భవిష్యత్తు ఏపీ.. మేధావుల ఆందోళన.. రీజనేంటి ..!
ఇది వాస్తవం. పార్టీలకు అనుకూలంగా ఉండే వారిని పక్కన పెడితే.. ఒకింత రాష్ట్రంపై బాధ్యత, అవగాహన ఉన్నవారు.. చాలా వరకు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు;
ఏపీ రాజకీయాలపై మేధావి వర్గం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇది వాస్తవం. పార్టీలకు అనుకూలంగా ఉండే వారిని పక్కన పెడితే.. ఒకింత రాష్ట్రంపై బాధ్యత, అవగాహన ఉన్నవారు.. చాలా వరకు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ``ప్రస్తుతం ఉన్న పరిణామాలు.. ఏపీ భవిష్యత్తును మరింత శాసించేలా ఉన్నాయి. ఈ విషయంలో పార్టీలు.. ముఖ్యంగా అధికారంలో ఉన్నవారు.. జాగ్రత్తలు తీసుకోవాలి`` అని పలు టీవీ డిబేట్లలో మేధావులు సూచిస్తున్నారు.
ఇది ఒక్కరు చెబితే.. ఏమోలే అనుకోవచ్చు. కానీ, బాధ్యతగా ఉండే మేధావులు, ఇంటలెక్చ్యువల్స్ కూడా ఇదే మాట చెబుతున్నారు. దీనికి ప్రధానంగా మూడు కారణాలను వివరిస్తున్నారు. 1) పార్టీల పరంగా జరు గుతున్న కార్యక్రమాలు. రాష్ట్రంలో 2024లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ పోయి. కూటమిపార్టీలు వచ్చాయి. అయితే.. రాజకీయంగా అనేక నియోజకవర్గాల్లో దారుణాలు చోటు చేసుకున్నాయి. మొదట్లో ఎక్కువగా ఉన్నా.. ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. వీటిని అరికట్టకపోతే.. రేపు ప్రభుత్వం మారితే మళ్లీ ఇవే పునరావృతమవుతాయని చెబుతున్నారు.
2) ప్రభుత్వ విధాన పరమైన నిర్ణయాలు.. ఈ విషయంలోనూ మేధావులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు వైసీపీ అన్న క్యాంటీన్లను రద్దు చేస్తే.. (మళ్లీ ప్రారంభిస్తామని అప్పట్లో బొత్స సత్యనారాయణ ప్రకటించారు. కానీ.. ప్రారంభించలేదు) ఇప్పుడు కూటమి సర్కారు కూడా అదే బాటలో వెళ్తోందని మేధావులు అంటున్నారు. రేపు మళ్లీ ప్రభుత్వం మారే అవకాశం ఉంటే.. మార్పులు అని వార్యంగా జరుగుతాయని.. తద్వారా.. ప్రజలకు ఇబ్బందులు తప్పవని అంటున్నారు. ఈ క్రమంలో వలంటీర్లు, రేషన్ బళ్లను వారు ఉదాహరణగా చెబుతున్నారు.
3) రాజకీయ చాతుర్యం.. ఇది మరింత ప్రమాదకర ధోరణికి పెరిగిందని అంటున్నారు. రాజకీయంగా జరుగుతున్న కొన్ని పనులు ప్రస్తుత కూటమి అయినా.. గత వైసీపీ అయినా.. చేయడం మంచిది కాదని అంటున్నారు. ప్రస్తుతం పోలీసు, సీఐడీ సహా అన్ని వ్యవస్థలు కూడా.. `పెద్దల నేరాలపై`నే దృష్టి పెట్టాయి. దీంతో సామాన్యులకు పోలీసులు, ఇతర అధికారులు అందుబాటులో లేకుండా పోయారన్నది వారి వాదన. రేపు ప్రభుత్వం మారితే తిరిగే పరిస్థితి ఎదురైతే.. సామాన్యుల పరిస్థితి ఇబ్బందేనని అంటున్నారు. అయితే.. ప్రభుత్వం మారబోదని కూటమి చెబుతున్న విషయం గమనార్హం. కానీ.. ప్రజాస్వామ్యంలో ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరుకదా! అంటున్నారు మేధావులు.