అమరావతికి ఓకే.. కానీ, కండీషన్స్ అప్లై

ఇక మిథున్ రెడ్డి తర్వాత సభలో మాట్లాడిన కాంగ్రెస్, సమాజ్ వాది ఎంపీలు సైతం అమరావతి బిల్లును సమర్థిస్తూనే కొన్ని సూచనలు చేశారు.;

Update: 2026-04-01 12:59 GMT

రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించేందుకు గాను ఏపీ పునర్విభజన చట్టానికి సవరణలు చేసేందుకు లోక్ సభ ఆమోదముద్ర వేసింది. అధికార, విపక్షాలు అన్నీ ఈ చట్ట సవరణకు మద్దతు తెలపడంతో మూజువాణి ఓటుతోనే లోక్ సభ ఆమోదముద్ర వేసినట్లైంది. అయితే సభలో ఈ అంశంపై మాట్లాడిన వివిధ పార్టీలు బిల్లుకు మద్దతు చెబుతూనే కొన్ని అభ్యంతరాలు లేవనెత్తడం విశేషంగా వ్యాఖ్యానిస్తున్నారు. ప్రధానంగా బిల్లును యథాతథంగా ఆమోదించలేమంటూ వాకౌట్ చేసిన వైసీపీతోపాటు బిల్లును సమర్థించిన కాంగ్రెస్, ఎస్పీ తదితర పార్టీలు కొన్ని కీలకసూచనలు చేశాయి.

రాజధాని అమరావతి నిర్మాణం కోసం భూములు త్యాగం చేసిన రైతులకు ముందుగా న్యాయం చేయాలని వివిధ పార్టీలు సూచించాయి. ప్రధానంగా వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి మాట్లాడుతూ రాజధాని నిర్మాణం ఎప్పుడు పూర్తి చేస్తారు? రైతులకు అభివృద్ధి చేసి ఇస్తామన్న ప్లాట్లు ఎప్పుడిస్తారు? రైతులు ఎలా న్యాయం చేస్తారో ప్రభుత్వం స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. రాజధాని మొదటి దశ నిర్మాణం పూర్తికాకుండానే అదనపు భూ సమీకరణకు ఎందుకు వెళుతున్నారో స్పష్టం చేయాలని కోరారు.

ఇక మిథున్ రెడ్డి తర్వాత సభలో మాట్లాడిన కాంగ్రెస్, సమాజ్ వాది ఎంపీలు సైతం అమరావతి బిల్లును సమర్థిస్తూనే కొన్ని సూచనలు చేశారు. ప్రధానంగా సమాజ్ వాది పార్టీకి చెందిన ఎంపీ ధర్మేంద్ర యాదవ్ వ్యాఖ్యలు ఆసక్తికర చర్చకు దారితీశాయి. రాజధాని అమరావతి బిల్లును తాము సమర్థిస్తున్నామని, అయితే రాజధానిగా విశాఖను ఎంపిక చేస్తే బాగుండేదని ధర్మేంద్ర యాదవ్ వ్యాఖ్యానించారు. అదేవిధంగా తమ పార్టీ రైతుల పక్షపాతి అని పేర్కొంటూ రాజధాని రైతులకు తక్షణ న్యాయం చేయాలని సమాజ్ వాది తరపున డిమాండ్ చేస్తున్నామన్నారు.

కాంగ్రెస్ నేత మాణిక్కం ఠాగూర్ సైతం రాజధానిగా అమరావతికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఎవరూ ఏపీకి అన్యాయం చేయాలని చూసినా తమ పార్టీ అంగీకరించదని తేల్చిచెప్పారు. అయితే రాజధాని రైతులకు న్యాయం చేయడం విస్మరించొద్దని సూచించారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన తెలంగాణ ఎంపీలు రఘురామిరెడ్డి, గడ్డం వంశీకృష్ణ సైతం రాష్ట్ర పునర్విభజన సవరణ బిల్లుపై జరిగిన చర్చలో పాల్గొన్నారు. విభజన హామీలను నెరవేర్చాలని వంశీకృష్ణ కోరగా, ఖమ్మంజిల్లాకు చెందిన గ్రామాలను తిరిగి తెలంగాణకు వదిలేయాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు ఖమ్మం ఎంపీ రఘురామిరెడ్డి వ్యాఖ్యానించారు. మొత్తానికి రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే విషయంలో అన్నిపార్టీలు ఒకే మాటపై నిలబడినా, రాజధాని రైతుల విషయంలో విపక్షం కొంచెం గట్టిగా మాట్లాడటం ప్రత్యేకంగా నిలిచిందని అంటున్నారు.

Tags:    

Similar News