భారత్ కా 'షేర్' ఏకే 203... ప్రత్యేకతలు తెలుసుకోవాల్సిందే!
అవును... ఉత్తరప్రదేశ్ లోని అమేథీలో భారత్-రష్యా భాగస్వామ్యంతో ఏర్పాటైన ఇండో-రష్యన్ రైఫిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ఐ.ఆర్.ఆర్.పీ.ఎల్).. 'షేర్' పేరుతో ఏకే-203 రైఫిళ్లను తయారుచేస్తోంది.;
భారత్ ఎప్పటికప్పుడు తన ఆయుధశక్తిని అప్ డేట్ చేసుకుంటూనే ఉంది. ఆపరేషన్ సిందూర్ సమయంలో ప్రత్యక్షంగా పాక్ కు, పరోక్షంగా చైనాకు ఈ విషయంపై స్పష్టత వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో కలాష్నికోవ్ సిరీస్ లో అత్యాధునికమైన ఏకే-203 రైఫిళ్లు అనుకున్న సమయానికంటే ముందే భారత్ ఆర్మీకి అందనున్నాయని తెలుస్తోంది.
అవును... ఉత్తరప్రదేశ్ లోని అమేథీలో భారత్-రష్యా భాగస్వామ్యంతో ఏర్పాటైన ఇండో-రష్యన్ రైఫిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ఐ.ఆర్.ఆర్.పీ.ఎల్).. 'షేర్' పేరుతో ఏకే-203 రైఫిళ్లను తయారుచేస్తోంది. నిమిషానికి 700 రౌండ్లు ఫైర్ చేయగల సామర్థ్యం ఈ రైఫిల్ సొంతం కాగా... 800 మీటర్ల దూరంలోని లక్ష్యాలను ఇది అత్యంత కచ్చితత్వంతో ఛేదించగలుగుతుంది.
వాస్తవానికి రూ.5,200 కోట్ల ఈ భారీ కాంట్రాక్టులో భాగంగా 2032 అక్టోబరు నాటికి సుమారు ఆరు లక్షల కంటే పైగా ఏకే 203 రైఫిళ్లను అందజేయాల్సి ఉంది. అయితే.. అనుకున్న సమయానికంటే 22 నెలల ముందు.. అంటే 2030 నాటికే వీటిని భద్రతా దళాలకు ఇచ్చేస్తామని ఐ.ఆర్.ఆర్.పీ.ఎల్. సీఈఓ - మేనేజింగ్ డైరెక్టర్ మేజర్ జనరల్ ఎస్.కె.శర్మ తాజాగా వెల్లడించారు.
ఈ సందర్భంగా విలేకరులతో మాట్లడుతూ... ఇప్పటివరకు సుమారు 48,000 రైఫిళ్లు పంపిణీ చేయబడ్డాయని.. రాబోయే రెండు, మూడు వారాల్లో మరో 7,000 రైఫిళ్లు అందజేయబడతాయని తెలిపారు. ఇదే క్రమంలో ఈ సంవత్సరం డిసెంబర్ నాటికి మరో 15,000 రైఫిళ్లు అందజేయబడతాయని ఎస్.కె.శర్మ తెలిపారు.
కొన్ని దశాబ్దాలుగా సాయుధ దళాలు ప్రముఖంగా వినియోగించే (ఇండియన్ స్మాల్ ఆర్మ్స్ సిస్టమ్) ఇన్సాస్ రైఫిళ్ల స్థానంలో ఆర్మీ వీటి వినియోగం పెంచనుంది. వీటి మ్యాగజైన్ లో ఒకేసారి ముప్పై కార్ట్రిడ్జ్ లను ఉంచవచ్చు. ఇన్సాస్ (4.15 కిలోలు) తో పోల్చుకుంటే ఏకే 203 రైఫిల్ బరువు తక్కువ (3.8 కిలోలు)గా ఉంటుంది. ఇన్సాస్ (960 మి.మీ) తో పోల్చుకుంటే ఈ షేర్ పొడవు (705 మి.మీ) కూడా తక్కువే!