విశాఖ రైల్వే జోన్ అపాయింటెడ్ డే అపుడే !
విశాఖ రైల్వే జోన్ కార్యకలాపాలు కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి మొదలు కానున్నాయని అంటున్నారు.;
విశాఖ రైల్వే జోన్ కార్యకలాపాలు కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి మొదలు కానున్నాయని అంటున్నారు. 2026-27 ఆర్థిక సంవత్సరంలో విశాఖ రైల్వే జోన్ కూత పెడుతుందని నమ్మకంగా కూటమి నేతలు చెబుతున్నారు. ఈ మధ్యనే ఢిల్లీ వెళ్ళిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ని కలసి రైల్వే జోన్ కి సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వాలని కోరారు. దానికి కేంద్ర మంత్రి సుముఖత వ్యక్తం చేశారు విశాఖ రైల్వే జోన్ లో కూడా ఆ దిశగా హడావుడి మొదలైంది.
నాలుగు డివిజన్లతో :
విశాఖ సౌత్ కోస్టల్ రైల్వే జోన్ ని నాలుగు డివిజన్లతో ఏర్పాటు చేస్తున్నారు. అందులో విజయవాడ, గుంటూరు, గుంతకల్లు త విశాఖపట్నం డివిజన్ లు ఉంటాయని చెబుతున్నారు. ఈ రైల్వే జోన్ ఏర్పాటుతో దక్షిణ మధ్య రైల్వే హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే దానికి మూడు డివిజన్లు మాత్రమే ఇక మీదట ఉంటాయి. అవి సికింద్రాబాద్, హైదరాబాద్, నాందేడ్ డివిజన్లుగా చెబుతున్నారు. ఇక ఏ డివిజన్ లో ఎంత సిబ్బంది పనిచేయాలి, ఎవరెవరు ఏమిటి ఎక్కడ అన్న లెక్కలు కసరత్తు అంతా పూర్తి చేశారు అని చెబుతున్నారు. అలాగే కొత్తగా ఏర్పాటు కాబోతున్న విశాఖ సౌత్ కోస్టల్ రైల్వే జోన్ లో డివిజన్ల ఆదాయ వ్యయాల గురించి పూర్తి వివరాలు కేంద్ర రైల్వే బోర్డుకు అధికారులు పంపించారు అని అంటున్నారు. డీపీఆర్ కూడా రైల్వే బోర్డుకు చేరి తొమ్మిది నెలలు కావస్తోంది అని చెబుతున్నారు.
ప్రకటన ఆలస్యం :
గత ఏడాది జనవరి 8న ప్రధాని నరేంద్ర మోడీ విశాఖ పర్యటనకు వచ్చారు. ఆయన రైల్వే జోన్ కి శాశ్వత భవనాలకు శంకుస్థాపన చేశారు. ప్రస్తుతం ముడసర్లోవ వద్ద జోన్ ప్రధాన కార్యాలయం ఇతర భవనాలకు సంబంధించి నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. సిరిపురం వద్ద ఉన్న డెక్ బిల్డింగ్ లో తాత్కాలికంగా జోన్ ఆఫీస్ ని ఏర్పాటు చేసి కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. జనరల్ మేనేజర్ తో పాటు కొన్ని పోస్టులను కూడా భర్తీ చేశారు మిగిలిన సిబ్బందిని కూడా త్వరలో నియమిస్తారు అని అంటున్నారు.
పాలనకు గ్రీన్ సిగ్నల్ :
ఇక లాంచనంగా అపాయింటెడ్ డే పేరుతో గెజిట్ నోటిఫికేషన్ ని రిలీజ్ చేస్తారు. దాంతో ఆ రోజు నుంచి విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపలు పాలన మొత్తం మొదలవుతుంది అని అంటున్నారు. రైల్వే జోన్ వస్తే ఎంతో ప్రయోజనంగా ఉంటుంది అని చెబుతున్నారు. పరోక్షంగా ప్రత్యక్షంగా ఉపాధి అవకాశాలు ఉంటాయి. అలాగే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు కూడా విశాఖకు వస్తుందని ఈ ప్రాంత విద్యార్థులు ఒడిషాకు ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదని అంటున్నారు. మొత్తం మీద కూటమి ప్రభుత్వం మరో కీలక హామీని నిలబెట్టుకునే విధంగా వేగంగా అడుగులు వేస్తోంది.