అజారుద్దీన్ కోసం- ఎమ్మెల్సీగా ఒకరు అవుట్ ఖాయం ?
తెలంగాణాలోని రాష్ట్ర మంత్రివర్గంలో అజారుద్దీన్ మంత్రిగా ఉన్నారు. అజారుద్దీన్ 2025 అక్టోబర్ 31న తెలంగాణ రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.;
తెలంగాణాలోని రాష్ట్ర మంత్రివర్గంలో అజారుద్దీన్ మంత్రిగా ఉన్నారు. అజారుద్దీన్ 2025 అక్టోబర్ 31న తెలంగాణ రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనకు మైనారిటీ సంక్షేమ, పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ శాఖలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేటాయించారు. ఇక అజారుద్దీన్ ప్రస్తుతం తెలంగాణా ఉభ సభలలో సభ్యుడు కారు. ఆయన మంత్రిగా ప్రమాణం చేసిన ఆరు నెలలోగా నెగ్గి తీరాలి. లేకపోతే ఆయన మాజీ మంత్రి అవుతారు. ఇదిలా ఉంటే ఈ విషయాన్నే బీఆర్ఎస్ ప్రచారం చేస్తోంది. 2025లో జరిగిన జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో రాజకీయ లబ్ది కోసమే అజారుద్దీన్ కి మంత్రి పదవి ఇచ్చారని కూడా బీఆర్ఎస్ విమర్శించింది. ఇక మైనారిటీ మంత్రిగా ఉన్న అజారుద్దీన్ మాజీ మంత్రిగా మారితే ఆ ఎఫెక్ట్ కూడా కాంగ్రెస్ మీద పడుతుంది అని అంటున్నారు.
కేంద్ర పెద్దల సూచన :
ఈ నేపధ్యంలో కేంద్ర కాంగ్రెస్ పెద్దలు తెలంగాణా కాంగ్రెస్ నేతలకు సూచనలు చేశారు అని అంటున్నారు. అజారుద్దీన్ ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఎమ్మెల్సీగా చేయాల్సిందే అని వారు దిశా నిర్దేశం చేశారు అని అంటున్నారు. ఈ విషయంలో ప్రస్తుతం ఎమ్మెల్సీలుగా కాంగ్రెస్ నుంచి ఉన్న వారిలో ఒకరి చేత రాజీనామా చేయించి ఆ పదవిలోకి అజారుద్దీన్ ని పంపించాలని సలహా ఇచ్చారని అంటున్నారు ఆ విషయం సీరియస్ గా పరిశీలించాలని కోరినట్లుగా ప్రచారం సాగుతోంది.
త్యాగరాజు ఎవరు :
ఇదిలా ఉంటే అజారుద్ధీన్ కి తన ఎమ్మెల్సీ పదవిని త్యాగం చేసే త్యాగరాజులు ఎవరు అన్నది ఇపుడు కాంగ్రెస్ లో జరుగుతున్న పెద్ద చర్చ. కాంగ్రెస్ కి చాలా మంది ఎమ్మెల్సీలు ఉన్నారు. మరి ఎమ్మెల్సీ పదవి వదులుకోవడం అంటే ఎవరైనా ఆలోచిస్తారు. ఎందుకంటే ఆరేళ్ళ పాటు పదవీ కాలం ఉన్న కీలకమైన పోస్టు ఇది. ఈ పదవి కోసం కూడా కాంగ్రెస్ లాంటి మహా సముద్రంలో ఎంతో ప్రయత్నం, మరెంతో కసరత్తు రాయబారాలు అన్నీ చేసి తెచ్చుకున్న వారు ఉన్నారు. హాయిగా ఆరేళ్ళ పదవీ కాలం ఉంచుకుని ఆ మీదట అవకాశం ఉంటే మంత్రి లేదా ఎమ్మెల్యే టికెట్ అందుకోవాలని చూసే వారు ఉన్నారని అంటున్నారు.
గౌరవిస్తామని :
అయితే కాంగ్రెస్ హై కమాండ్ ఈ త్యాగరాజులకు ఒక భారీ ఆఫర్ ని ఇచ్చినట్లుగా చెబుతున్నారు. అదేంటి అంటే ఎవరైతే తమ ఎమ్మెల్సీ పదవిని వదులుకోవదానికి ముందుకు వస్తారో వారికి సముచితమైన గౌరవంతో పాటు వేరే విధమైన మంచి పదవిని ఇస్తామని కూడా హామీ ఇస్తున్నారుట. మరి ఎమ్మెల్సీ పదవి ముఖ్యమా లేక కాంగ్రెస్ పెద్దల దృష్టిలో పడి పార్టీ కోసం తాము పెద్ద నిర్ణయం తీసుకున్నామని అనిపించుకోవడం ముఖ్యమా అన్నది కూడా అంతా చర్చిస్తున్నారుట. కాంగ్రెస్ హైకమాండ్ ఆసీస్సులు ఉంటే ఎమ్మెల్సీ లాంటి పదవులు మరిన్ని ఫ్యూచర్ లో పొందగలని అనుకుంటున్న వారూ ఉన్నారు.
రాజకీయాల్లో ఏమైనా :
అయితే హామీలు వేరు ఆచరణ వేరు. పదవి ఇవ్వాలని ఉన్నా సమీకరణలు సరిపోకపోవచ్చు. లేదా వేరే అవాంతరాలు రావచ్చు ఒక్కసారి చేతిలో ఉన్న పదవి వదిలేస్తే మళ్ళీ దక్కుతుందా అన్న చర్చ కూడా ఎమ్మెల్సీలలో ఉంది అని అంటున్నారు నల్గొండ జిల్లా మునుగోడు ఎమ్మెల్యేగా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తామని ఏకంగా కాంగ్రెస్ పెద్దలే హామీ ఇచ్చారు. కానీ రెండేళ్ళు పూర్తి అవుతున్నా దక్కలేదు. దానికి సామాజిక రాజకీయ సమీకరణలు ఎన్నో ఉన్నాయి. అందువల్ల అలాంటి పరిస్థితులు కూడా ఉండొచ్చు అని ఆలోచిస్తున్న వారూ ఉన్నారు.
కేవలం రెండు నెలలు మాత్రమే :
ఏది ఏమైనా కాంగ్రెస్ పెద్దలు చెప్పారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ నుంచి ఒకరు అవుట్ కావాల్సిందే. అదే సమయంలో ఆ సీటులోకి అజారుద్దీని వచ్చి చేరాల్సిందే. ఇంకో విషయం ఏమిటి అంటే ఈ రాజీనామా తతంగం అంతా తొందరలోనే జరిగిపోవాలి. ఎందుకంటే కేంద్ర ఎన్నికల సంఘం రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ ప్రస్తుతం రిలీజ్ చేసింది. ఇపుడు రాజీనామా చేస్తే దానితో పాటు జత చేస్తారు. అలా కేవలం రెండు నెలలు మాత్రమే గడువు ఉన్న అజారుద్దీన్ చట్ట సభ ప్రవేశానికి ఆటంకం ఉండదని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.