అకస్మాత్తుగా 900 అడుగుల కిందికి దిగిన విమానం... రంగంలోకి డీజీసీఏ!
అవును... గత నెలలో జరిగిన ఎయిరిండియా ప్రమాదం వందల కుటుంబాల్లో తీవ్ర దుఖాన్ని, తీరని శోకాన్ని మిగిల్చిన సంగతి తెలిసిందే.;
గత నెల 12వ తేదీన అహ్మదాబాద్ నుంచి లండన్ కు బయలుదేరిన ఎయిరిండియా విమానం ఒక్కసారిగా కుప్పకూలిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటన దేశం మొత్తాన్ని ఒక్కసారిగా తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈఘటనలో 241 మంది ప్రయాణికులు, 19 మంది పౌరులు మరణించారు. అయితే.. అది జరిగిన రెండు రోజుల్లోపే మరో ఎయిరిండియా విమానం తృటిలో ఘోర ప్రమాదాన్ని తప్పించుకుందనే విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
అవును... గత నెలలో జరిగిన ఎయిరిండియా ప్రమాదం వందల కుటుంబాల్లో తీవ్ర దుఖాన్ని, తీరని శోకాన్ని మిగిల్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ విమాన ప్రమాదం జరిగిన రెండు రోజుల్లోపే మరో ఎయిరిండియా విమానం తృటిలో ఘోర ప్రమాదాన్ని తప్పించుకుంది. ఇందులో భాగంగా.. ఢిల్లీ నుంచి వియన్నాకు బయలుదేరిన బోయింగ్ విమానం ఒక్కసారిగా 900 అడుగుల మేర కిందికి దిగిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
జూన్ 14న ఢిల్లీ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన విమానం... కొద్దిసేపటికే అకస్మాత్తుగా భూమి సమీపంలోకి దిగిపోవడం మొదలుపెట్టింది. దీంతో... వెంటనే వార్నింగ్ సిగ్నల్ వెలువడింది. ఇదే సమయంలో... పైలట్లు భద్రతాపరమైన చర్యలు చేపట్టారు. దీంతో.. విమానం కంట్రోల్ లోకి వచ్చింది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో కూడా సురక్షితంగా విమాన ప్రయాణాన్ని కొనసాగించారు.
అయితే... అప్పటికి రెండు రోజుల క్రితం జూన్ 12న అహ్మదాబాద్ లో ఘోర విమాన ప్రమాదం జరిగి ఉండటంతో.. ఆ విమానంలోని ప్రయాణికులంతా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) విచారణకు ఆదేశించింది. ఈ సమయంలో... ఆ ఇద్దరు పైలట్లను విధులకు దూరంగా ఉంచాలని ఆదేశించడంతో పాటు ఎయిరిండియాకు జూన్ 17న సమన్లు జారీ చేసింది.
కాగా... గత నెలలో అహ్మదాద్ లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో 242 మంది ప్రయాణికుల్లో ఒకేఒక్క వ్యక్తి మాత్రం ప్రాణాలతో బయటపడిన సంగతి తెలిసిందే. ఇదే సమయలో సమీపంలోని స్థానికులు 19 మంది చనిపొయారు. ఇలా ఈ ప్రమాదంలో 260 మంది మరణించారు. దీంతో.. భారతదేశ చరిత్రలో జరిగిన ఘోర విమాన ప్రమాదాల్లో ఇది ఒకటిగా నిలిచింది.
మరోవైపు ఈ ప్రమాదంపై ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (ఏఏఐబీ) దర్యాప్తు చేస్తోన్న సంగతీ తెలిసిందే. ఈ క్రమంలో బ్లాక్ బాక్స్ లోని డేటాను బయటకు తీసే ప్రక్రియను టెక్నికల్ టీమ్ ప్రారంభించిందని.. అనంతరం జూన్ 25న మెమొరీ మాడ్యూల్ ను విజయవంతంగా యాక్సెస్ చేసి, అందులోని డేటాను ఏఏఐబీ ల్యాబ్ లో డౌన్ లోడ్ చేశామని పౌర విమానయాన శాఖ వెల్లడించిన సంగతి తెలిసిందే.