టీడీపీ కంచుకోట మీదకు అంబటి
అయితే సత్తెనపల్లి నుంచి అంబటిని తప్పిస్తారు అని చాలా కాలంగా వినిపిస్తున్న మాట. ఇపుడు ఆయనను గుంటూరు పశ్చిమకు షిఫ్ట్ చేశారు.;
వైసీపీలో మీడియా పరంగా బిగ్ సౌండ్ చేస్తూ పార్టీ ఉనికిని బలంగా చాటుతున్న మాజీ మంత్రి అంబటి రాంబాబుకు వైసీపీ అధినాయకత్వం గుంటూరు పశ్చిమ నియోజకవర్గం బాధ్యతలు అప్పగించింది. వైసీపీ నియోజకవర్గ కో ఆర్డినేటర్ గా ఆయన వ్యవహరిస్తారు.
అంబటి వైసీపీ నుంచి 2014, 2019, 2024 ఎన్నికల్లో మూడు సార్లు సత్తెనపల్లి నుంచి పోటీ చేశారు. మొదటిసారి తక్కువ ఓట్లతోనే పరాజయం పాలు అయ్యారు. ఇక రెండవ సారి మంచి విజయం అందుకుని ఎమ్మెల్యే అయి ఆ మీదట మంత్రి కూడా అయ్యారు. 2024లో అదే సీటు నుంచి పోటీ చేసి ఓటమి పాలు అయ్యారు.
అయితే సత్తెనపల్లి నుంచి అంబటిని తప్పిస్తారు అని చాలా కాలంగా వినిపిస్తున్న మాట. ఇపుడు ఆయనను గుంటూరు పశ్చిమకు షిఫ్ట్ చేశారు. ఈ సీటు నుంచి 2024 ఎన్నికల్లో అప్పటి మంత్రి విడదల రజనీ పోటీ చేసి ఓటమి పాలు అయ్యారు. తిరిగి ఆమె తన సొంత సీటు చిలకలూరిపేటకు షిఫ్ట్ అయ్యారు.
దీంతో గుంటూరు పశ్చిమ ఖాళీగా ఉంది. ఇన్నాళ్ళకు ఆ సీటుని అంబటి రాంబాబుతో భర్తీ చేశారు. ఇక 2019 ఎన్నికల్లో టీడీపీ తరఫున గుంటూరు పశ్చిమ నుంచి పోటీ చేసి గెలిచిన మద్దాలి గిరి ఆ తరువాత వైసీపీకి మద్దతు ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే ఆయనకు 2024 ఎన్నికల్లో టికెట్ ఇవ్వకపోవడంతో వైసీపీని వీడిపోయారు.
ఇక గుంటూర్ పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గం గురించి చెప్పాలంటే 2009 లో ఏర్పడిన ఈ నియోజకవర్గం టీడీపీకి కంచుకోట. వరుసగా మూడు ఎన్నికల్లో టీడీపీ ఇక్కడ నుంచి గెలిచింది. 2009లో మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఇక్కడ నుంచి గెలిచారు.
ఇక 2014లో టీడీపీ అభ్యర్ధిగా మోదుగుల వేణుగోపాల్ రెడ్డి గెలిచారు. 2019లో మద్దాల గిరి గెలిస్తే 2024లో గల్లా మాధవి గెలిచారు. అలా టీడీపీకి బలమైన ఈ సీటు నుంచి అంబటి రాంబాబుకు వైసీపీని గెలిపించే బాధ్యత అప్పగించారు. అయితే ఇక్కడ బలమైన కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉంది. దాంతో అంబటిని బరిలోకి దించితే మంచి ఫలితం రావచ్చు అన్నది వైసీపీ ఆలోచిస్తోంది అని అంటున్నారు.
ఇక పార్టీకి జగన్ కి నమ్మకంగా ఉంటూ వస్తున్న అంబటి రాంబాబు విషయంలో న్యాయం చేఅయలని భావించే వైసీపీ ఆయనకు పశ్చిమ దారి చూపించింది అని అంటున్నారు. ఇక జగన్ తో పాటు అన్నింట్లో ఉంటూ కేసుల మీద కేసులు పెట్టించుకుంటున్నారు. తాజాగా జగన్ తో రెంటపాళ్ళకు వెళ్ళిన అంబటి రాంబాబు అక్కడ నిషేధాజ్ఞలు ఉల్లంఘించారన్న వ్యవహారంలో ఆయన పైన కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. మొత్తానికి అంబటి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలని అనుకుంటున్నరో లేదో తెలియదు కానీ ఆయనకు వైసీపీ మరో చాన్స్ ఇచ్చినట్లే అని అంటున్నారు.