అమరావతి రాజధాని నచ్చట్లేదు... కేంద్ర మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

ఇక తాజాగా కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నేత చింతా మోహన్ మాట్లాడుతూ అమరావతి రాజధాని మీద సంచలన వ్యాఖ్యలు చేశారు.;

Update: 2025-05-15 12:57 GMT

టీడీపీ కూటమి ఏపీలో అధికారంలోకి వచ్చాక అమరావతి రాజధాని పట్టాలెక్కింది. శరవేగంగా అమరావతి రాజధాని నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి. మూడేళ్ళ వ్యవధిలో అమరావతి రాజధానికి ఒక రూపం ఇవ్వడానికి రంగం సిద్ధమైంది. ఇదిలా ఉంటే అమరావతి రాజధాని మీద మెల్లగా భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. ఈ మధ్యనే వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి సాకే శైలజానాధ్ అమరావతి రాజధాని కోసం పెద్ద ఎత్తున అప్పులు చేయడాన్ని తప్పు పట్టారు. నిధులు అన్నీ ఒకే చోట పోగు చేస్తే మిగిలిన ప్రాంతాల సంగతి ఏమిటని ప్రశ్నించారు.

ఇక తాజాగా కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నేత చింతా మోహన్ మాట్లాడుతూ అమరావతి రాజధాని మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతి రాజధాని ఎవరికీ నచ్చట్లేదని కుండబద్ధలు కొట్టారు. రాజధానికి వెయ్యి ఎకరాలు సరిపోవా అని ప్రశ్నించారు. దేశంలోని అన్ని రాజధానులకు వెయ్యి ఎకరాల భూమే ఉందని గుర్తు చేశారు.

ఇప్పటికే వేల ఎకరాల భూములను సేకరించి రాజధాని కోసమని చెబుతున్న పాలకులు ఇపుడు మరో 40 వేల ఎకరాలు కావాలి అని అంటున్నారని ఆయన విమర్శించారు. ఇన్నేసి వేల ఎకరాలు దేనికోసమే చెప్పాలని డిమాండ్ చేశారు. రాజధాని అనేది పారదర్శకంగా ఉండాలి తప్పితే రియల్ ఎస్టేట్ గా మరకూడదని ఆయన స్పష్టం చేశారు.

రాజధానికి వేల ఎకరాల భూములను తీసుకుని ఆ భూములను ఎవరికి అమ్ముతున్నారో ఎంతకి అముతున్నారో మాకు తెలుసు అని ఆయన చెప్పుకొచ్చారు. అమరావతి ప్రాంతంలో చిన్న గుంత తవ్వితే నీళ్లు వచ్చే భూమిలో 50 అంతస్తుల బిల్డింగ్ ఎందుకయ్యా చంద్రబాబూ అని నిలదీశారు.

ఏపీలో ఎన్నో వెనకబడిన ప్రాంతాలు ఉండగా లక్షల కోట్ల రూపాయల నిధులు వెచ్చించి ఒక్క అమరావతి రాజధానికి పెట్టడం ఎవరికి నచ్చట్లేదు అని ఆయన స్పష్టం చేశారు. అమరావతి రాజధాని విషయంలో ప్రభుత్వం ఏమి చేస్తుందో అక్కడ ఏమేమి జరుగుతున్నాయో అంతా గమనిస్తున్నారని చింతా మోహన్ అన్నారు. రేపటి రోజున ప్రజల నుంచి వచ్చే అనేక ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉంటుందని ఆయన కూటమి ప్రభుత్వానికి స్పష్టం చేశారు.

Tags:    

Similar News