కృప‌లేని ల‌క్ష్మి.. వైసీపీలో ర‌చ్చ‌.. !

దీంతో నియోజ‌క‌వ‌ర్గాల్లో వారి ఉనికి అంతంత మాత్రంగానే ఉంది. ఇలాంటి వారిలో కృపాల‌క్ష్మి పేరు ప్ర‌ముఖంగా వినిపిస్తోంది.;

Update: 2026-03-13 19:30 GMT

వైసీపీలో నాయ‌కుల తీరు ఒక్కొక్క‌రిది ఒక్కొక్క విధంగా ఉంది. కొంద‌రు నాయ‌కులు వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సంబంధించి ఇప్పుడే పునాదులు వేసుకుంటున్నారు. మ‌రికొంద‌రు వేచి చూస్తున్నారు. వాస్త‌వానికి వ‌చ్చే ఎన్నిక‌ల‌కు ఇంకా స‌మ‌యం చాలానే ఉంది. ఈ నేప‌థ్యంలో చాలా మంది చూద్దాంలే. .. చేద్దాంలే.. అన్నట్టుగానే వ్య‌వ‌హ‌రిస్తున్నారు. దీంతో నియోజ‌క‌వ‌ర్గాల్లో వారి ఉనికి అంతంత మాత్రంగానే ఉంది. ఇలాంటి వారిలో కృపాల‌క్ష్మి పేరు ప్ర‌ముఖంగా వినిపిస్తోంది.

ఉమ్మ‌డి చిత్తూరు జిల్లాలోని గంగాధ‌ర నెల్లూరు నియోజ‌క‌వ‌ర్గం నుంచి గ‌త ఎన్నిక‌ల‌లో పోటీ చేసిన కృపా ల‌క్ష్మి.. మాజీ డిప్యూటీ సీఎం, సీనియ‌ర్ పొలిటీషియ‌న్‌.. కిళ‌త్తూరు నారాయ‌ణ‌స్వామి కుమార్తె. ఆయ‌న వార‌సురాలిగా రంగంలోకి వ‌చ్చిన కృపా ల‌క్ష్మి.. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు వ‌ర‌కు కూడా తెర‌చాటున తండ్రి రాజ‌కీయాల‌ను చ‌క్క‌దిద్దార‌న్న ప్ర‌చారం ఉంది. విజ‌య‌వాడ‌లోనే మ‌కాం ఉంటూ.. తండ్రి శాఖ‌ల‌ను ప‌రోక్షంగా ఆమె న‌డిపించారు.

ఆ తర్వాత‌.. నారాయ‌ణస్వామి వార‌సురాలిగా రంగంలోకి వ‌చ్చిన కృపాల‌క్ష్మి.. 75 వేలు ఓట్లు తెచ్చుకుని గ‌త ఎన్నిక‌ల్లో ఓడిపోయారు. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో విజ‌యం ద‌క్కించుకోవాలంటే.. ఆమె ఇప్ప‌టి నుంచే చాలా వ‌ర‌కు ప్ర‌య‌త్నాలు చేయాల‌న్న చ‌ర్చ ఉంది. కానీ, ఆమె మాత్రం ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు. క‌నీసంలో క‌నీసం.. 120000 ఓట్లను దక్కించుకునే స్థాయికి ఎదిగితేనే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో అయినా.. కృపా ల‌క్ష్మి విజ‌యం సాకారం అవుతుంది.

అయితే.. గ‌త ఎన్నిక‌ల నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు కృపా ల‌క్ష్మి గ్రాఫ్ ప‌రిశీలిస్తే.. పార్టీ కార్య‌క్ర‌మాల‌కు దూరంగా ఉంటున్నారు. పార్టీలో క‌లివిడి కూడా లేదు. ముఖ్యంగా ఓటు బ్యాంకు రాజ‌కీయాలు చేసే ఆస‌క్తి కూడా క‌నిపించ‌డం లేద‌ని సొంత పార్టీ నాయ‌కులే వ్యాఖ్యానిస్తున్నారు. ఈ ప‌రిణామాల‌తో ఆమెకు ప్ర‌జ‌ల నుంచి ఏమేర‌కు కృప ల‌భిస్తుంద‌న్న‌ది చ‌ర్చ‌నీయాంశంగా మారింది. మ‌రోవైపు.. ఇత‌ర నేత‌ల‌ను నారాయ‌ణ స్వామి ఎద‌గ‌నివ్వ‌డం లేద‌న్న విమ‌ర్శ‌లు కూడా వ‌స్తున్నాయి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ల‌క్ష్మి పోటీ చేస్తుంద‌ని అంటున్నారు. కానీ, ఆమె మాత్రం పార్టీకి, నియోజ‌క‌వర్గం నాయ‌కుల‌కు కూడా దూరంగా ఉండ‌డం గ‌మ‌నార్హం.

Tags:    

Similar News