'దర్యాప్తులో పారదర్శకత కనిపించలేదు'... ఏఎల్ఎఫ్ఏ షాకింగ్ రియాక్షన్!
అవును... ఎయిరిండియా విమాన ప్రమాదంపై ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఇచ్చిన నివేదిక వైరల్ గా మారిన సంగతి తెలిసిందే.;
అహ్మదాబాద్ లో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదంపై ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (ఏఏఐబీ) ఇచ్చిన ప్రాథమిక నివేదిక ఈ రోజు ప్రజల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే! అయితే.. అప్పుడే దీనిపై ఎలాంటి నిర్ధారణకు రావొద్దని విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ స్పందించిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఎయిర్ లైన్స్ పైలట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఏఎల్ఎఫ్ఏ) నివేదికను ఖండించింది.
అవును... ఎయిరిండియా విమాన ప్రమాదంపై ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఇచ్చిన నివేదిక వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. ఇందులో ప్రధానంగా... కాక్ పీట్ వాయిస్ రికార్డింగ్ లో... "స్విచ్ లు ఎందుకు ఆపారంటూ ఒక పైలట్ మరో పైలట్ ను ప్రశ్నించారు.. తాను చేయలేదని మరో పైలట్ సమాధానమిచ్చారు" అని ఉందనే విషయంపై తీవ్ర చర్చ జరుగుతోంది. దీనిపై ఏఎల్ఎఫ్ఏ స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యింది.
ఇందులో భాగంగా.. మీడియాకు లీక్ అయిన ఈ నివేదికపై బాధ్యతాయుత స్థానంలో ఉన్న ఏ అధికారి సంతకం లేదని మొదలుపెట్టిన ఏఎల్ఎఫ్ఏ.. ఈ దర్యాప్తులో ఎటువంటి పారదర్శకత కనిపించలేదంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇదే సమయంలో... అత్యంత గోప్యంగా జరిగిన ఈ ప్రక్రియ ఎంతగానో ఆశ్చర్యపర్చిందని.. నిపుణులైన మరీ ముఖ్యంగా లైన్ పైలట్లు ఆ దర్యాప్తులో భాగం కాలేదని అని ఏఎల్ఎఫ్ఏ / ఆల్ఫా అధ్యక్షుడు సామ్ థామస్ అన్నారు.
ఈ సందర్భంగా ఇటీవల అమెరికా మీడియా వాల్ స్ట్రీట్ జర్నల్ లో వచ్చిన కథనంపైనా "ఆల్ఫా" స్పందించింది. ఇందులో భాగంగా.. విమానం ఇంజిన్ ఇంధన స్విచ్ ల అనుకోని కదలికలు ఈ దుర్ఘటనకు కారణమంటూ వాల్ స్ట్రీట్ జర్నల్ లో వచ్చిన కథనాన్ని ప్రస్థావిస్తూ.. ఇలాంటి సున్నితమైన సమాచారం మీడియాకు లీక్ కావడంపై దిగ్భ్రాంతి వ్యక్తంచేసింది. పారదర్శకత కోసం పరిశీలకులుగా తమను తదుపరి విచారణలో భాగం చేసుకోవాలని కోరింది!
కాగా... ఏఏఐబీ ప్రాథమిక నివేదిక విడుదలైన కొన్ని గంటల్లోనే స్పందించిన పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు... ప్రపంచంలోనే అత్యంత ప్రతిభ కలిగిన పైలట్లు, సిబ్బంది మన దగ్గర ఉన్నారని.. వారు పౌర విమానయానానికి వెన్నెముక వంటివారని.. ఈ రంగానికి వారే ప్రధాన వనరులని.. అలాంటి వారి సంక్షేమం, శ్రేయస్సు కోసం తమ ప్రభుత్వం పనిచేస్తుందని.. ఇలాంటి సమయంలో ఎలాంటి నిర్ధారణకు రాకుండా తుది నివేదిక కోసం వేచిచూద్దామని అన్నారు.