడీపీ కూటమికి ఇబ్బందిగానే ఉంది అని అంటున్నారు.
మద్దతు ఇచ్చినా తంటానే :
కేంద్రంలో తమ మద్దతుతో ఎన్డీయే ప్రభుత్వం ఉందని టీడీపీ గట్టిగా చెప్పుకుంటోంది. అయితే ఆ పార్టీ ఆశించినవి ఏవీ జరగడంలేదు. ముఖ్యంగా రాజకీయంగా జగన్ ని ఇబ్బంది పెట్టాలని అనుకున్న ప్రతీ సందర్భంలో కొన్ని అవరోధాలు ఎదురవుతున్నాయి. ఇపుడు అనూహ్యంగా ఒక చాన్స్ వైసీపీకి ఉప రాష్ట్రపతి ఎన్నికల రూపంలో వచ్చింది. కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ నేరుగా జగన్ కే ఫోన్ చేసి వైసీపీ నుంచి మద్దతు అడిగారు. దానికి వైసీపీ సైతం సానుకూలంగానే స్పందించింది. అయితే ఈ మద్దతు బీజేపీకి మోదంగా ఉంటే టీడీపీకి ఇబ్బందిగానే ఉందని అంటున్నారు.
బీజేపీ పాలిట్రిక్స్ లో :
ఏపీలో ఒకరు అధికారంలో ఉంటారు. ప్రత్యర్ధులు విపక్షంలో ఉంటారు. అయితే ఈ ఇద్దరూ బరిలో ఉండాల్సిందే అన్నదే కాషాయం పార్టీ రాజకీయ వ్యూహమా అన్న చర్చ సాగుతోంది. తులాబారంలో త్రాస్ ఏ వైపు కూడా ఏకపక్షంగా మొగ్గకుండా ఉండాల్సిందే అన్నదే బీజేపీ పాలిటిక్స్ అని అంటున్నారు. ఒక వైపు కనుక మొగ్గు ఉండి ఆధిపత్యం పెరిగితే ఏపీలో పెద్దగా బలం లేని బీజేపీకి ఇబ్బంది అవుతుందన్నది ఒక దూరాలోచనగా చెబుతున్నారు. అందుకే ఈ విధంగా వ్యూహమా అని అంటున్నారు
కాంగ్రెస్ ని దెబ్బ తీసేందుకే :
అయితే ఏపీలోని ప్రాంతీయ పార్టీలను కానీ దేశంలోని తటస్థ పార్టీలను కానీ బీజేపీ తమ వైపు తిప్పుకోవడం వెనక కాంగ్రెస్ ని తగ్గించాలన్న స్ట్రాటజీ ఉందని అంటున్నారు. ఒక వేళ ఈ పార్టీలను వదిలేస్తే కాంగ్రెస్ కి పరోక్షంగా అయినా మేలు జరుగుతుంది అన్న భారీ వ్యూహంతోనే ఇలా చేస్తున్నారు అని అంటున్నారు. అయితే జాతీయ స్థాయిలో ఆలోచిస్తూ బీజేపీ చేస్తున్న ఈ రాజకీయ విన్యాసాలు ఏపీ వరకు చూసుకుంటే టీడీపీ వంటి పార్టీలకు చేదుగానే ఉంటున్నాయని అంటున్నారు. చూడాలి మరి ఈ రాజకీయ పరిణామాలు ఏ విధంగా మారుతాయో.