అనంత్ అంబానీ పాదయాత్ర.. వ్యాన్ ఆపి వందలాది కోళ్లకు విముక్తి!

మార్చి 28న జామ్ నగర్ లోని మోతీ ఖావ్డీ నుంచి పాదయాత్రను షురూ చేసిన అనంత్ అంబానీ మొత్తం 140కి.మీ. నడవనున్నారు.;

Update: 2025-04-02 04:03 GMT

భారత కుబేరుడు కం రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీని ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అనంత్ అంబానీ ఏమిటి? పాదయాత్ర చేయటమేంటి? అన్న సందేహం కలగొచ్చు. ఆ మాటకు వస్తే కాస్తంత కన్ఫ్యూజన్ కు గురి కావొచ్చు. మీరు చదివింది అక్షరాల నిజం. తాజాగా అనంత్ అంబానీ పాదయాత్ర చేస్తున్నారు. తన ముప్ఫై పుట్టినరోజును ద్వారకలో శ్రీక్రిష్ణుడి దర్శనం కోసం ఆయన జామ్ నగర్ నుంచి పాదయాత్ర చేస్తున్నాడు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు.. రాత్రి వేళలో పాదయాత్ర చేస్తున్నాడు.

మార్చి 28న జామ్ నగర్ లోని మోతీ ఖావ్డీ నుంచి పాదయాత్రను షురూ చేసిన అనంత్ అంబానీ మొత్తం 140కి.మీ. నడవనున్నారు. ఏప్రిల్ 10న ద్వారకకు చేరుకొని తన పుట్టినరోజు వేడుకల్ని జరుపుకోవాలన్నది ప్లాన్. ఇందులో భాగంగా పాదయాత్ర చేస్తున్న వేళ.. అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. అతడు నడుస్తున్నరహదారిలో ఒక కోళ్ల లోడ్ తో కూడిన ఒక వాహనం వెళుతోంది. జంతుప్రేమికుడైన అనంత్ అంబానీ.. ఆ వాహనాన్ని ఆపి.. అందులోని ఒక కోడిని తన చేతిలోకి తీసుకున్నారు.

వాహనంలోని అన్ని కోళ్లకు డబ్బులు చెల్లిస్తానని చెప్పి.. అందులోని మూగజీవాలకు విముక్తి కల్పించాలని కోరాడు. అందుకు వాహన యజమాని ఓకే చెప్పారు. జంతుప్రేమికుడైన అనంత్ అంబానీ.. అందుకోసం ప్రత్యేకంగా ఒక ‘వన్ తార’ పేరుతో ఒక జంతు సంరక్షణ కేంద్రాన్ని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఏమైనా.. మూగజీవాల మీద తనకున్న అభిమానాన్ని.. ప్రేమను తాజా ఉదంతంతో మరోసారి ప్రదర్శించారని చెప్పాలి. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Tags:    

Similar News