ఏపీకి 38 తెలంగాణాకు 26...డిక్లేర్ చేసిన అమిత్ షా !

లోక్ సభ సీట్ల పునర్ విభజన కోసం రాజ్యాంగ సవరణకు సంబంధించిన బిల్లులు ఆమోదించేందుకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఈ నెల 16 నుంచి మూడు రోజుల పాటు సాగుతున్న సంగతి తెలిసిందే.;

Update: 2026-04-16 15:58 GMT

లోక్ సభ సీట్ల పునర్ విభజన కోసం రాజ్యాంగ సవరణకు సంబంధించిన బిల్లులు ఆమోదించేందుకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఈ నెల 16 నుంచి మూడు రోజుల పాటు సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సభలో అధికార ఎన్ డీయే విపక్ష ఇండియా కూటమి నేతల మధ్య వాడి వేడిగా చర్చ సాగుతోంది. డీలిమిటేషన్ ద్వారా దక్షిణాదికి తీరని అన్యాయం జరుగుతోందని విపక్షాలు ఆరోపించిన నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా లోక్ సభలో మాట్లాడుతూ దీని మీద పూర్తి స్థాయిలో వివరణ ఇచ్చారు. దక్షిణాదికి సీట్లు పెరుగుతున్నాయని ఎక్కడా తగ్గడం లేదని ఆయన సంఖ్య తో సహా వివరించే ప్రయత్నం చేశారు.

ఏపీకి తెలంగాణాకు :

డీలిమిటేషన్ ద్వారా ఏపీకి తెలంగాణాకు ఎన్ని సీట్లు పెరుగుతాయో అమిత్ షా వివరించారు ఏపీకి ప్రస్తుతం ఉన్న 25 సీట్లు కాస్తా యాభై శాతం పెరిగి 38 గా మారుతాయని అలాగే తెలంగాణాలో ప్రస్తుతం ఉన్న 17 సీట్లు కాస్తా 26 గా పెరుగుతాయని ఆయన తెలిపారు. కర్ణాటకలో 28 సీట్లు 42 గా, కేరళలో 20 సీట్లు 30 గా, తమిళనాడులో 39 సీట్లు కాస్తా 59 గా పెరుగుతాయని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటిదాకా దక్షిణాదిన ఉన్న మొత్తం ఎంపీ సీట్లు మొత్తం 129 అయితే యాభై శాతం అదనంగా జత కలవడం వల్ల అవి కాస్తా 195 గా పెరుగుతాయని పేర్కొన్నారు.

జనాభా కంటే ఎక్కువ :

దక్షిణాదిన జనాభా కంటే కూడా లోక్ సభ సీట్లు ఎక్కువగా పెరుగుదల ఈసారి జరుగుతోందని అమిత్ షా విశ్లేషించారు. అంతే కాదు ఇప్పటిదాకా దక్షిణాదిన ఉన్న రాష్ట్రాలలో ఎంపీ సీట్లు దేశం మొత్తం సీట్లలో 23.76గా ఉంటే అదనం సీట్ల పెరుగుదలతో అది కాస్తా 23.97గా పెరుగుతోందని ఆయన చెప్పారు. ఇలా సీట్లూ సీట్ల షేరూ కూడా పెరుగుతున్న నేపధ్యంలో దక్షిణాదికి ఏ విధంగా అన్యాయం జరుగుతోంది అన్నది విపక్ష సభ్యులే చెప్పాలని అమిత్ షా కోరడం విశేషం.

ప్రజలను తప్పు దోవ :

విపక్షాలు లేని పోని అపోహలతో ప్రజలను తప్పు దోవ పట్టిస్తున్నాయని కేంద్ర హోం మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. వాస్తవాలు గణాంకాలు ఈ విధంగా ఉంటే అసత్యాలు ప్రచారం చేయడం తగదని ఆయన హితవు చెప్పారు. ఈ మొత్తం సీట్లలో 33 శాతం మహిళలకు రిజర్వ్ అవుతాయని ఆ విధంగా మహిళా సాధికారత సాధ్యపడుతుందని అమిత్ షా చెప్పారు వీటికి తోడు జనరల్ స్థానాల్లో కూదా మహిళలకు అవకాశం ఇస్తే వారి ప్రాతినిధ్యం చట్ట సభలలో మరింతగా పెరుగుతుందని ఆయన సూచించారు.

సుప్రీం కోర్టుకు డీఎంకే :

అయితే అమిత్ షా చెప్పిన దాని మీద తమిళనాడులో అధికార పార్టీ డీఎంకే విభేదిస్తోంది. దక్షిణాదికి అన్యాయం జరుగుతోందని ముఖ్యమంత్రి స్టాలిన్ ఆరోపించరు. ఒక వేళ డీలిమిటేషన్ బిల్లు కనుక పార్లమెంట్ ఆమోదం పొందితే తాము సుప్రీం కోర్టుని ఆశ్రయిస్తామని ఆయన స్పష్టం చేస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాల కోసం న్యాయ పోరాటానికి కూడా డీఎంకే సిద్ధపడుతుందని ఆయన అన్నారు. ఇక కేంద్ర హోం మంత్రి పార్లమెంట్ ఇచ్చినది కేవలం నోటి మాట హామీ మాత్రమే అని డీఎంకే అంటోనిద్. దీనికి సంబంధించిన అంశాలు బిల్లులో స్పష్టంగా పేర్కొనాలని డీఎంకే డిమాండు చేస్తోంది అయితే బిల్లులో అలా పేర్కొనకపోవడంతో తగిన ఆధారాలతో తాము సుప్రీం కోర్టులో పిటిషన్ వేస్తామని డీఎంకే చెబుతోంది.

మహిళా కోటా ఉండాల్సిందే :

ఇంకో వైపు చూస్తే శివసేన ఉద్ధవ్ థాక్రే పార్టీ మహిళా రిజర్వేషన్లను తక్షణం అమలు చేయాల్సిందే అని డిమాండ్ చేసింది. లోక్ సభ అసెంబ్లీ సీట్ల పునర్ విభజన ప్రక్రియను మాత్రం వాయిదా వేయాలని ఉద్ధవ్ థాక్రే కోరారు. ఇది ఏ ఒక్క పార్టీకి సంబంధించిన అంశం కాదని దేశ భవిష్యత్తుకు సంబంధించిన విషయం కాబట్టి విస్తృఅంగా చర్చ జరిపాక మాత్రమే సీట్ల పెంపు మీద ఆలోచించాలని ఆయన కోరారు. మొత్తానికి సీట్లు ఎక్కువగా పెరుగుతాయని అమిత్ షా చెబుతున్నారు కానీ ఆ మేరకు ఉత్తరాదికి కూడా పెరిగితే మళ్లీ కధ మొదటికే కదా అన్నదే సౌత్ స్టేట్స్ లీడర్ల పార్టీల మాటగా ఉంది.

Tags:    

Similar News