మళ్ళీ మొదలైన 'పుష్ప 2' వివాదం.. అల్లు అర్జున్ కు అవార్డుపై తెలంగాణ బీజేపీ ఫైర్!
తెలంగాణ ప్రభుత్వం 14 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత రాష్ట్ర సినిమా అవార్డులను తిరిగి ప్రారంభించింది.;
'పుష్ప-2' హీరో అల్లు అర్జున్‌కు తెలంగాణ ప్రభుత్వం గద్దర్ ఫిల్మ్ అవార్డు ప్రకటించడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో పెను దుమారం రేపుతోంది. ఒకవైపు, సినిమాలోని పోలీసు పాత్రను అవమానించారని, నేర ప్రవృత్తి, ఎర్రచందనం స్మగ్లింగ్‌ను ప్రోత్సహిస్తున్నారని గతంలో మంత్రి సీతక్క ఏకంగా కేంద్ర ప్రభుత్వాన్నే ప్రశ్నించారు. అయితే, ఇప్పుడు అదే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అల్లు అర్జున్‌కు ఉత్తమ నటుడిగా అవార్డు ఇవ్వడంతో మంత్రి సీతక్క గతంలో చేసిన వ్యాఖ్యలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ బీజేపీ (Telangana BJP) తీవ్ర విమర్శలతో విరుచుకుపడింది. "రంగు రంగుల జెండాలు మార్చిన రంగోలి రేవంత్ (CM Revanth Reddy) నాయకత్వంలో.. అసలు రంగు మర్చిపోయినట్టున్నారు కాంగ్రెస్ నాయకులు.." అంటూ ఎక్స్ (గతంలో ట్విట్టర్) వేదికగా ఓ వీడియోను షేర్ చేస్తూ కాంగ్రెస్ ద్వంద్వ నీతిని ఎండగట్టింది.
తెలంగాణ ప్రభుత్వం 14 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత రాష్ట్ర సినిమా అవార్డులను తిరిగి ప్రారంభించింది. ఈ అవార్డులకు అమరులైన ప్రజా యుద్ధనౌక గద్దర్ పేరు పెట్టడం విశేషం. 2014 నుండి 2023 వరకు విడుదలైన చిత్రాలకు ఈ అవార్డులను ప్రకటించారు. ఈ జాబితాలో, 'పుష్ప 2: ది రూల్' చిత్రంలో తన నటనకు గాను అల్లు అర్జున్ ఉత్తమ నటుడిగా ఎంపికయ్యారు. సహజంగానే ఈ ప్రకటన అల్లు అర్జున్ అభిమానుల్లో ఆనందం నింపింది. అయితే, దీనిపైనే రాజకీయ దుమారం మొదలైంది.
గతంలో మంత్రి సీతక్క 'పుష్ప' సినిమాపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు బీజేపీకి ప్రధాన అస్త్రంగా మారాయి. ఆమె ఆనాడు.. "నేర ప్రవృత్తి, ఎర్రచందనం స్మగ్లింగ్‌ను వంటి వాటిని ప్రొత్సహించే సినిమాకు జాతీయ అవార్డు ఇవ్వడం ఏమిటని" కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలను గుర్తు చేస్తూ తెలంగాణ బీజేపీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగింది. కల్పిత పాత్రలున్న సినిమాలోని ఒక పోలీసు క్యారెక్టర్‌ను అవమానించారని సినిమాకి అవార్డు ఇవ్వొద్దని కాంగ్రెస్ నాయకులు అంటారు. అదే సినిమా హీరోకి ఉత్తమ నటుడు అవార్డు కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే ఇస్తుందని విమర్శించారు. పోలీసులపై ఇంత ప్రేమ ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు.. అదే పోలీసుల ఊచకోతకు కారణమైన గద్దర్ పేరును ఉత్తమ అవార్డులకు పెడతారని..అమాయక ప్రజల, పోలీసుల ప్రాణాలను కబళించే నక్సలైట్లను కేంద్ర ప్రభుత్వం అణచివేస్తుంటే కాంగ్రెస్ నాయకులే అడ్డుపడతారంటూ బీజేపీ ఆరోపించింది.
తెలంగాణ బీజేపీ తన వీడియోలో మంత్రి సీతక్కను ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ.. కల్పిత పాత్ర అయిన పోలీసును సినిమాలో అవమానిస్తే బాధపడుతున్న మంత్రి సీతక్క .. నిజ జీవితంలో పోలీసులను ఊచకోత కోసిన నక్సలైట్లకు శ్రద్ధాంజలి ఘటిస్తారు.. వారి ఆశయ సాధనకు పాటు పడతామంటారు.. నక్సలిజం నిర్మూలనకు పూనుకున్న మోడీ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తారని తీవ్ర ఆరోపణలు చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం కపట బుద్ధి చూసి.. ఊసరవెల్లి కూడా ఉరేసుకుంటుందని ఎక్స్‌లో తీవ్ర విమర్శలు చేశారు. ఇది కాంగ్రెస్ పార్టీ వైఖరిలో ఉన్న విరుద్ధతను ఎత్తి చూపడానికి బీజేపీ చేసిన ప్రయత్నంగా కనిపిస్తుంది. అల్లు అర్జున్‌కు అవార్డు ప్రకటన ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఒక కొత్త చర్చకు దారి తీస్తూనే ఉంది.