మృత్యుంజయుడి మహిమ... విమానాల్లో 11ఏ సీటుకు అదనపు పేమెంట్!
ఈ నెల 12న అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరిన ఎయిరిండియా విమానం బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్.. టెకాఫ్ అయిన కొద్దిసేపటికే కుప్పకూలిపోయిన సంగతి తెలిసిందే;
ఈ నెల 12న అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరిన ఎయిరిండియా విమానం బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్.. టెకాఫ్ అయిన కొద్దిసేపటికే కుప్పకూలిపోయిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న 230 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బందిలో.. ఒక్క ప్రయాణికుడు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. దీంతో.. ఆయన కూర్చున్న సీటుకు ఇప్పుడు డిమాండ్ విపరీతంగా పెరిగింది!
అవును... అహ్మదాబాద్ లో ఎయిరిండియా విమానం బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్.. టెకాఫ్ అయిన కొద్దిసేపటికే కుప్పకూలిపోయిన ఘటనలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీతో సహా 241 మంది మృతి చెందగా.. ఒకే ఒక్క ప్రయాణికుడు మృత్యుంజయుడుగా నిలిచిన సంగతి తెలిసిందే. ఎమర్జెన్సీ ఎగ్జిట్ పక్కనున్న 11ఏ సీటులో కూర్చున్న వ్యక్తి బ్రతికారు.
ఇందులో భాగంగా... విశ్వాస్ కుమార్ రమేష్ అనే ప్రయాణికుడు తాను కూడా ఊహించని రీతిలో గాయాలతో బ్రతికి బయటపడ్డారు. దీంతో.. ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ దగ్గర ఉన్న సీట్లు ప్రమాదంలో నుంచి బయటపడటంలో మిగిలినవాటి కంటే చాలా రెట్లు సహకరిస్తాయనే నమ్మకం విమాన ప్రయాణికుల్లో పెరిగిందనే చర్చ మొదలైంది. దీనిపై సోషల్ మీడియా వేదికగా చర్చ విపరీతంగా జరుగుతుంది.
ఈ సందర్భంగా... ట్రావెల్ ఏజెన్సీలు, బుకింగ్ ఫ్లాట్ ఫామ్ లు ఎమర్జెన్సీ ఎగ్జిట్ పక్కనున్న సీట్ల కోసం కస్టమర్స్ రిక్వస్ట్ లు విపరీతంగా పెరిగాయని చెబుతున్నాయి. కొంతమంది ప్రయాణికులు ఈ సీటు కోసం అవసరమైతే అదనంగా చెల్లించడానికి సైతం సిద్ధంగా ఉన్నారని అంటున్నాయి. దీంతో... అహ్మదాబాద్ ప్రమాదం అనంతరం ఈ సీట్ల డిమాండ్ ఆసక్తిగా మారింది.
వాస్తవానికి టేకాఫ్ కు ముందు క్యాబిన్ సిబ్బంది ఇచ్చే అడిషనల్ సెక్యూరిటీ సూచనల కారణంగా చాలా మంది ప్రయాణికులు ఈ ఎమర్జెన్సీ ఎగ్జిట్ పక్కనున్న సీట్లను ప్రిఫర్ చేయరని చెబుతుంటారు. అయితే.. తాజాగా జరిగిన ఘోర విమాన ప్రమాదంలో ఆ సీట్లో కూర్చున్న రమేష్ సజీవంగా బయటపడటంతో ఆలోచనలు మారుతున్నాయని అంటున్నారు.
అయితే.. దీనిపై స్పందించిన నిపుణులు.. ఎమర్జెన్సీ ఎగ్జిట్ వద్ద ఉన్న సీట్లు కాళ్లకు అదనంగా కాస్త స్పేస్ ను ఇస్తాయి తప్ప.. ప్రమాద సమయలో అడిషనల్ సెక్యూరిటీని ఏమీ ఇవ్వదని చెబుతున్నారు! అయితే... విమానంలోని మిగిలిన భాగాల్లో ఉన్న సీట్లతో పోలిస్తే వెనుక భాగంలో ఉన్న సీట్లలో భద్రత కాస్త ఎక్కువగా ఉంటుందని అధ్యయనం వెల్లడించిన సంగతి తెలిసిందే.