మాజీ ఉప ముఖ్యమంత్రి....శాసించిన చోట మౌనంగా !

ఆయన మాజీ ఉప ముఖ్యమంత్రి. పైగా కీలక శాఖలు చూశారు. రాజకీయంగా దూకుడుగా వెళ్లారు.;

Update: 2025-09-24 04:15 GMT

ఆయన మాజీ ఉప ముఖ్యమంత్రి. పైగా కీలక శాఖలు చూశారు. రాజకీయంగా దూకుడుగా వెళ్లారు. జిల్లాలో తన మాటే వేదవాక్కు అనిపించుకున్నారు. తన చుట్టూ పార్టీని నేతలను తిప్పుకున్నారు. ఒక విధంగా చెప్పాలీ అంటే తన ప్రాంతానికి ఒక సామంత రాజుగా వెలిగారు. అయితే ఓడలు బళ్ళు అయ్యాయి. ఆయన రాజకీయం కూడా అలాగే మారిపోయింది. ఇపుడు ఆయన ఏమి చేస్తున్నారు అంటే సింపుల్ గానే అర్ధం చేసుకోవాలి. సైలెన్స్ ఆయన వ్యూహంగా మారింది. ఆయనే ఆళ్ళ నాని.

ఉన్నారంటే ఉన్నారు :

ఆయన కొద్ది నెలల క్రితం టీడీపీలో చేరిపోయారు. దాని కంటే ముందు కొన్నాళ్ళ క్రితం వైసీపీని వీడారు. రాజకీయాలకు దూరం అని కూడా చెప్పారు. అయితే ఇదంతా ఒక ప్రణాళికాబద్ధంగా ఆయన చేసుకుంటూ ఫ్యాన్ పార్టీకి గుడ్ బై కొట్టారు అని తరువాత అనుకున్న విషయం. అయితే వైసీపీని వీడేందుకు కారణాలు ఆయన మాటుకు ఆయనకు ఉండొచ్చు కానీ వీడి టీడీపీలో చేరి ఏమి దక్కించుకున్నారు అన్నదే ఇపుడు ప్రశ్నగా మారింది అంటున్నారు. సైకిలెక్కినా అధికార ప్రభలు ఏవీ దరి చేయడం లేదు. పార్టీలో ఉన్నారంటే ఉన్నారు అని అంటున్నారు.

పిలుపులూ లేవటగా :

ఏలూరు జిల్లాలో ఆళ్ళ నాని ఒకనాడు అంతా తానై శాసించారు అలాంటి చోట పార్టీ మారి టీడీపీలో చేరారు. కానీ టీడీపీ నేతలు అయితే ఆయనను ఇంకా ప్రత్యర్థిగానే చూస్తున్నారు. ఆయన అవతల వైపు నిలిచి ఇవతల తమను ఇబ్బంది పెట్టారని అధికారంలో ఉన్నపుడు తమ మీదనే కేసులు పెట్టారని వారంతా గుర్తు పెట్టుకున్నారు. అందుకే ఆయన తమ పార్టీ వారిగా చూడడం లేదు అని అంటున్నారు. ఇక జిల్లాలో పార్టీ కార్యక్రమాలు కానీ ఏ అధికార వేడుకలకు కానీ నానికి పిలుపులు లేవని అంటున్నారు. ఆయన టీడీపీ నాయకుడని తమ పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు అని కానీ ఎవరూ అసలు ఆలోచించడం లేదు అని అంటున్నారు. దాంతో నాని మౌనమే నా భాష అని కాలక్షేపం చేస్తున్నారని అంటున్నారు.

నో గ్యారంటీనా :

మరో మూడున్నరేళ్ళలో ఏపీలో సార్వత్రిక ఎన్నికలు ఉన్నాయి. మరి నాని టీడీపీలో చేరినపుడు అధినాయకత్వం ఏ హామీ ఇచ్చిందో తెలియదు కానీ ఆయనకు వచ్చే ఎన్నికల్లో టికెట్ దక్కుతుందా అంటే డౌటే అని అంటున్నారు. ఎందుకంటే మూడు పార్టీలతో కూటమి ఉంది. టీడీపీలోనూ లెక్కలేనంతమంది నేతలు ఉన్నారు. వారిని దాటుకుని ఆయన వద్దకు టికెట్ రావడం కష్టమే అంటున్నారు. పైగా ఆయన పార్టీలో మొదటి నుంచి ఉన్న నేత కాదని ముద్ర కూడా వేస్తారు అని అంటున్నారు. దాంతో ఎన్నికల వేళకు ఆళ్ళ నాని తిరిగి తన మాతృ సంస్థ అయిన వైసీపీలోకి వెళ్తారా అన్న టాక్ అయితే నడుస్తోంది. మొత్తం మీద చూస్తే మాజీ ఉప ముఖ్యమంత్రి కేరాఫ్ మౌనంగా ఆళ్ళ నాని వర్తమానం ఉందని అంటున్నారు.

Tags:    

Similar News