'అమరావతి'పై అదే డౌట్... !
అయితే అసలు అమరావతి విషయంలో వైసిపి ఎలాంటి నిర్ణయంతో ఉంది వచ్చే ఎన్నికల్లో తాము కోరుకున్నట్టుగా ప్రజలు గెలిపిస్తే అమరావతి విషయంలో ఎటువంటి పంథాలు అనుసరిస్తారు?;
ఏపీ రాజధాని అమరావతి విషయంలో వైసీపీ అధినేత మళ్లీ అదే సందేహాన్ని మిగిల్చారు. సుదీర్ఘంగా మీడియాతో మాట్లాడిన జగన్ రాజధాని విషయానికి వచ్చేసరికి తమ స్టాండ్ ఏమిటో చెప్పకపోవడం అదేవిధంగా గతంలో తాను చేసిన మూడు రాజధానుల ప్రకటన విషయాన్ని ప్రస్తావించకపోవడం విశేషం. నిజానికి ఒక ఓటమి తర్వాత తప్పులు సరిచేసుకుంటూ రాజకీయ పార్టీలు, నాయకులు ముందుకు సాగుతారు. ప్రజల అభిప్రాయాలు తెలుసుకుంటారు.
ప్రజల నాడిని పట్టుకుని దానికి అనుగుణంగా అడుగులు వేస్తారు. ఈ విషయంలో ఇతర పార్టీలు ఎలా ఉన్నప్పటికీ వైసీపీలో మాత్రం ఆ తరహా మార్పులు కనిపించడం లేదనేది ప్రధాన విమర్శ. తాను పట్టుకున్న కుందేలుకు మూడు కాళ్ళే అన్నట్టుగా జగన్ వ్యవహరిస్తున్నారు అన్నది కూడా రాజకీయ వర్గాల్లో ఉన్న చర్చ. తాజాగా గురువారం రెండున్నర గంటల పాటు మీడియాతో మాట్లాడిన జగన్ అమరావతి రాజధాని విషయంలో అదనపు భూసేకరణను తప్పుపట్టారు.
చంద్రబాబు ఎందుకు ఇలా చేస్తున్నారని ప్రశ్నించారు మొదటి విడత తీసుకున్న భూములకే న్యాయం చేయలేదని ఇప్పుడు రెండో విడతలో భూములు ఎందుకని ఆయన ప్రశ్నించారు. అయితే అసలు అమరావతి విషయంలో వైసిపి ఎలాంటి నిర్ణయంతో ఉంది వచ్చే ఎన్నికల్లో తాము కోరుకున్నట్టుగా ప్రజలు గెలిపిస్తే అమరావతి విషయంలో ఎటువంటి పంథాలు అనుసరిస్తారు? అనే విషయాన్ని ముందు తేల్చాల్సిన అవసరం వైసీపీకి ఎంతో ఉంది. గత ఎన్నికల సమయంలో వైసీపీని తీవ్రంగా దెబ్బ కొట్టిన అమరావతి వ్యవహారం.. భవిష్యత్తులో ఆ పార్టీని పట్టి పీడిస్తుంది అన్నది వాస్తవం.
ఈ విషయాన్ని వదిలేసి లేనిపోని విమర్శలను రైతులని రెచ్చగొట్టేలాగా ఆయన వ్యాఖ్యానించడానికి పరిశీలకులు తప్పుపడుతున్నారు. ముందు అమరావతి విషయంలో వైసిపి స్టాండ్ ఏంటి అనేది చెప్పి ఆ తర్వాత ప్రభుత్వాన్ని ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను విమర్శిస్తే ఎవరైనా అర్థం చేసుకుంటారని లేకపోతే జగన్ విషయంలో గతంలో ఉన్న అభిప్రాయమే మరింత బలపడుతుంది అన్నది పరిశీలకులు చెబుతున్నా మాట. మరి ఏం చేస్తారనేది చూడాలి.