మరో ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం.. ముంబై చేరకముందే...!

ఈక్రమంలో తాజాగా శాన్ ఫ్రాన్సిస్కో నుంచి కోల్ కతా మీదుగా ముంబైకి బయలుదేరిన మరో ఎయిరిండియా విమానంలో సాంకేతిక సమస్య వచ్చింది.;

Update: 2025-06-17 04:17 GMT

ఎయిరిండియా విమానాలకు సంబంధించి వరుస ఘటనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రధానంగా అహ్మదాబాద్ లో జరిగిన ఘోర విమానం ప్రమాదం తర్వాత ఆ సంస్థకు చెందిన విమానాలు వరుసగా సాంకేతిక సమస్యలకు గురవుతున్నాయి. ఈక్రమంలో తాజాగా శాన్ ఫ్రాన్సిస్కో నుంచి కోల్ కతా మీదుగా ముంబైకి బయలుదేరిన మరో ఎయిరిండియా విమానంలో సాంకేతిక సమస్య వచ్చింది.

అవును... మంగళవారం తెల్లవారుజామున శాన్ ఫ్రాన్సిస్కో నుండి కోల్‌ కతా మీదుగా ముంబైకి బయలుదేరిన మరో ఎయిర్ ఇండియా విమానం ఇంజిన్‌ లో సాంకేతిక లోపం తలెత్తడంతో నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానశ్రయంలో నిలిపివేయబడింది. పీటీఐ ప్రకారం.. విమానం ఎడమ ఇంజిన్ లో సమస్య ఎదురైంది.

ఎయిరిండియా విమానం ఏఐ 180 శాన్ ఫ్రాన్సిస్కో నుంచి కోల్ కతా మీదుగా ముంబైకి వెళ్తోంది. ఈ క్రమంలో మంగళవారం అర్ధరాత్రి 12:45 గంటలకు కోల్ కతా విమానాశ్రయానికి చేరుకుంది. ఈ క్రమంలో విమానంలో ఇంజిన్ లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో.. సిబ్బంది వెంటనే సమస్యను గుర్తించి అప్రమత్తమయ్యారు

దీంతో.. అయితే 12:45 కి చేరుకున్న అనంతరం సుమారు నాలుగు గంటలకు పైగా వేచి ఉన్న తర్వాత ఉదయం 5:20 గంటలకు ప్రయాణికులు విమానం నుంచి దిగిపోవాల్సిందని సూచిస్తూ ఒక ప్రకటన వెలువడింది. ఈ సందర్భంగా స్పందించిన కెప్టెన్... భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రయాణికులకు తెలియజేశారు.

కాగా... ఎయిరిండియా బోయింగ్‌ 787-8 డ్రీమ్‌ లైనర్‌ విమానం సోమవారం ఉదయం హాంకాంగ్‌ విమానాశ్రయం నుంచి బయల్దేరి, మధ్యాహ్నం 12:20 గంటలకు ఢిల్లీలో ల్యాండ్‌ అవ్వాల్సి ఉండగా.. మార్గమధ్యలో విమానంలో సాంకేతిక లోపం తలెత్తినట్లు పైలట్‌ ఇన్‌ - కమాండ్‌ గుర్తించి, అప్రమ్తతమై విమానాన్ని వెనక్కి మళ్లించిన సంగతి తెలిసిందే.

మరోవైపు లండన్ నుంచి చెన్నైకి బయలుదేరిన బ్రిటిష్ ఎయిర్ వేస్ బోయింగ్‌ 787-8 డ్రీమ్‌ లైనర్‌ విమానంలోనూ సమస్య తలెత్తడంతో అర్ధాంతరంగా తిరిగి లండన్ కు మళ్లించారు. ఆదివారం ఉదయం 7 గంటలకు ఉత్తరప్రదేశ్‌ లోని గాజియాబాద్‌ నుంచి బయల్దేరిన ఎయిరిండియా ఎక్స్ ప్రెస్ విమానం.. 9:20 గంటలకు కోల్‌ కతాకు చేరాల్సి ఉండగా.. సాంకేతిక లోపం తలెత్తడంతో రన్‌ వేపైనే గంటసేపు ఉండాల్సి వచ్చింది.

ఇక శనివారం రాత్రి 9:20 గంటలకు గుహవాటి అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి కోల్ కతాకు 170 మంది ప్రయాణికులతో వెళ్లాల్సిన ఎయిరిండియా విమానం.. సాంకేతిక సమస్య పేరుతో ఆలస్యమైంది. ఇలా వరుసగా ఎయిరిండియా విమానాల్లో జరుగుతున్న సంఘటనలు తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్నాయి.

Tags:    

Similar News