అమిత్ షా నోట రిటైర్మెంట్ మాట...ప్లాన్ పెద్దదే !
అలాంటి అమిత్ షా నోట రిటైర్మెంట్ మాట ఒక్కసారిగా రావడమేంటి అన్నది అంతా ఆశ్చర్యానికి గురి చేసేదే.;
కేంద్ర హోంమంత్రి అమిత్ షా అంటే బీజేపీలో ఉక్కు మనిషిగా చెబుతారు. అటు పార్టీలో ఇటు ప్రభుత్వంలో అతి పెద్దాయనగా కూడా పేర్కొంటారు. ఆయన కనుసన్నల్లోనే అంతా జరుగుతుందని కూడా చెప్పుకుంటారు. ప్రధాని నరేంద్ర మోడీకి కుడిభుజంగా ఉంటూ ఆయన మనసెరిగి అన్నీ చక్కబెట్టే వారుగా అమిత్ షాను అంతా చూస్తారు.
దేశానికి ఆయన హోం మంత్రి. పవర్ ఫుల్ సీటు అన్న మాట. ప్రధాని తరువాత అంతటి స్థాయి అంతటి పొజిషన్ లో ఉన్న అమిత్ షా రాజకీయంగా చూస్తే ఎక్కాల్సిన మెట్లు పెట్టుకున్న లక్ష్యాలు చాలానే ఉన్నాయని అంతా అంటారు. అలాంటి అమిత్ షా నోట రిటైర్మెంట్ మాట ఒక్కసారిగా రావడమేంటి అన్నది అంతా ఆశ్చర్యానికి గురి చేసేదే.
ఎందుకంటే ఆయనే సర్వస్వం అన్నట్లుగా అంతా ఉన్న వేళ రాజకీయ తెర మీద నుంచి ఆయన ఎలా పక్కకు తప్పుకుంటారు. అది సాధ్యమేనా అంటే అది ఇప్పటి మాట కాదు, ఎప్పుడో జరిగే మాట అని భావించాలి. అమిత్ షా కూడా అలాగే చెప్పారు. భవిష్యత్తులో తాను రాజకీయాల నుంచి తప్పుకున్నపుడు అన్న సెన్స్ లోనే ఆయన మాట్లాడారు. ఎంతటి గొప్ప నాయకుడు అయినా ఏదో ఒక దశలో తన ప్రధాన వృత్తులకు దూరం అవుతారు. అంతే కాదు సుదీర్ఘ కాలంగా బిజీ లైఫ్ లో ఉన్న వారు తమకు నచ్చిన వాటికి దూరం అవుతారు.
రిటైర్మెంట్ అన్నది పెట్టుకున్నాక వాటి గురించి చాలా సీరియస్ గా ఆలోచిస్తారు. అందువల్ల తనకంటూ కొన్ని లక్ష్యాలను పెట్టుకుని వేటిని రిటైర్మెంట్ తరువాత చేయాలని కూడా ఆలోచిస్తారు. సరిగ్గా అమిత్ షా కూడా అదే థింక్ చేస్తున్నారు అన్న మాట. తాజాగా ఆయన గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల సహకార సంఘాల మహిళలతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ ఆసక్తికరమైన వ్యాఖ్యలే చేసారు.
తాను రాజకీయాల నుంచి రిటైర్ అయిన ప్రకృతి వ్యవసాయం చేస్తాను అని తన మనసులో మాట బయట పెట్టారు. రసాయన అ ఎరువులతో కూడిన వ్యవసాయం వల్ల జనాల ఆరోగ్యం దెబ్బ తింటోందని అలాంటి ఆహారం తిని ప్రజలు అనేక సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు అని ఆయన అన్నారు. అందుకే రసాయన ఎరువులతో పండించే పంటలు కాకుండా ప్రకృతి వ్యవసాయంతో పండించే పంటల వల్ల లాభాలు ఎన్ని ఉంటాయో చూపిస్తాను అని అంటున్నారు.
ప్రకృతి వ్యవసాయం అన్నది శరీరాన్ని వ్యాధులకు దూరం చేయడమే కాకుండా వ్యవసాయ ఉత్పాదకతను కూడా పెంచుతుంది అని ఆయన అంటున్నారు. తనకు సహకార శాఖ అతి పెద్ద శాఖ అని కూడా ఆయన అన్నారు. అందరూ హోం శాఖ పెద్దది అనుకుంటారని కానీ తనకు మనసుకు నచ్చిన శిఖ ముఖ్యమైన శాఖ ఇదేనని ఆయన చెప్పారు. ఇక ఈ శాఖ ద్వారానే తాను దేశంలోని రైతులు పేదలు, గ్రామాలు పశు సంపద కోసం పనిచేయగలుగుతున్నానని అది తనకు ఎంతో సంతృప్తి ఇస్తోందని అమిత్ షా చెప్పారు.
ఇక తాను రిటైర్ అయిన తరువాత వేదాలు ఉపనిషత్తులు కూడా చదువుతాను అని ఆయన చెప్పడం విశేషం. అంటే ఒక వైపు ఆధ్యాత్మికత మరో వైపు వ్యవసాయం ఇలా తన రిటైర్మెంట్ లైఫ్ ని చక్కగా లీడ్ చేయడానికి అమిత్ షా మంచి ప్లాన్ నే వేశారు అని అంటున్నారు.
అయితే అమిత్ షా మోడీ తరువాత వరసలో అగ్ర స్థానంలో ఉన్నారు. ఆయన కాబోయే ప్రధానిగా కూడా ప్రచారంలో ఉంది. మరి ఆయన ముందు ముందు రాజకీయంగా సాధించాల్సినవి చాలా ఉన్నాయని అంటున్నారు. అటు తరువాతనే ఆయన రిటైర్మెంట్ ఉండొచ్చు అని అంటున్నారు. మొత్తానికి అమిత్ షా నోట రిటైర్మెంట్ అన్న మాట రావడం మాత్రం చర్చనీయాంశానే ఉంది మరి.