'ఏపీ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్'... పురందేశ్వరి వ్యాఖ్యలు వైరల్!
అవును... రాజమండ్రి పుష్కర ఘాట్ వద్ద రూ.94.44 కోట్ల వ్యయంతో అఖండ గోదావరి ప్రాజెక్టు చేపట్టారు.;
చారిత్రక నగరం రాజమహేంద్రవరంలో ‘అఖండ గోదావరి’ ప్రాజెక్టుకు కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ మంత్రి కందుల దుర్గేశ్, ఏపీ బీజేపీ చీఫ్ - ఎంపీ పురందేశ్వరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రసంగించిన పురందేశ్వరి.. ప్రారంభంలో చేసిన చిన్న తడబాటు వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి.
అవును... రాజమండ్రి పుష్కర ఘాట్ వద్ద రూ.94.44 కోట్ల వ్యయంతో అఖండ గోదావరి ప్రాజెక్టు చేపట్టారు. దీంతో చారిత్రక నగరం రాజమహేంద్రవరం ఇకపై మరింతగా పర్యాటక శోభను సంతరించుకోనుందని అంటున్నారు. పుష్కరాల నాటికి ఇది పూర్తి కానుందని చెబుతున్నారు. ఈ సందర్భంగా... సుమారు రూ.140 కోట్లతో మూడు కీలక అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు.
ఇందులో భాగంగా... రూ.94.44 కోట్లతో రాజమహేంద్రవరంలోని పుష్కరాల రేవు, 127 ఏళ్ల చరిత్ర ఉన్న హేవలాక్ వంతెన రూపురేఖలు మార్చడంతో పాటు గోదావరి మధ్యలో 116.97 ఎకరాల్లో బ్రిడ్జిలంకను వినోద కేంద్రంగా మార్చనున్నారు. దీని ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 8 వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని భావిస్తున్నారు.
ఈ సందర్భంగా స్పందించిన పవన్ కల్యాణ్... ఎంతో కాలంగా ఉన్న కలను సాకారం చేసే దిశగా ముందుకెళ్లడం ఆనందదాయకమని తెలిపారు. ఈ సందర్భంగా.. పర్యటక రంగంలో యువతకు ఎక్కువ ఉపాధి అవకాశాలు ఉంటాయని.. ఈ ప్రాజెక్టు పూర్తయితే ప్రతీ ఏటా సుమారు 4 లక్షల మంది పర్యటకులు పెరిగే అవకాశముందని తెలిపారు.
ఈ సందర్భంగా ప్రసంగించిన రాజామండ్రి ఎంపీ, ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి... పవన్ కల్యాణ్ ను పొరపాటున "ముఖ్యమంత్రి" అని సంభోదించారు. ఇందులో భాగంగా... "ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు, పెద్దలు, సోదరులు పవన్ కల్యాణ్ గారికి" అని పురందేశ్వరి పలికారు. దీంతో.. ఒక్కసారిగా ఈ విషయం వైరల్ గా మారింది.
పవన్ కల్యాణ్ ను "ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు" అని పురందేశ్వరి అనగా... అభిమానులంతా ఒక్కసారిగా కేకలు, ఈలలు వేశారు. దీంతో పొరపాటు గ్రహించిన పురందేశ్వరి.. "డిప్యూటీ సీఎం" అని సరిదిద్దుకున్నారు. మరోవైపు దీనికి సంబంధించిన వీడియో బైట్ ను పవన్ ఫ్యాన్స్ తెగ షేర్ చేస్తున్నారు.