వందల విమానాలు ఒకేసారి ల్యాండ్... అలస్కా ఎయిర్ లైన్స్ కు ఏమైంది..!

ఈ సమయంలో ఒకేసారి వందల విమానాలు ల్యాండ్ చేసిన ఘటన తెరపైకి వచ్చింది. సాంకేతిక సమస్య దీనికి కారణం అని అంటున్నారు.;

Update: 2025-07-21 07:42 GMT

గత కొంతకాలంగా.. ప్రధానంగా అహ్మదాబాద్ ఎయిరిండియా ఘటన జరిగినప్పటి నుంచి విమానాలకు సంబంధించిన వార్తలు నెట్టింట వైరల్ గా మారుతున్న సంగతి తెలిసిందే. దీనికి తగ్గట్లుగానే వరుసగా సాంకేతిక సమస్యల అంశాలు తెరపైకి వస్తున్నాయి. ఈ సమయంలో ఒకేసారి వందల విమానాలు ల్యాండ్ చేసిన ఘటన తెరపైకి వచ్చింది. సాంకేతిక సమస్య దీనికి కారణం అని అంటున్నారు.

అవును... అమెరికాకు చెందిన అలాస్కా ఎయిర్‌ లైన్స్‌ వందల విమానాలను ల్యాండ్‌ చేయాల్సి వచ్చింది. ఆదివారం రాత్రి 8 గంటల సమయంలో తొలిసారి ఐటీ సిస్టమ్స్‌ లో ఇబ్బందులు ఎదురవ్వడంతో ఓ ప్లాన్ ప్రకారం అలాస్కా, హారిజోన్‌ ఎయిర్‌ లైన్స్‌ కు చెందిన విమానాలను ల్యాండ్‌ చేసినట్లు ఆ సంస్థ వెల్లడించింది. సాంకేతిక సమస్య తలెత్తడంతో వందల విమానాలు నిలిపేయడం చర్చనీయాంశంగా మారింది.

యుఎస్ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్.ఏ.ఏ.) ఇచ్చిన అడ్వైజరీ నోటీసు ప్రకారం.. అలాస్కా ఎయిర్‌ లైన్స్ తన అన్ని ప్రధాన విమానాలను గ్రౌండ్ స్టాప్ చేయాలని అభ్యర్థించిందని.. 'ఐటీ అంతరాయం' దీనికి కారణం అని పేర్కొందని స్థానిక మీడియా వెల్లడించింది. ఈ సందర్భంగా స్పందించిన అలెస్కా ఎయిర్ లైన్స్ ప్రయాణికులకు క్షమాపణ చెప్పింది.

సియాటెల్‌ కేంద్రంగా ఈ ఎయిర్‌ లైన్స్‌ సాంకేతిక సమస్య ప్రభావం సోమవారం సాయంత్రం వరకు ఉండొచ్చని పేర్కొంది. ఈ ఎయిర్‌ లైన్స్‌ నిర్ణయంతో వివిధ గమ్యస్థానాలకు చేరాల్సిన విమానాలు నిలిచిపోయాయి. సమాచారం ఆలస్యంగా వెల్లడించారంటూ సంస్థపై ప్రయాణికులు ఫైరవుతున్నారు.

ఈ క్రమంలో తాజాగా అలెస్కా ఎయిర్ లైన్స్ ఎక్స్ వేదికగా స్పందించింది. ఇందులో భాగంగా... ఐటీ అంతరాయాన్ని పరిష్కరించుకుని తిరిగి కార్యకలాపాలు ప్రారంభించినట్లు వెల్లడించింది. ఈ అసౌకర్యానికి తాము హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నామని చెబుతూ... విమానాశ్రయానికి వెళ్లే ముందు మీ విమాన స్థితిని తనిఖీ చేయమని కోరింది.

కాగా... సుమారు ఏడాదిక్రితం ఇదే విమానయాన సంస్థ కొత్తగా కొనుగోలు చేసిన బోయింగ్‌ 737 మ్యాక్స్ విమానం గాల్లో ఉండగానే డోర్‌ ఊడిపోయిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో విమానంలో 171 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నారు. అయితే.. ఎలాంటి ప్రమాదం జరగకుండా ఆ విమానం సురక్షితంగా ల్యాండ్‌ అయ్యింది.

ప్రస్తుతం అలాస్కా గ్రూప్‌ 238 బోయింగ్‌ 737లు, 87 ఎంబ్రార్‌ 175 విమానాలు నిర్వహిస్తోంది. ఐటీ సమస్య తలెత్తడంతో వీటన్నింటినీ ఒకేసారి నిలిపేసింది.

Tags:    

Similar News