పార్లమెంట్ లో వైసీపీ స్టాండ్ ఏంటి ?
అమరావతి రాజధానిని శాశ్వతం చేస్తూ దానికి చట్టబద్ధమైన అధికారాన్ని కట్టబెట్టాలని కోరుతూ ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ద్వారా తీర్మానం ఆమోదించింది.;
అమరావతి రాజధానిని శాశ్వతం చేస్తూ దానికి చట్టబద్ధమైన అధికారాన్ని కట్టబెట్టాలని కోరుతూ ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ద్వారా తీర్మానం ఆమోదించింది. అయితే సభలో మొత్తం కూటమి ఎమ్మెల్యేలే ఉన్నారు కాబట్టి ఇది ఏకగ్రీవ తీర్మానం అనవచ్చో లేదో తెలియదు. ఎందుకంటే వైసీపీకి చెందిన 11 మంది ఎమ్మెల్యేలు కలిపితేనే అసెంబ్లీ అవుతుంది. కాబట్టి కూటమి ప్రభుత్వం చేసిన తీర్మానం గానే చూడాలి. మరి అమరావతి రాజధానికి వైసీపీ అనుకూలమా ప్రతికూలమా అన్నది అయితే వెల్లడి కాలేదు. ఆ పార్టీ తన స్టాండ్ ని ఎక్కడా చెప్పలేదు సరే ఆ పార్టీ రాష్ట్ర కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అమరావతికి తాము వ్యతిరేకం కాదని చెప్పారు. కానీ అసెంబ్లీకి నెగ్గిన వైసీపీ ఎమ్మెల్యేలు వచ్చి చెబితేనే చట్టబద్ధంగా స్టాండ్ ఏంటి అన్నది వైసీపీది తెలిసేది.
అక్కడైనా చెప్పాల్సిందే :
ఇక వైసీపీకి లోక్ సభలో నలుగురు, రాజ్యసభలో ఏడుగురు ఎంపీలు ఉన్నారు. ఆ రెండు సభలలోనూ అమరావతి రాజధాని మీద కేంద్రం ప్రవేశపెట్టబోయే బిల్లు వస్తుంది. మరి అప్పుడైనా వైసీపీ తన స్టాండ్ ఏమిటో చెబుతుందా లేదా అని అంతా ఆసక్తిగా చూస్తున్నారు. ఇక పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు రెండో విడత ఏప్రిల్ 2 దాకా కొనసాగనున్నాయి. అలా చివరి రోజు అయిన ఏప్రిల్ 2న అమరావతి బిల్లు పార్లమెంట్ ముందుకు వస్తుందని అంటున్నారు. దాని కోసం ఏపీ పునర్వ్యవస్థీకరణ బిల్లులో సవరణ చేయాలి. ఉమ్మడి రాజధాని అన్న చోట అమరావతి అని పేర్కొనాలి. కేంద్ర ప్రభుత్వం ఆ విధంగా విభజన చట్ట సవరణ చేస్తూ ప్రవేశపెట్టే బిల్లు ఉభయ సభల ముందుకు వస్తుంది అని అంటున్నారు.
వైసీపీ వైఖరి అలా :
ఇదిలా ఉంటే వైసీపీ తన వైఖరిని పార్లమెంట్ వేదికగా చెబుతుందా అంటే చెప్పవచ్చు అని అంటున్నారు. అది ఎలా అంటే అమరావతి రాజధానికి తాము అనుకూలం కానీ అక్కడ రాజధాని పేరుతో జరిగే దోపిడికి పూర్తి వ్యతిరేకమని వైసీపీ వాదిస్తోంది ఇపుడు కూడా అదే చెప్పవచ్చు అని అంటున్నారు. అంతే కాదు అక్కడ చదరపు అడుగుకు నిర్మాణానికి ఏకంగా 11 వేల రూపాయలు భారీ ఖర్చు చేస్తున్నారని వైసీపీ పదే పదే ఆరోపిస్తోంది. ఆ విషయాలను పార్లమెంట్ ముందు పెట్టవచ్చు అని అంటున్నారు. అదే విధంగా ఇప్పటిదాకా అమరావతికి తీసుకున్న భూములు పెట్టిన ఖర్చులు ఇంకా మరో యాభై వేల ఎకరాల భూములను తీసుకునే ప్రయత్నాల మీద వైసీపీ ఎంపీలు గట్టిగా చెప్పాల్సింది చెబుతారు అని అంటున్నారు. ఆ విధంగా వైసీపీ తాము అమరావతికి అనుకూలం అంటూనే కూటమి ప్రభుత్వం అక్కడ అవినీతి అక్రమాలను చేస్తోంది అన్నది పార్లమెంట్ దృష్టిలో పెడతారు అని అంటున్నారు.
కేంద్రానికి అసెంబ్లీ తీర్మానం :
ఇదిలా ఉంటే అమరావతికి చట్టబద్దత కల్పించాలని కేంద్రాన్ని కోరుతూ ప్రవేశపెట్టిన తీర్మానానికి ఏపీ శాసనసభ ఏకగ్రీవంగా అమోదించింది. విభజన చట్టం సెక్షన్-5(2)ను సవరించాలని కోరుతూ ఎట్ అమరావతి అనే పదాన్ని చేర్చాలంటూ అసెంబ్లీ తీర్మానం చేసింది. సీఆర్డీఏ నోటిఫై చేసిన ప్రాంతాలకు కూడా రాజధాని పరిధి వర్తింప చేసేలా చట్ట సవరణ కోరుతూ తీర్మానం చేసింది. ఈ తీర్మానాన్ని శాసన సభ కేంద్రానికి పంపించింది. రాజ్యసభ ఛైర్మన్, లోక్ సభ స్పీకర్ కు అమరావతిని రాజధానిగా చట్టబద్దత కోరుతూ అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని అసెంబ్లీ స్పీకర్ పంపించారు. అదే విధంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు తీర్మానం కాపీని స్పీకర్ అయ్యన్నపాత్రుడు పంపించారు. అలాగే తీర్మానం కాపీలను కేంద్ర హోం కార్యదర్శి ఏపీ సీఎస్ కు కూడా పంపించారు.