విమాన ప్రమాదంలో పెరిగిన మృతుల సంఖ్య.. పూర్తి వివరాలివే!
ఇదే సమయంలో... మరో ఆరుగురిని ముఖాలతో నిర్ధారించినట్లు తెలిపిన రాష్ట్ర ఆరోగ్యశాఖ... గుర్తించినవారిలో 120 మంది పురుషులు, 124 మంది మహిళలు, 16 మంది చిన్నారులు ఉన్నారని తెలిపింది.;
జూన్ 12వ తేదీన దేశంలో అత్యంత ఘోర ఘటన చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరిన ఎయిరిండియా విమానం ఘోర ప్రమాదానికి గురైంది. టెకాఫ్ అయిన కొద్ది క్షణాల్లోనే కుప్పకూలిపోయింది. ఆ సమయంలో ఒక్కసారిగా అగ్నిగోళంలా మారిపోయింది. ఈ నేపథ్యంలో.. ఈ ఘటనలోని మృతుల వివరాలను గుజరాత్ ప్రభుత్వం వెల్లడించింది.
అవును... అహ్మదాబాద్ లో చోటు చేసుకున్న ఎయిరిండియా విమాన ప్రమాదంలో మొత్తం 241 మంది ప్రయాణికులు, 33 మంది స్థానికులు కలిసి మొత్తం 274 మంది మృతి చెందినట్లు ఇంతకాలం ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే! అయితే.. అహ్మదాబాద్ ఎయిరిండియా ప్రమాదంలో మొత్తం 275 మంది ప్రాణాలు కోల్పోయినట్లు గుజరాత్ ఆరోగ్యశాఖ వెల్లడించింది.
ఇందులో 241 మంది ప్రయాణికులు కాగా.. 34 మంది స్థానికులు ఉన్నట్లు తెలిపింది. జూన్ 12న జరిగిన ఈ ఘోర ప్రమాదంలో జరిగిన ప్రాణనష్టానికి సంబంధించి రాష్ట్ర ఆరోగ్యశాఖ తొలిసారి అధికారికంగా ఈ వివరాలను వెల్లడించింది. ఇదే సమయంలో.. మృతదేహాలకు డీ.ఎన్.ఏ. పరీక్షలు నిర్వహించడం ద్వారా ఇప్పటివరకూ 260 మందిని గుర్తించినట్లు తెలిపింది.
ఇదే సమయంలో... మరో ఆరుగురిని ముఖాలతో నిర్ధారించినట్లు తెలిపిన రాష్ట్ర ఆరోగ్యశాఖ... గుర్తించినవారిలో 120 మంది పురుషులు, 124 మంది మహిళలు, 16 మంది చిన్నారులు ఉన్నారని తెలిపింది. ఆ 260 మృతదేహాల్లోనూ ఇప్పటివరకు 256 మృతదేహాలను బాధిత కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు వెల్లడించింది. మిగతావారిని గుర్తించే ప్రక్రియ కొనసాగుతోందని ప్రకటించింది.
కాగా... జూన్ 12న గుజరాత్ లోని అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరిన ఎయిరిండియా విమానం.. టేకాఫ్ అయిన కొన్ని క్షణాల్లోనే కుప్పకూలిపోయిన సంగతీ తెలిసిందే. ఇందులో భాగంగా విమానాశ్రయానికి సమీపంగా ఉన్న ఓ మెడికల్ కాలేజ్ హాస్టల్ సముదాయాలపై పడిపోయింది. ఘటన సమయంలో విమానంలో 242 మంది ఉండగా.. 241 మంది మృతి చెందారు.
విమానంలో ఉన్నవారిలో 11ఏ సీటులో ఉన్న ఒక్క వ్యక్తి మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు. చికిత్స అనంతరం ఇటీవల ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. మరోవైపు ఈ ప్రమాదానికి గల కారణాలను ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (ఏఏఐబీ) దర్యాప్తు చేస్తుంది.