పార్లమెంట్ లో అమరావతి...కీలక అడుగులు

అమరావతి రాజధాని ఆంధ్ర ప్రదేశ్ కి శాశ్వతమైనది అని చట్టబద్ధత కల్పించే బిల్లుని కేంద్ర హోంమంత్రి అమిత్ షా బుధవారం లోక్ సభలో ప్రవేశపెట్టబోతున్నారు అని అంటున్నారు.;

Update: 2026-04-01 02:30 GMT

అమరావతి రాజధాని ఆంధ్ర ప్రదేశ్ కి శాశ్వతమైనది అని చట్టబద్ధత కల్పించే బిల్లుని కేంద్ర హోంమంత్రి అమిత్ షా బుధవారం లోక్ సభలో ప్రవేశపెట్టబోతున్నారు అని అంటున్నారు. ఈ మేరకు లోక్ సభ బీఏసీలో అమరావతి రాజధానికి చట్టబద్ధత అంశాన్ని చేర్చారని తెలుస్తోంది. ఒక గంట పాటు అమరావతి రాజధాని విషయంలో చట్టబద్ధత కల్పించడం మీద చర్చ సాగనుంది. ఆ మీదట లోక్ సభ ఈ బిల్లుని ఆమోదించి రాజ్యసభకు పంపుతుంది.

ప్రధాన అంకం పూర్తి :

ఇక ఏప్రిల్ 2వ తేదీన రాజ్యసభలో ఏపీకి రాజధానిగా అమరావతి బిల్లుని ఎన్ డీయే ప్రభుత్వం ప్రవేశపెడుతుంది. అక్కడ కూడా చర్చ సాగిన తరువాత ఉభయ సభల ఆమోదంతో ఈ బిల్లు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముందుకు వస్తుందని అంటున్నారు. రాష్ట్రపతి సంతకంతో ఈ బిల్లు చట్టం కావడంతో పాటు గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్ తో ప్రధాన అంకం పూర్తి అవుతుంది అని అంటున్నారు.

భావోద్వేగమే :

ఏపీకి రాజధాని అంటూ లేకుండా 12 ఏళ్ళు జరిగిపోయాయి. అంతకు ముందు ఆంధ్రప్రదేశ్ కి హైదరాబాద్ రాజధానిగా ఉంది కానీ రెండు సార్లు భారీ ఎత్తున తెలంగాణా ఉద్యమాలు జరిగాయి. దాంతో ఏపీకి రాజధాని అన్నది లేదా ఇక ఎక్కడ అన్న భావోద్వేగమైన పరిస్థితులు అంతటా కనిపించాయి. అయితే ఎట్టకేలకు ఏపీ కల సాకారం అవుతోంది. అంతే కాదు గడచిన 75 ఏళ్ళ పాటు రాజధాని కోసం సాగిన పరిశ్రమ అలాగే ఏపీ జనాలకు ఉన్న అతి పెద్ద ఆవేదనకు ఒక ముగింపు లభించబోతోంది అని అంటున్నారు.

ఎవరేమిటి అన్నది :

ఇక పార్లమెంట్ ఉభయ సభలలో చర్చ సందర్భంగా ఎవరు ఏమిటి మాట్లాడుతారు, ఏ పార్టీ స్టాండ్ ఏమిటి అన్న చర్చ కూడా సాగుతోంది. ఎన్డీయే ప్రతిపాదించే రాజధాని అంశం మీద కాంగ్రెస్ ఏమంటుంది, అలాగే ఇతర విపక్ష పార్టీలు ఏ విధంగా ప్రతిస్పందిస్తాయి అన్నది చూడాల్సి ఉంది. ఇక పార్లమెంట్ లో ఏపీకి సంబంధించి మూడు పార్టీలు ప్రాతినిధ్యం వహిస్తునాయి. అందులో టీడీపీ జనసేన అధికార ఎన్డీయేలో ఉంటే వైసీపీ విపక్షంలో ఉంది. ఏపీ అసెంబ్లీ మార్చి 28న ప్రత్యేక సమావేశం పెట్టి అమరావతిని ఏకైక రాజధానిగా చేయాలని కోరుతూ కేంద్రానికి సిఫార్సు చేసింది. ఆ సమావేశానికి వైసీపీ అటెండ్ కాలేదు,

అంతా హర్షించేదిగా :

కానీ పార్లమెంట్ ఉభయ సభలలో వైసీపీకి 11 మంది ఎంపీలు ఉన్నారు. ఈ బిల్లు పార్లమెంట్ ముందుకు వచ్చినపుడు వారి స్పందన ఎలా ఉంటుంది అన్నది కూడా ఆసక్తికరమే అని అంటున్నారు. మొత్తం మీద చూస్తే ఏపీకి ఈ రోజు దాకా రాజధాని అని ఫలానా పేరుతో చట్టబద్ధత లేకపోవడంలో అందరి పాత్ర ఉంది అని అంటున్నారు. ఏది ఏమైనా ఏపీ ప్రజలు గర్వంగా మాకూ ఒక రాజధాని ఉంది అని చెప్పుకునేలా పార్లమెంట్ లో కీలక అడుగులు పడడం మాత్రం అంతా హర్షించేదిగా ఉందని చెప్పవచ్చు.

Tags:    

Similar News