పైలట్లే స్విచ్ ఆఫ్ చేశారా.. ఎయిరిండియా క్రాష్ రిపోర్టుపై సుప్రీం ఫైర్
ఆ నివేదిక బయటకు వచ్చిన వెంటనే పైలట్లపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై పైలట్ల సంఘం ఘాటుగా స్పందిస్తూ.. ఒక ప్రాథమిక నివేదిక ఆధారంగా పైలట్లను టార్గెట్ చేయడం అన్యాయం అని వ్యాఖ్యానించింది.;
గుజరాత్‌లోని సర్దార్ పటేల్ విమానాశ్రయం నుంచి లండన్‌కి బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన కొన్ని క్షణాల్లోనే కూలిపోవడం దేశాన్ని కుదిపేసింది. ఈ భయానక ఘటనలో దాదాపు 300 మంది ప్రాణాలు కోల్పోవడం మానవ విషాదంగా నిలిచింది. ప్రమాదానికి కారణాలపై వెలువడిన ప్రాథమిక దర్యాప్తు నివేదికలో పైలట్ల తప్పిదమే కారణమని పేర్కొనడం చర్చనీయాంశమైంది.
పైలట్లపై విమర్శలు – సంఘాల అభ్యంతరం
ఆ నివేదిక బయటకు వచ్చిన వెంటనే పైలట్లపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై పైలట్ల సంఘం ఘాటుగా స్పందిస్తూ.. ఒక ప్రాథమిక నివేదిక ఆధారంగా పైలట్లను టార్గెట్ చేయడం అన్యాయం అని వ్యాఖ్యానించింది. ఈ వాదనలు కొంతకాలం చర్చకు దారి తీసినా.. తర్వాత వ్యవహారం నిశ్శబ్దంలో కలిసిపోయింది.
సుప్రీంకోర్టులో పిటిషన్
ఇప్పుడీ ఘటన మళ్లీ తెరపైకి వచ్చింది. ఒక పౌరుడు సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వాజ్యం దాఖలు చేస్తూ, పైలట్ల తప్పిదమే కారణం అని తేల్చిన ప్రాథమిక నివేదికను ఆధారంగా తీసుకుని స్వతంత్ర దర్యాప్తు జరగాలని కోరాడు. ఈ వాజ్యంపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
పైలట్లను టార్గెట్ చేయొద్దు : సుప్రీంకోర్టు
“ప్రాథమిక నివేదికల ఆధారంగా పైలట్లను టార్గెట్ చేయడం బాధ్యతారాహిత్యం. రేపు తుది నివేదికలో పైలట్ తప్పు చేయలేదని తేలితే, ఆ కుటుంబం ఎదుర్కొన్న అవమానం ఎవరూ సరిచేయగలరా?” అని ధర్మాసనం ప్రశ్నించింది. అంతేకాదు, దురదృష్టవశాత్తు కొన్ని సందర్భాల్లో ఇలాంటి ఘటనలతో ప్రత్యర్థి విమానయాన సంస్థలు లాభపడతాయని సుప్రీంకోర్టు గమనించింది.
DGCA, పౌర విమానయాన మంత్రిత్వ శాఖకు నోటీసులు
ఈ ఘటనపై పారదర్శకంగా, న్యాయంగా, వేగవంతమైన దర్యాప్తు జరగాలి అని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో DGCA, పౌర విమానయాన మంత్రిత్వ శాఖలకు నోటీసులు పంపింది.
తయారీదారులపై ఆరోపణలు ఎందుకు రావు?
“ఎయిర్‌బస్ లేదా బోయింగ్ వంటి తయారీదారులపై ఎలాంటి ఆరోపణలు రావు. ఎందుకంటే వారు విమానాన్ని సక్రమంగా నడుపుతూ అవసరమైన క్లియరెన్స్‌లు పొందుతారు. ఇలాంటి సమయంలో ఎవరూ పుకార్లు సృష్టించడం, పరిస్థితిని తప్పుగా సూచించడం చేయరాదు” అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
ఎయిర్ ఇండియా ఘోర విమాన ప్రమాదంపై సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవడంతో బాధిత కుటుంబాలకు కొంత న్యాయం దొరికే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. పైలట్లను బలిపశువులుగా మార్చకుండా, నిజమైన కారణాలు వెలుగులోకి రావాలని సమాజం ఆశిస్తోంది.