వైఎస్సార్, జగన్, షర్మిళ, రేవంత్... ఆర్కే ఆసక్తికర వ్యాఖ్యలు!
ఈ సమయంలో తాజాగా ఆ విషయాలపై స్పందించిన ఆయన... వైసీపీకి తాను ఎంత సేవ చేశాననేది తనకు తెలుసని.. తాను సర్వస్వం పోగొట్టుకున్నానని.. అన్నారు.
సర్వేల ఫలితాలు, కార్యకర్తల సూచనలు, ప్రజల అభిప్రాయాలు, సామాజిక సమీకరణలు ప్రాతిపదికగా ఏపీ సీఎం వైఎస్ జగన్ పలు నియోజకవర్గాల్లో ఇన్ ఛార్జ్ లను మారుస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇప్పటికే అధికారికంగా 11 నియోజకవర్గాలకు ఇన్ ఛార్జ్ లను మార్చారు. ఈ సమయంలో అటు ఎమ్మెల్యే పదవికి, ఇటు పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసిన ఆర్కే తాజాగా ఆసక్తికరవ్యాఖ్యలు చేశారు.
అవును... మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇటీవల ఎమ్మెల్యే పదవితో పాటు వైసీపీ సభ్యత్వానికీ రాజినామా చేసిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో తాజాగా ఆ విషయాలపై స్పందించిన ఆయన... వైసీపీకి తాను ఎంత సేవ చేశాననేది తనకు తెలుసని.. తాను సర్వస్వం పోగొట్టుకున్నానని.. అన్నారు. ఇదే సమయంలో ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు షర్మిళకు అప్పగిస్తే... తాను ఆమె వెంట నడుస్తానంటూ ఆర్కే సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇదే సమయంలో తన నియోజకవర్గ అభివృద్ధికి రావాల్సిన నిధులు రాలేదని.. ఫలితంగా కాంట్రాక్టర్లకు బిల్లులు అందక చాలా ఇబ్బందులు ఎదుక్రొన్నారని.. 1200 కోట్ల నుంచి 125 కోట్లు తన నియోజకవర్గ అభివృద్ధి నిధులు తగ్గించారని.. ఆ తగ్గించిన నిధులలో పైసా కూడా ఇప్పటివరకూ రాకపోవడం జరిగిందని చెప్పుకొచ్చారు.
ఒకవైపు సంక్షేమం చేస్తూనే అభివృద్ధి చేయని పక్షంలో.. ప్రధానంగా మంగళగిరి లాంటి నియోజకవర్గంతో పాటు కుప్పం, గాజువాక, భీమవరం వంటి నియోజకవర్గాల్లో అయినా అభివృద్ధి పనులు చేయాలని సూచించారు. ఇటీవల పులివెందులలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్న జగన్... మరి తాను నివాసం ఉంటున్న మంగళగిరిని కూడా అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ఉందని అన్నారు.
మంగళగిరి అభివృద్ధికి నిధులు విడుదల కాకపోవడంతో కాంట్రాక్టర్లు తనపై ఒత్తిడి తెచ్చారని.. ఈ సమయంలో తాను సీఎంవోకు పదే పదే వెళ్లి అడిగినా ప్రయోజనం జరగలేదని.. తానే స్వయంగా రూ.8 కోట్ల వరకు బయట అప్పులు తెచ్చి కాంట్రాక్టర్లకు ఇచ్చానంటూ పేర్కొన్నారు ఆర్కే. ఈ సందర్భంగా మంగళగిరి నియోజకవర్గంలో లోకేష్ ను ఓడించిన తనకు సహకారం అందించకపోతే ఎలాగంటూ ప్రశ్నించారు.
ఇక తాను వైఎస్సార్ భక్తుడిని అని, ఆయన మనిషిని అని చెబుతున్న ఆర్కే... వైఎస్ షర్మిళ వెంట నడుస్తానని అన్నారు. కాంగ్రెస్ పార్టీ తరుపున షర్మిళమ్మ ఏపీకి వస్తే తాను ఆమె వెంట నడుస్తానని అన్నారు. ఇదే సమయంలో ఓటుకు నోటు కేసు సుప్రీంకోర్టులో ఉందని.. రేవంత్ రెడ్డి సీఎం అయినా, పీఎం అయినా ఆ కేసు విషయంలో తన పోరాటం ఆగదని చెప్పడం గమనార్హం.
ఇక మంగలగిరి నూతన ఇన్ ఛార్జ్ గంజి చిరంజీవితో కానీ, వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో కానీ తనకు ఎలాంటి విభేదాలు లేవని... ఇక తానెందుకు బయటకు వచ్చిందీ జగన్ మోహన్ రెడ్డి మనసుకు తెలుసని ఆర్కే వ్యాఖ్యానించారు.