'ఆ బుల్లెట్లు, ఈ బుల్లెట్లు సేమ్'... అమిత్ షా సంచలన వ్యాఖ్యలు!

జమ్మూకశ్మీర్‌ లో సోమవారం జరిగిన ‘ఆపరేషన్‌ మహాదేవ్‌’లో పహల్గాం దాడితో సంబంధం ఉన్న ముగ్గురు ఉగ్రవాదులను సైనిక దళాలు మట్టుపెట్టిన సంగతి తెలిసిందే.;

Update: 2025-07-29 11:19 GMT

జమ్మూకశ్మీర్‌ లో సోమవారం జరిగిన ‘ఆపరేషన్‌ మహాదేవ్‌’లో పహల్గాం దాడితో సంబంధం ఉన్న ముగ్గురు ఉగ్రవాదులను సైనిక దళాలు మట్టుపెట్టిన సంగతి తెలిసిందే. వారిలో ఒకడు ఉగ్రదాడి సూత్రధారి సులేమాన్‌ అని, మిగిలిన ఇద్దరూ అతడి అనుచరులని వార్తలు వచ్చాయి. అయితే... తాజాగా అమిత్‌ షా తన ప్రకటన ద్వారా ఆ ఇద్దరు హతులు కూడా పహల్గాం దాడికి పాల్పడినవారేనని ధ్రువీకరించారు. ఈ సందర్భంగా పార్లమెంటులో సంచలన వ్యాఖ్యలు చేశారు.

అవును.... పహల్గాం ఘటనకు సంబంధించి ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా పార్లమెంట్ వేదికగా ప్రకటించారు. కీలక నిందితుడు సులేమాన్‌ ను హతమార్చామని చెప్పారు. మిగిలిన ఇద్దరూ కూడా లష్కరే తయిబాకు చెందినవాళ్లేనని.. వారి పేర్లు అఫ్గాన్‌, జిబ్రాన్‌ అని వెల్లడించారు. ఈ సందర్భంగా ఆపరేషన్ సిందూర్ పై రెండోరోజు కొనసాగిన చర్చలో పలు కీలక విషయాలు వెల్లడించారు.

ఈ సందర్భంగా... బైసరన్ లోయలో మన పౌరులను హత్య చేసిన వారిలో ఈ ముగ్గురు కూడా ఉన్నారని.. తాజా ఆపరేషన్ లో వారు కూడా చంపబడ్డారని.. ఈ విషయాన్ని తాను పార్లమెంటుకు, దేశానికి చెప్పాలనుకుంటున్నానని అమిత్ షా అన్నారు. "మా అమాయక పౌరులను చంపిన ముగ్గురు ఉగ్రవాదులను మేము చంపాము" అని షా ప్రకటించారు. అనంతరం పహల్గాం దాడిలో ఈ ముగ్గురు ముష్కరుల ప్రమేయం ఉందని ప్రభుత్వం ఎలా నిర్ధారించిందో వివరించారు.

ఇందులో భాగంగా... ఈ ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చిన వారిని ఎన్.ఐ.ఏ. గతంలోనే అరెస్టు చేసిందని.. ఈ క్రమంలో తాజాగా ఈ ఉగ్రమూకల మృతదేహాలను శ్రీనగర్‌ కు తీసుకువచ్చినప్పుడు.. గుర్తించమని తాము వారిని కోరామని అన్నారు. మరింత నిర్ధారణ కోసం.. పహల్గాంలోని బైసరన్ లోయలో పర్యాటకులపై దాడి జరిగిన స్థలం నుండి స్వాధీనం చేసుకున్న బుల్లెట్ షెల్స్ ఫోరెన్సిక్ నివేదికలను ఉపయోగించామని ఆయన అన్నారు.

ఈ సందర్భంగా... ఈ ఉగ్రవాదులను చంపిన తర్వాత, వారి రైఫిల్స్‌ ను స్వాధీనం చేసుకున్నారని.. అందులో ఒక ఎం9, రెండు ఏకే-47లు ఉన్నాయని.. ఈ రైఫిల్స్‌ ను ప్రత్యేక విమానంలో చండీగఢ్ సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీకి పంపించామని తెలిపారు. ఈ సమయంలో వీరి వద్ద దొరికిన తుపాకులలోని బుల్లెట్లను, పహల్గాంలో దొరికిన వాటితో వాటిని సరిపోల్చామని.. అప్పుడు నిర్ధారణ అయ్యిందని తెలిపారు.

ఈ విషయంలో ఎటువంటి సందేహానికి ఆస్కారం లేదని చెప్పిన అమిత్ షా... బాలిస్టిక్ నివేదిక తన దగ్గర ఉందని.. ఆరుగురు శాస్త్రవేత్తలు దానిని క్రాస్ చెక్ చేసి, పహల్గాంలో పేలిన బుల్లెట్లు, తాజాగా ముగ్గురు ఉగ్రవాదుల వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న తుపాకుల నుండి పేలిన బుల్లెట్లు 100 శాతం సరిపోలుతున్నాయని వీడియో కాల్ ద్వారా తనకు ధృవీకరించారని ఆయన అన్నారు. ఇదే సమయంలో.. ఆ ముగ్గురూ పాకిస్తానీలేనని తమ వద్ద రుజువు ఉందని తెలిపారు.

Tags:    

Similar News