అమెజాన్ 'పే'లో ఎఫ్‌డీ ఫీచర్.. నమ్మకమేనా?
అంతేకాదు.. మహిళలకు.. సీనియర్ సిటిజన్లకు కూడా అమెజాన్ పే యాప్ ద్వారా ఎఫ్‌డీలపై మరిన్ని వెసులుబాట్లు కల్పిస్తు న్నారు. వీరికి రూ.0.5 శాతం అదనపు వడ్డీ లభించనుంది.;
అమెజాన్.. ఈ పేరు తెలియని వారు ఉండరు. ఈ-కామర్స్‌లో దుమ్మురేపుతున్న ఈ సంస్థ.. ఇప్పుడు ఆర్థిక వ్యవహారాల విషయంలోనూ ప్రజలకు చేరువ అయ్యేందుకు ప్రయత్నిస్తోంది. ఇప్పటికే `అమెజాన్ పే` యాప్ ద్వారా చెల్లింపులు, నగదు లావాదేవీలను అందుబాటులోకి తీసుకు వచ్చిన విషయం తెలిసిందే. ఇతర యాప్‌ల మాదిరిగానే అత్యంత పారదర్శకంగా.. నమ్మకంగా `అమెజాన్ పే` కూడా సేవలు అందిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా `ఫిక్స్‌డ్ డిపాజిట్ల`(ఎఫ్‌డీ) ఫీచర్‌ను కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది.
అత్యంత తక్కువ సొమ్ముతోనే ఎఫ్‌డీ చేసుకునే వెసులుబాటు ఉండడంతోపాటు..అత్యధిక వడ్డీని కూడా అమెజాన్ పే అందిస్తోంది. అంతేకాదు.. ఎఫ్‌డీ ఖాతా ఓపెన్ చేయాలంటే.. ఇతర బ్యాంకుల్లో సేవింగ్స్ ఖాతా కూడా ఉండాలి. కానీ, అమెజాన్ మాత్రం సేవింగ్స్ ఖాతా లేకున్నా.. ఎఫ్‌డీ ఖాతాను ఓపెన్ చేసుకునే అవకాశం ఇచ్చింది. అంతేకాదు.. కేవలం రూ.1000తోనే దీనిని ప్రారంభించవచ్చు. వార్షికంగా.. 8 శాతం చొప్పున వడ్డీ ఇవ్వనున్నారు. ఇంట్లోనే కూర్చుని ఫోన్‌లోనే ఈ ఖాతాను తెరిచే సౌలభ్యం ఉండడం మరో విశేషమనే చెప్పాలి.
అంతేకాదు.. మహిళలకు.. సీనియర్ సిటిజన్లకు కూడా అమెజాన్ పే యాప్ ద్వారా ఎఫ్‌డీలపై మరిన్ని వెసులుబాట్లు కల్పిస్తు న్నారు. వీరికి రూ.0.5 శాతం అదనపు వడ్డీ లభించనుంది. ఇతర బ్యాంకులతో కొలాబరేషన్ కూడా చేసుకుంటారు. శివాలిక్, సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు, శ్రీరామ్ ఫైనాన్స్ వంటి పలు బ్యాంకులు, ఆర్థిక సంస్థలతో అమెజాన్ పే భాగస్వామ్యం కుదుర్చుకుంది. మొత్తంగా ఎఫ్‌డీలను అత్యంత చేరువకు తీసుకురావడం గమనార్హం. ఇక, అమెజాన్ విస్తృత కార్యకలాపాలు.. కోట్ల రూపాయల పెట్టుబడి.. నమ్మకం, విశ్వసనీయత వంటివాటిని పరిశీలిస్తే.. దీనినిలో పెట్టుబడి పెట్టడం.. మంచిదేనన్న నిపుణులు చెబుతున్న మాట. అమెరికాకు చెందిన అమెజాన్ దేశంలో సుమారు 20ఏళ్లుగా సేవలు అందిస్తున్న విషయం తెలిసిందే.