అంబటి రాయుడు ఆరేళ్లుగా తెరవని ప్రపంచ కప్ సూట్ కేస్ కథేంటో తెలుసా?
కానీ, రాయుడు ప్రపంచ కప్ నకు ఎంపికవకపోవడంతో తీవ్ర నిర్వేదానికి గురయ్యాడని.. అతడితో పాటు కుటుంబం కూడా క్షోభకు గురైందని విద్య తెలిపారు.;
2002లోనే లిస్ట్ ఏ క్రికెట్ లో అడుగుపెట్టి.. భవిష్యత్ సచిన్ గా పేరు తెచ్చుకుని.. జాతీయ స్థాయిలో హీరోగా ఎదిగాడు తెలుగు క్రికెటర్ అంబటి రాయుడు. ముక్కుసూటితనం, అన్యాయాన్ని సహించలేకపోవడం, వివాదాలు అతడి కెరీర్ ను దెబ్బతీశాయి. 20 ఏళ్ల వయసులో 2007లో ఇండియన్ సూపర్ లీగ్ లోకి వెళ్లడం మరింత చేటు చేసింది. బీసీసీఐ నిషేధానికి గురయ్యేలా చేసింది. బీసీసీఐ దయ, సచిన్ టెండూల్కర్ అండతో ఎలాగో బయటపడ్డ రాయుడు 2010 నాటికి ముంబై ఇండియన్స్ కు ఆడడం ద్వారా టీమ్ ఇండియా గడప తొక్కాడు. 2019 వరకు రెగ్యులర్ వన్డే జట్టు సభ్యుడిగా ఉన్నాడు.
2019లో ఇంగ్లండ్ లో జరిగిన వన్డే ప్రపంచ కప్ నకు రాయుడి ఎంపిక ఖాయం అనుకున్నారు. నాలుగో స్థానంలో రాయుడు మెరుగ్గా ఆడడంతో ఎంపిక లాంఛనమే అని భావించారు. కానీ, ఫిట్ నెస్ టెస్టులో ఫెయిలవడం, ప్రపంచ కప్ నకు ముందు జరిగిన సిరీస్ లో రాణించలేకపోవడం చేటు చేసింది.
2019 ప్రపంచ కప్ జట్టులో చోటు దక్కకపోవడంతో రాయుడు తీవ్ర నిరాశకు గురయ్యాడు. తన స్థానంలో విజయ్ శంకర్ అని తమిళనాడు ఆల్ రౌండర్ ను ఎంపిక చేసి అతడు త్రీ డీ ప్లేయర్ అని తెలుగువాడైన అప్పటి చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ చెప్పడంతో రాయుడు ఆగ్రహానికి గురయ్యాడు. సెలక్షన్ కమిటీ నిర్ణయాన్ని ఎద్దేవా చేస్తూ తాను ఇప్పుడే ప్రపంచ కప్ చూసేందుకు ‘త్రీడీ కళ్లద్దాలు’ కొనుక్కుంటానని ట్వీట్ పెట్టాడు.
కాగా, తాజాగా ఓ పాడ్ కాస్ట్ లో రాయుడి భార్య విద్య అప్పటి పరిస్థితిని తలచుకుని భావోద్వేగానికి గురయ్యారు. ప్రపంచ కప్ జట్టులోకి ఎంపికవడం ఖాయమని భావించి రాయుడికి బీసీసీఐ కిట్ బ్యాగ్, సూట్ కేస్ కూడా పంపిందని విద్య తెలిపారు.
కానీ, రాయుడు ప్రపంచ కప్ నకు ఎంపికవకపోవడంతో తీవ్ర నిర్వేదానికి గురయ్యాడని.. అతడితో పాటు కుటుంబం కూడా క్షోభకు గురైందని విద్య తెలిపారు. అంతేకాదు.. బీసీసీఐ నాడు పంపిన సూట్ కేస్ ను, కిట్ ను ఆరేళ్లవుతున్నా రాయుడు తెరవనే లేదట. ఎలా వచ్చాయో అలాగే స్టోర్ రూమ్ లో పెట్టామని విద్య చెప్పారు.
వరల్డ్ కప్ టూర్ కోసం దుస్తులు రెడీ చేసుకుని.. వీసా ఉండి కూడా.. జట్టుకు ఎంపిక కాలేదని తెలియడం ఎంతో బాధగా అనిపించింది విద్య తెలిపారు.