మేఘాల పైన ఊరు.. ఒక్క చుక్క వర్షం లేదు.. ప్రపంచంలోనే అత్యంత పొడి ప్రదేశం ఇదే
ఈ భూమ్మీద ఒక్క చుక్క వర్షం పడని ఊరు ఒకటుందని తెలుసా ? చాలామందికి ఈ విషయం తెలియదు. యెమెన్‌లోని 'అల్-హుతైబ్' అనే గ్రామంలో ఇప్పటివరకు ఒక్కసారి కూడా వర్షం కురవలేదట.;
ఈ భూమ్మీద ఒక్క చుక్క వర్షం పడని ఊరు ఒకటుందని తెలుసా ? చాలామందికి ఈ విషయం తెలియదు. యెమెన్‌లోని 'అల్-హుతైబ్' అనే గ్రామంలో ఇప్పటివరకు ఒక్కసారి కూడా వర్షం కురవలేదట. ఇది యెమెన్ రాజధాని సనాకు పశ్చిమాన దాదాపు 3,200 మీటర్ల ఎత్తులో ఉన్న ఒక కొండపై ఉంది. నిపుణులు చెప్పేదాని ప్రకారం.. ఈ ప్రాంతం మేఘాల కంటే చాలా ఎత్తులో ఉండడం వల్లే ఇక్కడ వర్షాలు పడడం లేదట. అంటే, మేఘాలు ఈ ఊరి కింద నుంచి వెళ్ళిపోతాయి కానీ, వర్షాన్ని మాత్రం ఇవ్వవు. అందుకే ఈ ఊరిని ప్రపంచంలోనే 'డ్రై సిటీ' అని కూడా అంటారు.
ఇక్కడ ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఈ ఊరిలో ఎక్కువగా ఉండేది అల్-బోహ్రా తెగకు చెందిన ప్రజలు. వీళ్ళని యెమెన్ కమ్యూనిటీస్‌గా పిలుస్తారు. వీళ్ళు అసలు మన ముంబై నుంచి ఇక్కడకు వచ్చి స్థిరపడ్డారట. వర్షం పడకపోతే ఈ ప్రజలు ఎలా బతుకుతున్నారని మీకు డౌట్ రావచ్చు. నిజానికి యెమెన్‌లో నీటి సమస్య చాలా ఎక్కువ. సనాలో అయితే మరీ దారుణం. అందుకే సనా మున్సిపల్ వాటర్ కార్పొరేషన్ 2007లో కొత్త పద్ధతులు తీసుకొచ్చింది. మొబైల్ వాటర్ ట్యాంకర్ల ద్వారా సిటీ మొత్తానికి నీటిని సరఫరా చేస్తున్నారు. కొండపై ఎత్తులో ఉన్న అల్-హుతైబ్‌కు కూడా మొబైల్ ట్యాంకర్లతో పాటు, పైపుల ద్వారా నీటిని అందిస్తున్నారు.
వర్షం లేకపోయినా, అల్-హుతైబ్ ఒక అద్భుతమైన ప్రదేశం. మేఘాల కంటే ఎత్తులో ఉండటం వల్ల ఇక్కడి వాతావరణం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఉదయం సూర్యుడు ఉదయించే వరకు చలిగా ఉంటుంది, సూర్యుడు రాగానే వేడి మొదలవుతుంది. మళ్ళీ సాయంత్రానికి చల్లగా మారిపోతుంది. ఈ వింతైన గ్రామాన్ని చూడటానికి చాలామంది టూరిస్టులు వస్తుంటారు. మేఘాలు తమ చేతికి అందేంత దగ్గరగా ఉండటం, చుట్టూ పచ్చని ప్రకృతి దృశ్యాలు టూరిస్టులను బాగా ఆకర్షిస్తాయి. అంతేకాదు, కొండ కింది భాగంలో చిన్న చిన్న జలపాతాలు కూడా చాలా అందంగా ఉంటాయి. ఇక్కడ 'క్వాట్' అనే ఒక ప్రత్యేకమైన మొక్కను ఎక్కువగా పండిస్తారు.
ఇదిలా ఉంటే, ప్రపంచంలో అత్యధిక వర్షపాతం నమోదయ్యే ప్రాంతం మన భారతదేశంలోనే ఉంది. మేఘాలయ రాష్ట్రంలోని మౌసిన్ రామ్ అనే గ్రామంలో ఏడాది పొడవునా భారీ వర్షాలు కురుస్తాయి. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రకారం, భూమిపై అత్యంత తేమ కలిగిన ప్రదేశం ఇదే. ఇక్కడ సగటు వార్షిక వర్షపాతం ఏకంగా 11,871 మిల్లీమీటర్లు. ఒక్కోసారి సంవత్సరంలో 26,000 మిల్లీమీటర్ల వర్షపాతం కూడా నమోదైన సందర్భాలు ఉన్నాయి. మేఘాలయ రాజధాని షిల్లాంగ్ కూడా భారీ వర్షపాతం పొందే ప్రాంతమే. బంగాళాఖాతం నుంచి వచ్చే నైరుతి రుతుపవనాలు ఈ ప్రాంతంలో భారీ వర్షాలకు కారణం.