టాటా బ్రాండ్ కు పరీక్ష పెడుతున్న ఎయిరిండియా

తాజాగా దేశ రాజధాని ఢిల్లీ నుంచి కెనడాలోని వాంకోవర్ కు ఎయిరిండియా బయలుదేరింది. ఏ విమాన ప్రయాణికుడు కూడా కలలో కూడా ఊహించని రీతిలో ఎయిరిండియా సిబ్బంది వ్యవహరించారు.;

Update: 2026-03-21 04:51 GMT

నాణ్యత.. అంతకు మించిన నమ్మకం ఒక వ్యాపార సంస్థ మీద దశాబ్దాలుగా కొనసాగటం.. అది కూడా భారతదేశం లాంటి అత్యధిక జనాభా కలిగిన దేశంలో సొంతం చేసుకోవటం అంత సులువైన పని కాదు. మతం.. ప్రాంతం.. కులం పేరుతో కిందా మీదా పడే దేశంలో.. వాటన్నింటికి అతీతంగా ఒక బ్రాండ్ దేశ ప్రజలందరి మనసుల్ని దోచుకోవటం అంత తేలికైన విషయం కాదు. అలాంటి అరుదైన ఇమేజ్ ను సొంతం చేసుకుంది టాటా గ్రూపు. దీని పరిధిలోని కంపెనీలన్నింటి విషయంలో దేశ ప్రజలకు ఒకలాంటి భరోసాను ఇచ్చింది. అప్పటివరకు ఎయిరిండియా మీద ఉన్న సందేహాలు టాటా చేతికి వచ్చిన తర్వాత ఒకలాంటి నమ్మకాన్ని ఇచ్చింది.

అయితే.. ఆ నమ్మకాన్నివమ్ము చేసేలా వ్యవహరిస్తోంది ఎయిరిండియా. తాజాగా దేశ రాజధాని ఢిల్లీ నుంచి కెనడాలోని వాంకోవర్ కు ఎయిరిండియా బయలుదేరింది. ఏ విమాన ప్రయాణికుడు కూడా కలలో కూడా ఊహించని రీతిలో ఎయిరిండియా సిబ్బంది వ్యవహరించారు. ఇంతకూ ఆ షాకింగ్ అనుభవం ఏమంటే.. కెనడాకు వెళ్లాల్సిన విమానానికి బదులుగా మరో విమానాన్ని పంపారన్న విషయం తెలిసినప్పుడు నోట మాట రాదంతే. అలాంటి ఘనకార్యం ఎయిరిండియాకే దక్కుతుందేమో..?

ఎయిరిండియాకు చెందిన ఏఐ185 విమానం గురువారం ఉదయం 11.34 గంటలకు ఢిల్లీ నుంచి ప్రయాణికులతో బయలుదేరింది. కెనడాకు బయలుదేరిన ఆ విమానం చైనా గగనతలంలోకి ప్రవేశించిన తర్వాత తేలిన విషయం ఏమంటే.. సదరు విమానానికి కెనడాలో ల్యాండ్ అయ్యేందుకు అనుమతి లేదని. కారణం.. షెడ్యూల్ ప్రకారం వెళ్లాల్సిన విమానానికి బదులుగా మరో విమానం వెళ్లటం. ఎయిరిండియాకు చెందిన బోయింగ్ 777-300ఈఆర్ శ్రేణి విమానానికే కెనడాలో ల్యాండ్ అయ్యే అనుమతి ఉంది. అందుకు భిన్నంగా పొరపాటున మరో విమానాన్ని పంపటంతో దాన్ని తిరిగి ఢిల్లీకి తీసుకొచ్చారు. దాదాపు ఎనిమిది గంటల పాటు ప్రయాణించిన తర్వాత తిరిగి వచ్చేసింది.

దీంతో విమానంలోని ప్రయాణికులకు హోటల్ లో బస సౌకర్యం కల్పించి.. తర్వాతి రోజు ఉదయం (శుక్రవారం) వేరే విమానంలో కెనడాకు పంపారు. ఈ పరిణామంతో ఎయిరిండియాకు తీవ్రమైన నష్టం వాటిల్లింది. ఎనిమిది గంటల పాటు ప్రయాణించిన దానికి 9 టన్నుల ఇంధనాన్ని ఖర్చు చేయటంతో పాటు.. ప్రయాణికులకు స్టార్ హోటల్ లో బస సౌకర్యాన్ని కల్పించటంతో తీవ్ర నష్టం వాటిల్లినట్లుగా చెబుతున్నారు. ఈ ఉదంతం గురించి తెలిసిన వారంతా ముక్కున వేలేసుకుంటున్నారు.

టాటా యాజమాన్యంలోకి వచ్చిన తర్వాత ఎయిరిండియా పని తీరులో గణనీయమైన మార్పు వస్తుందని ఆశించినా.. అదంతా సాధ్యం కాలేదు. ఇటీవల కాలంలో ఈ సంస్థకు చెందిన విమానాలకు సంబంధించి చోటు చేసుకుంటున్న ఉదంతాలు తీవ్ర విమర్శలకు తావిచ్చేలా చేస్తున్నాయి. గత ఏడాది జూన్ 12న అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్లాల్సిన ఎయిరిండియా విమానం టేకాఫ్ అయిన కొద్ది నిమిషాలకే కూలిపోవటం..సుమారు 270 మందికి పైనే మరణించిన విషాద ఉదంతం గురించి తెలిసిందే.

విదేశీ ప్రయాణాల్లో విరిగిన సీట్లు.. అపరిశ్రుభమైన వాష్ రూంలు.. నాసిరకం ఫుడ్ లాంటి ఉదంతాలతో వినియోగదారుల కోర్టు ఎయిరిండియాకు ఫైన్లు వేస్తోంది. తరచూ ఎదురవుతున్న సాంకేతిక సమస్యలతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. గ్రూప్ లోని 75 శాతం విమానాలు సాంకేతిక సమస్యలు ఎదుర్కొంటున్న దుస్థితి. ఎయిరిండియాను సొంతం చేసుకోవటానికి టాటా గ్రూప్ వేలాది కోట్ల రూపాయిల్ని పెట్టుబడిగా పెట్టింది.అయినప్పటికీ దీర్ఘకాలం ప్రభుత్వ రంగ సంస్థగా ఉన్న ఈ విమానయాన సంస్జలో పని చేసే ఉద్యోగుల పని తీరును మార్చటం సాధ్యం కావటం లేదు. మొత్తానికి ఎయిరిండియా పని తీరు సంగతేమో కానీ.. టాటా గ్రూప్ ఇమేజ్ మాత్రం దారుణంగా ప్రభావితమవుతున్న పరిస్థితి.


Tags:    

Similar News