ఒక కేసుకాదు.. 100 కేసులకు అంబటి సిద్ధమట!
వైసీపీ కీలక నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు.. ప్రభుత్వానికి సవాలు రువ్వారు. తనపై ఒక కేసు కాదు.. ఒకేసారి 100 కేసులు పెట్టుకున్నా.. భయపడేది లేదన్నారు.;
వైసీపీ కీలక నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు.. ప్రభుత్వానికి సవాలు రువ్వారు. తనపై ఒక కేసు కాదు.. ఒకేసారి 100 కేసులు పెట్టుకున్నా.. భయపడేది లేదన్నారు. ప్రజల కోసం.. పోరాటం చేస్తు న్నానని స్పష్టం చేశారు. రాజకీయాల కోసం కాదని.. ప్రభుత్వం తనను, తన కుటుంబాన్ని వేధిస్తోందని ఆరోపించారు. తాజాగా గుంటూరులో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. తనను ప్రభుత్వం బ్లాక్ మెయిల్ చేసి.. కేసులో భయపెట్టాలని చూస్తోందని వ్యాఖ్యానించారు.
ఏం జరిగింది?
తాజాగా అంబటిపై గుంటూరు జిల్లా పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటికే పలు కేసుల్లో ఉన్న అంబటిపై.. తాజాగా కేసు నమోదు కావడంతో ఆయన ఫ్రెస్ట్రేషన్‌కు గురయ్యారు. ''ఏం కేసు..'' అంటూ మీడియా మిత్రులను ఆరా తీశారు. ఇటీవల తనను పోలీసులు కస్టడీలో వేధించారని పేర్కొంటూ.. గుంటూరు కలెక్టరేట్ వద్ద అంబటి 12 గంటల నిరాహారదీక్ష చేపట్టారు. అయితే.. ఈ దీక్షకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. అయినా.. అంబటి దీక్షను కొనసాగించారు. ఈ వ్యవహారంపై కలెక్టరేట్ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు రెండు రూపాల్లో కేసులు పెట్టారు. 1) అనుమతి లేకుండా.. బహిరంగ ప్రదేశాల్లో నిరశనకు దిగడం. 2) ప్రజలకు ట్రాఫిక్‌కు ఇబ్బందులు కలిగించడం.
ఈ పరిణామాలపైనే స్పందించిన అంబటి.. కేసులతో తనను కట్టడిచేయాలని ప్రభుత్వం చూస్తోందని.. రాజకీయాల్లోకి వచ్చాక.. ఇలాంటి కేసులకు భయపడేది లేదని చెప్పారు. ఒకటి కాదు.. 100 కేసులు పెట్టుకున్నా.. తనకు ఇబ్బంది లేదని చెప్పుకొచ్చారు. ''ఎన్ని కేసులు పెడతారు.. పెట్టుకోండి. అప్పుడప్పుడు ఎందుకు.. ఒకేసారి 100 కేసులు పెట్టుకోండి.'' అని తనదైన శైలిలో వ్యాఖ్యానించారు. ఇక, అన్న క్యాంటీన్ల ద్వారా ఎంత మంది పేదలకు మేలు జరుగుతోందో చెప్పాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అన్న క్యాంటీన్లను తాము వచ్చాక మూసేస్తామా? ఉంచుతామా? అనేది పార్టీ అధినేత నిర్ణయాన్ని బట్టి ఉంటుందన్నారు. తమ పాలసీ మాత్రం అన్న క్యాంటీన్లు కాదని చెప్పారు. అందుకే.. తమ ప్రభుత్వంలో వాటిని తీసశామన్నారు.